గుండవల్లిపేట దాబా వద్ద మూతపడిన బెల్ట్ షాపు
సాక్షి, నరసన్నపేట (శ్రీకాకుళం): పచ్చటి సంసారాల్లో చిచ్చురేపిన మద్యం మహమ్మారికి రోజులు దగ్గరపడ్డాయి. ముఖ్యమంత్రిగా వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన వెంటనే మద్యం మహమ్మారి నిర్మూలను చికిత్స ప్రారంభించారు. ఒక్కసారిగా ఈ వ్యాధిని నిర్మూలించడం వీలుకాదని ముందే గ్రహించిన ఆయన విడతల వారీగా తుదముట్టిద్దామని పిలుపునిచ్చారు. దీంట్లో భాగంగా మొదటి విడతగా బెల్ట్‌షాపుల నిర్మూలనకు ఇచ్చిన ఆదేశాలు నరసన్నపేట నియోజకవర్గంలో విజయవంతమయ్యాయి. గ్రామాల్లో మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 10 రోజుల క్రితం గ్రామాల్లో పరిస్థుతులు ఒకలా ఉండేవి. ప్రస్తుతం ఆ పరిస్థులు పూర్తిగా మారాయి. దీనికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయమే కారణమంటూ మహిళా లోకం పొగడ్తలతో ముంచెత్తుతుంది. బెల్ట్‌షాపుల మూతకు గ్రామాల్లో పెద్దలు కూడా సహకరించారు. నరసన్నపేట నియోజకవర్గంలో ఒక్క పిలుపుతో నాలుగు మండలాల్లో ఉన్న బెల్ట్ షాపులన్నీ దాదాపుగా మూతపడ్డాయి.
టీడీపీ హయాంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు..
గత ప్రభుత్వాన్ని నడిపిన ముఖ్యమంత్రి కూడా ఎన్నికల సమయంలో బెల్ట్ షాపులను మూతవేస్తామని హమీ ఇచ్చారు. ఆ హామీ తుంగలోకి తొక్కడంతో.. బెల్ట్ షాపులు తగ్గడానికి బదులు మరిన్ని పెరిగాయి. మద్యం అమ్మకాలపై నెలవారీ టార్గెట్లు ఇవ్వడంతో ఎక్సైజ్ సిబ్బంది కూడా ఎంత తాగిస్తే అంతగా లక్ష్యం సాధిస్తామని బెల్ట్ షాపులను అప్పట్లో ప్రోత్సహించారు. 2014కు ముందు గ్రామాల్లో వీధికో బెల్ట్ షాపు ఉంటే గత ప్రభుత్వ అధినేత పుణ్యమా అని వీధికి నాలుగైదు వెలిశాయి. నరసన్నపేట పట్టణంలో అయితే సందు, సందులో బెల్ట్ షాపులు ఏర్పాటు చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో బయటకు ఒకలా ప్రకటనలు చేయడం, లోపల ఆదేశాలు మరోలా ఇవ్వడంతో బెల్ట్ షాపులు మూత అనేది కేవలం ప్రకటలనకే పరిమితం అయింది.
నియోజకవర్గంలోని బెల్ట్ షాపుల వివరాలు..
మండలం | బెల్ట్ షాపులు | ప్రస్తుతం నడుస్తున్నవి |
నరసన్నపేట | 310 | 0 |
పోలాకి | 160 | 0 |
జలుమూరు | 110 | 0 |
సారవకోట | 90 | 0 |
మాటే శాసనం..
వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాల్లో దశలవారీగా మద్యపానాన్ని నిషేధిస్తామని రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే దీనిపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ‘నా మాటే శాసనం’ అన్న తీరులో జగన్‌మోహన్‌రెడ్డి ఎక్సైజ్ అధికారులకు స్పష్టం చేయడంతో వారం రోజుల్లో బెల్ట్ షాపులు మూతపడ్డాయి. సీఎం ఆదేశాలను విధిగా నరసన్నపేట నియోజకవర్గంలో కూడా అమలు కావాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ స్థానిక ఎక్సైజ్ అధికారులకు గట్టిగా చెప్పారు. బెల్ట్ షాపులకు మద్యం ఇస్తే లైసెన్స్ ఉన్న షాపులపై కేసులు పెట్టాలని, గ్రామాల్లో గొలుసు దుకాణాలు మూత పడాల్సిందేనని, గ్రామాల్లో మద్యం లభిస్తున్నట్లు తెలిస్తే పైఅధికారులకు ఫిర్యాదు చేస్తానన్నారు. ఎక్సైజ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్న స్థానిక సీఐ ఎ.శ్రీనివాసరావు ఆధ్వర్యంలోని ఎక్సైజ్ సిబ్బంది జూలు విదిల్చారు. దీంతో గ్రామాల్లోని బెల్ట్ షాపులన్నీ మూతపడ్డాయి.
ప్రస్తుతం మద్యం కేవలం లైసెన్స్ ఉన్న షాపుల్లోనే లభిస్తుంది. ఈ షాపుల్లో కూడా రెండు బాటిళ్ల కంటే ఎక్కువ ఇవ్వడం లేదు. నరసన్నపేట ఎక్సైజ్(సీఐ) స్టేషన్ పరిధిలో ఉన్న జలుమూరు, పోలాకి, నరసన్నపేట మండలాల్లో దాదాపుగా అన్ని బెల్ట్ షాపులు మూసివేశారు. వీటిని నడిపిన వారు ప్రత్యామ్నాయ వ్యాపారాలు చూసుకుంటున్నారు. మద్యం మహమ్మారి నిషేధానికి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న మొదటి ప్రయత్నం విజయవంతం అయింది. కోటబొమ్మాళి సర్కిల్ సీఐ పరిధిలో ఉన్న సారవకోట మండలంలో కూడా మద్యం అనధికార షాపులు మూతపడ్డాయి. నరసన్నపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 21 లైసెన్స్‌డ్ షాపులున్నాయి. ప్రస్తుతం వీటిల్లోనే విక్రయాలు జరుగుతున్నాయి. గత పది రోజుల్లో మద్యం అమ్మకాలు 40 శాతం మేరకు తగ్గాయి.
ఎక్సైజ్ సిబ్బందికి గ్రామాల దత్తత..
నరసన్నపేట సర్కిల్ స్టేషన్ పరిధిలో ఉన్న 12 మంది పోలీసులు, ముగ్గురు ఎస్‌ఐలు రెవెన్యూ గ్రామాల వారీగా దత్తత తీసుకున్నారు. గ్రామాల్లో మద్యం విక్రయాలను వీరి నుంచి ఏ రోజు నివేదికలు ఆరోజు సీఐ తీసుకున్నారు. బెల్ట్ షాపులు నిర్వహించే వారికి సిబ్బంది కౌన్సెలింగ్ నిర్వహించారు. గ్రామాల్లో ప్రజలు, పెద్దల నుంచి బెల్ట్‌షాపుల మూతకు ప్రోత్సాహం లభించిందని ఎక్సైజ్ సిబ్బంది తెలిపారు.
అక్రమ మద్యం ఉంటే కేసులు
నిబంధనలకు మించి మద్యం బాటిళ్లు అధికంగా ఉన్నా, బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అనధికార మద్యం ఉంటే కేసులు నమోదు చేస్తాం. బెయిల్ రాకుండా సెక్షన్లు వేస్తాం. ప్రస్తుతం కేవలం లైసెన్స్ ఉన్న దుకాణాల్లోనే మద్యం అమ్మకాలకు పరిమితం చేశాం. ఎవరైనా లైసెన్స్‌డ్ షాపుల నుంచి బెల్ట్ షాపులకు మద్యం అమ్మకాలు చేస్తే వారి లైసెన్స్‌లు పూర్తిగా రద్దు చేస్తాం.
–శ్రీనివాసరావు, సీఐ, నరసన్నపేట
గ్రామాల్లో ప్రశాంతత
గత ప్రభుత్వ కాలంలో విచ్చలవిడిగా మద్యం బెల్ట్ షాపులు గ్రామాల్లో ఉండటంతో ప్రధానంగా మహిళలు అనేక ఇబ్బందులు పడ్డారు. వై.ఎస్.జగన్‌మెహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే మద్యం బెల్ట్ షాపులు నిర్మూలకు చర్యలు తీసుకోవడంతో గ్రామాల్లో బెల్ట్ షాపులు కనిపించడం లేదు. వారం రోజులుగా గ్రామాల్లో ప్రశాంతత కనిపిస్తుంది. మహిళలు సంతోషంగా ఉన్నారు.
– పుట్టా ఆదిలక్ష్మి, మాజీ సర్పంచ్, వీఎన్‌పురం, నరసన్నపేట
Comments
Please login to add a commentAdd a comment