నగర శివారులో ఘోర రోడ్డు ప్రమాదం
భార్యాభర్తలు సహా నలుగురు దుర్మరణం
పెళ్లికి వస్తూ అనంతలోకాలకు.. మృతులంతా ఒడిశావాసులే
మేనల్లుడి వివాహానికి బయలుదేరారు.. ఒడిశా రాష్ట్రం గుణుపూరు నుంచి విశాఖ చేరుకోవడానికి కారులో వస్తున్నారు.. మరో పావుగంటలో గమ్యానికి చేరుకుంటారనగా.. ఘోర రోడ్డు ప్రమాదం.. క్షణాల్లో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.. శుక్రవారం తెల్లవారుజామున కొమ్మాది, మారికవలస మధ్యలో ఈ దుర్ఘటన జరిగింది. భార్యాభర్తలు సహా నలుగురు దుర్మరణం పాలయ్యారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.
పీఎం పాలెం (విశాఖపట్నం): ఇసుకతోట ప్రాంతంలో నివసిస్తున్న మేనల్లుడి పెళ్లి.. ఎంతో ఉత్సాహంగా బయలుదేరారు.. బంధుమిత్రులతో కలిసి కారులో వస్తున్నారు.. కాసేపట్లోనే గమ్యస్థానం చేరుకుంటారనగా పెను ప్రమాదం. ఈ దుర్ఘటనలో అసువులు బాసిన భార్యాభర్తలను చూసి కళ్లు చెమర్చనివారు లేరు. ఈ దంపతులతోపాటు మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం తెల్లవారు జామున కొమ్మాది - మారికవలసల మధ్య జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒడిశా రాష్ట్రం గుణుపూరు మండలం గుడారి గ్రామంలో సేనపూరి మాధవరావు (55) వ్యాపారిగా స్థిరపడ్డారు. విశాఖలో మేనల్లుడి పెళ్లికి భార్య మోహిని (45), సమీప బంధువులు ఆదిత్య త్రిపాఠి (30), సింహాద్రి దిలీప్ (20), సింహాద్రి నెహ్రూ (30)లతో కలిసి గురువారం రాత్రి కారులో బయలుదేరారు. గమ్యానికి మరో 15 కిలోమీటర్ల దూరంలో.. ఇక బంధువుల ఇంటికి చేరుకుంటామనగా ప్రమాదానికి లోనయ్యారు.
ఇంజనీరింగ్ చదువుతున్న ఇద్దరు కొడుకులను ఒంటరి వారిని చేసి అనంతలోకాలకు వెళ్లిపోయారు. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న త్రిపాఠి, మాధవరావు, ఆయన భార్య మోహిని కారులో చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలపాలైన దిలీప్, నెహ్రూలను ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ దిలీప్ మరణించాడు. నెహ్రూ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. సమాచారం అందుకున్న పీఎం పాలెం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏసీపీ శ్రీనివాసరావు సంఘటన స్థలానికి సిబ్బందితో చేరుకుని కారులో చిక్కుకున్న వారిని వారిని బయటకు తీశారు. ట్రాఫిక్‌కు ఆటంకంగా ఉన్న వాహనాలను తొలగించారు. మృతులను, క్షతగాత్రులను కేజీహెచ్‌కు తరలించారు. మృతుని బంధువులకు సమాచారం అందించి, కేసు నమోదు చేసి, లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ప్రమాదానికి కారణం అతి వేగమే
!నలుగురి ప్రాణాలు బలిగొన్న ఈ ప్రమాదానికి కారణం మితిమీరిన వేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. మధురవాడ ప్రాంతంలో రాత్రి వేళ జాతీయ రహదారికి ఒక వైపు అదనపు లేయర్ నిర్మాణపు పనులు చేపడుతున్న కారణంగా... కొమ్మాది- మారికవలసల మధ్య రెండు వైపుల వెళ్లే వాహనాలు ఒకే రోడ్డుపై వెళ్లే విధంగా ట్రాఫిక్ మళ్లించారు. ఈ క్రమంలో ఒడిశా నుంచి నగరానికి వస్తున్న కారు, ఎదురుగా కలప లోడుతో వస్తున్న లారీ బలంగా ఢీ కొన్నాయి.ఈ ధాటికి కారు ముందు భాగం నుజ్జయింది. లారీ ముందు చక్రాలు రెండూ ఊడిపోయాయి. ఫ్రంట్ యాక్సిల్ విరిగిపోయింది. ఒకే రోడ్డులో వాహనాలు ఎదురెదుగా ప్రయాణించడం ప్రమాదానికి మరో కారణమని భావిస్తున్నారు.
మరణంలోనూ వీడని బంధం
Published Fri, Jun 12 2015 11:56 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement