బెల్ట్ బేరం! | Belt bargain! | Sakshi
Sakshi News home page

బెల్ట్ బేరం!

Published Thu, Jul 16 2015 3:08 AM | Last Updated on Wed, Sep 5 2018 8:43 PM

బెల్ట్ బేరం! - Sakshi

బెల్ట్ బేరం!

♦ జిల్లాలో 2 వేల బెల్ట్ షాపుల నిర్వహణకు రంగం సిద్ధం
♦ ఒక్కో మండలంలో 25 దాకా షాపుల ఏర్పాటుకు వ్యూహం
♦ ఒక్కో దుకాణానికి రూ.20-30 వే లు వసూలు చేస్తున్న  మద్యం వ్యాపారులు
♦ అధికారం అండతో పోలీసులు, ఎక్సైజ్ అధికారులపై ఒత్తిడి
 
 సాక్షి ప్రతినిధి, కడప :  ‘ప్రభుత్వం మనదే.. నిర్భయంగా బెల్ట్ షాపులు నడుపుకోండి.. మీకేం కాదు.. ఏం జరిగినా మేం చూసుకుంటాం.. పోలీసులు, ఎక్సైజ్ అధికారులతో మాట్లాడుకున్నాం.. వచ్చే నెల నుంచి బెల్ట్ షాపులు ఏర్పాటు చేస్తున్నాం.. మీకు షాపు కావాలంటే అడ్వాన్సు తీసుకురండి.. అడ్వాన్సు లేకుంటే షాపు ఇచ్చేది లేదు.. లక్షలకు లక్షలు లెసైన్సు ఫీజు చెల్లించాం.. అందులో కొంతైనా మీరు ఇస్తే కదా.. మాకు వ్యాపారం నడిచేది..’ అంటూ పోటాపోటీగా టెండర్లలో పాల్గొని దుకాణాలు దక్కించుకున్న మద్యం వ్యాపారులు బెల్ట్ షాపుల ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం ఈ వ్యవహారం జోరందుకుంది.

జిల్లాలో 269 మద్యం షాపులకు గాను 27 ప్రభుత్వం నిర్వహిస్తోంది. మరో 42 షాపుల కోసం వ్యాపారులు ముందుకు రాలేదు. తక్కిన 200 షాపులను లాటరీలో దక్కించుకున్నారు. దరఖాస్తుల రూపేణా రూ.7.4 కోట్లు, లెసైన్సు ఫీజు ద్వారా రూ.73.6 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం లభించింది. ఆ మేరకు ఈ నెల 1 నుంచి కొత్తగా మద్యం షాపులు ఏర్పాటయ్యాయి. షాపులను ప్రారంభించి రెండు వారా లు కాకముందే మద్యం వ్యాపారులు అడ్డదారులను వెతికే పనిలో పడ్డారు. లెసైన్సు ఫీజు సొమ్ము తిరిగి చేజిక్కించుకోవాలంటే వ్యవహారం ఇలా నడిపించక తప్పదని  మద్యం వ్యాపారులు బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు. పోలీసులు, ఎక్సైజ్ శాఖ సహకారంతో బెల్ట్ షాపులు నిర్వహించుకునేందుకు సంసిద్ధమయ్యారు. అందుకు అడ్వాన్సులు తీసుకుని ‘బెల్ట్’కు అనుమతించే పనిలో నిమగ్నమయ్యారు.

 అభయమిస్తేనే మద్యం విక్రయిస్తాం
 ఇటీవల పట్టణాలు మొదలు గ్రామాల వరకూ దొంగ చాటుగా మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయి. మద్యం సీసాలను జేబుల్లో పెట్టుకొని అక్రమంగా విక్రయిస్తున్నారు. ఎటూ విక్రయాలు బాగున్నందున బెల్ట్‌షాపుల నిర్వహణకు దుకాణ యజమానలు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా డిపాజిట్లు కట్టినోళ్లకే బెల్ట్ షాపులంటో బేరం పెట్టారు. చిన్న గ్రామమైతే రూ. 10 వేలు, జనాభా ఎక్కువగా ఉన్న గ్రామమైతే రూ. 20-30 వేలు దాకా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులు, ఎక్సైజ్ అధికారుల నుంచి తమకు ఎలాంటి ఇబ్బంది ఉండదని హామీ ఇస్తేనే డబ్బు డిపాజిట్ చేస్తామని గ్రామాల్లోని బెల్ట్ షాపు నిర్వహణకు ముందుకు వచ్చిన వారు చెబుతున్నట్లు సమాచారం.

‘పోలీసులు, ఎక్సైజ్ అధికారులకు డబ్బులిచ్చాం.. ఇక మీ జోలికి ఎవ్వరూ రారు. కాకపోతే కొన్ని రోజుల పాటు స్టాకు ఇళ్లలో పెట్టుకోకండి.. తర్వాత చూద్దాం’ అని అధికార పార్టీకి చెందిన నాయకుల ద్వారా హామీలు గుప్పిస్తున్నారు. ఈ తతంగం ప్రొద్దుటూరు ఎక్సైజ్ జిల్లా పరిధిలో అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా మద్యం షాపు యజమానులు, అధికార పార్టీకి చెందిన నేతలు భారీగా వసూలు చేస్తూ లక్షల రూపాయలు వెనకేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఒక్క బెల్ట్ షాపు కూడా లేకుండా చేస్తానని తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించిన నేపథ్యంలో టీడీపీ నేతలిలా బరితెగించడం విశేషం.

 మౌన వ్రతంలో ఎక్సైజ్ శాఖ
  అవకాశం ఉన్న ప్రతిచోట పట్టణం నుంచి గ్రామాల వరకు విచ్చలవిడిగా మద్యం విక్రయాలు చేస్తున్నారు. గడ్డి వాముల్లో మద్యం కేసులను పెట్టుకొని విక్రయాలు సాగిస్తున్నారు. పది రోజులుగా ఈ తంతు సాగుతున్నా ఎక్సైజ్ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. జిల్లా వ్యాప్తంగా సుమారు 2 వేలకు పైగా అక్రమంగా బెల్ట్‌షాపులు నిర్వహించేదుకు ఏర్పాట్లు ముమ్మరం అయ్యాయి. ప్రభుత్వ పరిధిలో నిర్వహిస్తోన్న 27 షాపుల పరిధిలో సైతం ఆయా ప్రాంతాలకు చెందిన ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్లు లూజు విక్రయాలను ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. ఉదయం 6 గంటల నుంచే మద్యం విక్రయాలుసాగిస్తున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈ వ్యవహారం ఇటీవల కొన్ని చోట్ల వివాదాస్పదం అయినట్లు సమాచారం.

 బెల్ట్ షాపులు పెడితే లెసైన్స్‌లు రద్దు
  బెల్ట్ షాపులు ఏర్పాటు చేస్తే మద్యం సీసాలపై ఉన్న బ్యాడ్జి నెంబర్ ఆధారంగా సంబంధిత మద్యం షాపు లెసైన్స్‌ను రద్దు చేస్తామని కడప, ప్రొద్దుటూరు ఎక్సైజ్  ఎస్పీలు శ్రీనివాస ఆచారి, శంభూప్రసాద్ పేర్కొన్నారు. ఎమ్మార్పీ కంటే అదనంగా విక్రయించినా, బెల్ట్ షాపులను ఏర్పాటు చేసినా ఉపేక్షించేది లేదన్నారు. గ్రామాల్లో ఇకపై ముమ్మరంగా తనిఖీలు చేస్తామని చెప్పారు. బెల్ట్ షాపుల నిర్వహణే అక్రమమన్నారు. ప్రభుత్వం సైతం బెల్ట్‌షాపులు నిర్వహించరాదని ఆదేశించినట్లు వారు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement