అన్ని వర్గాలను అలరిస్తా
చాగలు: అన్ని వర్గాలు మెచ్చే చిత్రాల్లో నటించాలన్నదే తన లక్ష్యమని ‘అల్లుడుశీను’ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అన్నారు. చాగల్లులో గణపతి నవరాత్రి మహోత్సవాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన విలేకరులతో మాట్లాడారు. తండ్రి బెల్లంకొండ సురేష్ సినీ నిర్మాత కావడంతో చిత్ర పరిశ్రమలోకి రావాలన్న ఆసక్తి కలిగిందన్నారు. దర్శకుడు వీవీ వినాయక్‌తో తన కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పారు. దీంతో వినాయక్ దర్శకత్వంలో హీరోగా పరిచయమయ్యానన్నారు. అల్లుడుశీను సినిమా విజయవంతం కావడం ఆనందంగా ఉందన్నారు.
ఈ చిత్రాన్ని 95 రోజుల్లో పూర్తిచేసేలా దర్శకుడు షెడ్యూల్ రూపొందించారని చెప్పారు. దర్శకుడు వినాయక్ సెట్‌లో అందరినీ నవ్విస్తూ ఉండేవారని చెప్పారు. పట్టుదల, కార్యదక్షత ఉంటే చిత్ర పరిశ్రమలో అవకాశాలు వాటంతట అవే వెతుక్కుంటూ వస్తాయన్నారు. తన వయసు 21 ఏళ్లు అని, ప్రైవేట్‌గా బీకాం చదువుతున్నట్టు తెలిపారు. మంచి నటుడిగా గుర్తింపు పొందాలనే ఆశయంతో ముందుకు సాగుతున్నానని చెప్పారు. చాగల్లులో గణపతి నవరాత్రి వేడుకలు వైభవంగా నిర్వహించడం గొప్ప విషయమన్నారు. కళాకారులు, విద్యార్థులను ప్రోత్సహించడం అభినందనీయమని కొనియాడారు.
గతంలో దర్శకుడు వినాయక్ వివాహానికి కుటుంబసభ్యులతో కలిసి ఇక్కడకు వచ్చానని.. మళ్లీ ఇన్నాళ్లకు చాగల్లు రావడం ఆనందంగా ఉందన్నారు. గ్రామంలోని తెలగా వినాయకుడి ఆలయం వద్ద జరిగిన సరస్వతి పూజలో పాల్గొన్నారు. దర్శకుడు వీవీ వినాయక్, మాజీ సర్పంచ్ గండ్రోతు సురేంద్రకుమార్, ఏఎంసీ డెరైక్టర్ జుట్టా కొండలరావు, తెలగా సంఘం కమిటీ పెద్దలు ఆయన వెంట ఉన్నారు.