సాక్షి, కొత్తగూడెం: బెల్టు షాపులు బార్లను తలపిస్తున్నాయి. మారుమూల పల్లెల్లో సైతం కావాల్సిన బ్రాండ్ మద్యం అందుబాటులో ఉంటోంది. నూతన మద్యం విధానం ద్వారా బెల్టుషాపులు రద్దు చేయాల్సి ఉండగా ఎక్త్సెజ్ శాఖ మాత్రం మామూళ్ల ‘మత్తు’లో నిద్రపోతోందనే ఆరోపణలున్నాయి. జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో బెల్టు షాపులున్నా ఈ శాఖ మాత్రం చూసీ చూడనట్లుగానే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వీటి నిర్వాహకులు రూ.లక్షలు ఆర్జిస్తున్నారు.
నూతన మద్యం విధానం ద్వారా బెల్టు షాపులను రద్దు చేయాలని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. కానీ జిల్లాలో ఇదెక్కడా అమలుకాలేదు. బెల్టు షాపులు యథేచ్ఛగా నడుస్తుండడంతో బార్ల కన్నా నిత్యం ఈ షాపులే కిటకిటలాడుతున్నాయి. అధికారులకు నెలనెలా మామూళ్లు ముట్టజెప్పుతుండడంతో అటు వైపు కన్నెత్తి చూడడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎప్పుడో ఒకసారి తనిఖీల పేరుతో హల్‌చల్ చేసినా.. ఈ విషయం బెల్టు షాపు నిర్వాహకులకు ముందే తెలియడంతో దుకాణాలు మూస్తున్నారు. ఖమ్మం, వైరా, కొత్తగూడెం, మధిర, పాల్వంచ, ఇల్లెందు, మణుగూరులోని బెల్టు షాపుల్లో.. కొన్ని మండల కేంద్రాల్లో ఉన్న దుకాణాల కన్నా ఎక్కువగా మద్యం విక్రయిస్తున్నారంటే ఈ వ్యాపారం ఏ మేరకు నడుస్తుందో ఊహించవచ్చు.
అర్ధరాత్రి వరకు బెల్టు షాపులు నడుస్తున్నా పట్టించుకునే అధికారులు లేరు. అయితే మామూళ్లు పుచ్చుకుంటున్న అధికారులు రహస్యంగా బెల్టు షాపులు నడుపుకునేందుకు ఆయా నిర్వాహకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో 153 మద్యం షాపులు, వీటికి అనుబంధంగా 147 పర్మిట్ రూంలకు అనుమతి ఉంది. ఇవికాక 44 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. అయితే బెల్టు వ్యాపారం బహిరంగంగా సాగుతున్నా అధికారులు నామమాత్రంగా కేసులు నమోదు చేసి వదిలేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవ ంబర్ నెలాఖరు వరకు జిల్లాలో 195 మంది బెల్టు షాపుల నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. ఈ విషయంలో కఠినంగా వ్యవహరించకపోవడంతో కేసుల తర్వాత కూడా వారు మళ్లీ ఈ వ్యాపారం నిర్వహిస్తుండడం గమనార్హం.
ఖమ్మం నగర శివారు ప్రాంతాలైన మల్లెమడుగు, రామన్నపేట, రామన్నపేట కాలనీ, దానవాయిగూడెం, కైకొండాయిగూడెం, బీసీ కాలనీ, రాపర్తినగర్, రమణగుట్ట, శ్రీనివాసనగర్, ప్రకాష్‌నగర్, వేణుగోపాల్‌నగర్.. ఇలా ప్రతి కాలనీలో బెల్ట్ షాపులు ఉన్నాయి. ప్రతి వీధిలో ఐదు బెల్ట్ షాపులు ఉన్నాయంటే మద్యం అమ్మకాలు ఎంత విచ్చల విడిగా సాగుతున్నాయో తెలుస్తోంది.
అశ్వారావుపేట నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో దాదాపు 200 పైగా బెల్టు షాపులున్నాయి. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ఒక్కో మద్యం దుకాణం ఉండటంతో అక్కడినుంచి మండలంలోని బెల్టుషాపులకు యథేచ్ఛగా సర ఫరా అవుతోంది. పలు గ్రామాల్లో మద్యం దుకాణాలు నడుపుకునేందుకు అధికార పార్టీ నాయకులే వేలంపాట నిర్వహిస్తుండడం గమనార్హం.
