ఉత్తమ ఫలితాలకు ప్రత్యేక కార్యాచరణ
‘కమిట్‌మెంట్’ పేరిట 10 వారాల ప్రణాళిక
ఏలూరు సిటీ : జిల్లాలో విద్యా కుసుమాలను వికసింపజేసేందుకు అంకితభావం (కమిట్‌మెంట్) పేరిట ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేయనున్నారు. పది వారాలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు విద్యాశాఖ దీనిని రూపొందించింది. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లాను రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలబెట్టేందుకు సులువైన అష్టాంగ మార్గాలను సైతం పాటించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అర్ధ వార్షిక పరీక్షల్లో విద్యార్థుల సామర్థ్యాన్ని గుర్తించి, వారిని నాలుగు గ్రేడులుగా విభజించారు. ప్రతి విద్యార్థిపై దృష్టి సారించి పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించేలా కమిట్‌మెంట్ (కరిక్యులర్ ఆర్గనైజేషన్, మెథడ్స్ మోడిఫికేషన్ ఇన్ ది టెన్త్ క్లాస్ మెయిన్ ఎగ్జామ్స్ బై ఎంకరేజ్‌మెంట్ నేచురల్ టాలెంట్స్) పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబోతున్నారు.
ఆణిముత్యాలు, ఆశా జ్యోతులపై ప్రత్యేక దృష్టి : అర్ధవార్షిక పరీక్షల్లో 80నుంచి 100 శాతం మార్కులు పొందిన విద్యార్థులను ‘పశ్చిమ ఆణిముత్యాలు’, 61నుంచి 80శాతం మార్కులు వచ్చిన వారిని ‘పశ్చిమ వజ్రాలు’, 35-60 శాతం వస్తే ‘పశ్చిమ బంగారాలు’, 0 నుంచి 35శాతం మార్కులు వచ్చిన వారిని ‘పశ్చిమ ఆశాజ్యోతులు’గా వర్గీకరించారు. ఆణిముత్యాలు 2,104 మంది, వజ్రాలు 10,332 మంది, బంగారాలు 13,888 మంది, ఆశాజ్యోతులు 5,114 మంది ఉన్నట్టు గుర్తించారు. ఆణిముత్యాలు, ఆశా జ్యోతులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిర్