కోనేరుసెంటర్ (మచిలీపట్నం), న్యూస్‌లైన్ : వివాహం పేరుతో యువతిని మోసగించిన కుటుంబంపై పోలీసులు తగిన చర్యలు తీసుకుని బాధితురాలికి తక్షణమే న్యాయం జరిగేలా చూడాలని మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు కోటే రామచంద్రరావు (చిన్నా) డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మాలమహానాడు ఆధ్వర్యంలో బాధితురాలు తరపున పోరాటాలకు సిద్దపడతామని ఆయన హెచ్చరించారు. వివాహం అనంతరం భర్త చేతిలో మోసపోయిన బాధితురాలితో కలిసి సోమవారం జిల్లా మాలమహానాడు నాయకులు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉన్నతాధికారులకు జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేశారు.
స్థానిక ఆర్ ఆర్ భవన్‌లో బాధితురాలితో కలిసి విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామచంద్రరావు బాధితురాలికి జరిగిన అన్యాయాన్ని వివరించారు. గుంటూరు జిల్లా తెనాలి గ్రామం గంగానమ్మపేటకు చెందిన గడ్డం థామస్ కుమారుడు సాధూథామస్‌కు పమిడిముక్కల మండలం మామిడికోళ్ళపల్లి గ్రామ శివారు గండ్రవానిగూడెంకు చెందిన జుజ్జువరపు అశోక్ కుమార్తె సునీతతో మూడేళ్ల కిందట వివాహం జరిగింది. కొన్నాళ్లు బాగానే కాపురం చేసిన ఈయన ‘మా కుటుంబానికి నువ్వు సరిపోవు మమ్మల్ని వదిలి వెళ్ళిపో ‘అంటూ బెదిరించటంతోపాటు కొట్టడం, పలు పత్రాలపై సంతకాలు పెట్టించుకోవడంతో భయపడి అక్కడి నుంచి తప్పించుకొని పమిడిముక్కల పోలీసులకు ఫిర్యాదు చేసి అక్కడి నుంచి ఘంటసాలలోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్లిపోయింది.
అయినా వదలకుండా హత్యాయత్నాలకు ప్రయత్నించగాఘంటసాల పోలీస్‌స్టేషన్‌లోనూ బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఈ నెల 4వ తేదీన కేసు నమోదు చేసినా ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. సంఘటనపై విచారణ జరిపించి తనకు తగిన న్యాయం చేసి భర్త అతని కుటుంబసభ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని సునీత కోరారు అభ్యర్థించారు.
ఈ సమావేశంలో మాలమహానాడు జిల్లా ఉపాధ్యక్షుడు జక్కుల మోషే, కార్యదర్శి బండి సుబ్బారావు, అరుంధతి బంధు సంక్షేమ సేవా మండలి రాష్ట్ర కార్యదర్శి దిరిశం బాలకోటయ్య, ఘంటసాల మండలం సోషల్ యాక్షన్ కమిటీ నాయకులు పీ పీ ఎం బేగం, కళ్ళేపల్లి కమల, జి సీతామహాలక్ష్మి, ఎ రాధా, బాధితురాలి కుటుంబసభ్యులు పాల్గొన్నారు.
వంచన ‘వరున్ని’ శిక్షించండి
Published Tue, Dec 31 2013 1:26 AM | Last Updated on Tue, Aug 21 2018 5:44 PM
Advertisement
Advertisement