కొణిజర్ల, ఏన్కూర్, జూలూరుపాడు, కారేపల్లి మండలాల్లో బెల్టుషాపుల జోరు కొనసాగుతోంది. ఈ మండలాల్లో బెల్టుషాపులతో పాటు నాటుసారా తయారీ కేంద్రాలు కూడా నిర్వహిస్తున్నారు. గుడుంబా అమ్మకాలు సాగిస్తున్న వారిని, బెల్లం వ్యాపారులను అదుపులోకి తీసుకుంటున్న అధికారులు బెల్టుషాపులను మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఖమ్మం రూరల్ మండలంలో మూడు వైన్ షాపులున్నాయి. ఇందులో ఒకదానికి మాత్రమే సిట్టింగ్ అనుమతి ఉంది. మిగతా రెండు వైన్‌షాపుల పక్కనే ఉన్న హోటళ్లు బెల్టు షాపులుగా పనిచేస్తున్నాయి. పాలేరు దాబాల్లో మద్యం సిట్టింగులు జోరుగా సాగుతున్నాయి. కూసుమంచి, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి మండలాల్లోనూ ప్రతి గ్రామంలో రెండు, మూడు బెల్ట్ షాపులున్నాయి.
భద్రాచలం మండలంలో బెల్ట్‌షాపులు యథేచ్ఛగా నడుస్తున్నాయి. లూజ్ విక్రయాలు ఎక్కడా అమ్మకూడదన్న నిబంధనలు ఉన్నా వాటిని పట్టించుకోవడం లేదు. వాజేడు మండలంలో గుమ్మడిదొడ్డి, పేరూరు, ప్రగళ్లపల్లి, అరుణాచలపురం, ఏడుజర్లపల్లి గ్రామాలలో అధికంగా బెల్టుషాపులు ఉన్నాయి. చర్ల మండలంలోని తేగడ, కలివేరు, సత్యనారాయణపురం, ఆర్.కొత్తగూడెం, కుదునూరు, మామిడిగూడెం, రాళ్లగూడెం గ్రామాల్లోని బెల్ట్ షాపులో మద్యం విక్రయాలు జోరుగు సాగుతున్నాయి.
కొత్తగూడెం పట్టణంలోని రామవరం, నాగయ్యగడ్డ, పంజాబ్‌గడ్డ, మేషన్‌కాలనీ, వనందాస్‌గడ్డ, చిట్టిరామవరం, గరీబ్‌పేటతో పాటు మండలంలోని రేగళ్ల, మైలారం, బంగారుచెలక, సీతరాంపురం, సుజాతనగర్, రాఘవాపురం గ్రామాల్లో బెల్టు వ్యాపారం జోరుగా సాగుతోంది. పట్టణ శివార్లలోని బెల్టుషాపులను అర్ధరాత్రి వరకు గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారు.
మణుగూరు మండలం కూనవరం కాలనీలో ఏర్పాటు చేసిన బెల్టుషాపుల వల్ల ఆ ప్రాంత వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బూర్గంపాడు మండలంలోని సారపాక, లక్ష్మీపురం ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అనేక బెల్టు షాపుల్లో 24 గంటలూ మద్యం దొరుకుతోంది. అశ్వాపురంతో పాటు మండలంలోని చింతిర్యాల క్రాస్‌రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన బెల్టు షాపులదీ ఇదే పరిస్థితి.
మధిర మండలంలోని సిరిపురం, రాయపట్నం, దెందుకూరు, ముదిగొండ మండలంలోని ముదిగొండ, వల్లభి, చిరుమర్రి, చింతకాని మండలంలో బెల్టుషాపులు ఎప్పుడూ తెరిచే ఉంటున్నాయి. సిట్టింగ్‌లు బహిరంగంగా పెట్టినా ఎక్త్సెజ్ అధికారులు మాత్రం తనిఖీలు చేయడం లేదు.
ఇల్లెందు పట్టణంలో 21, 24 ఏరియాలు, ఇందిరానగర్, ఆజాద్‌నగర్, సుభాష్‌నగర్, మండలంలోని కొమరారం, పోలారం, రొంపేడు, గార్ల మండలంలోని కిష్టారం, మద్దివంచ గ్రామాల్లో బెల్టు షాపులను అక్రమంగా నిర్వహిస్తున్నారు.
సత్తుపల్లి పట్టణ శివారులో ఎన్టీఆర్ నగర్, హనుమాన్‌నగర్, రాజీవ్‌కాలనీతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో బెల్టుషాపులున్నాయి. కల్లూరు మండలంలో 102 బెల్టు షాపులున్నాయి. కల్లూరు మండల కేంద్రంలోని బెల్టు షాపుల్లో 24 గంటలూ మద్యం అందుబాటులో ఉంటోంది.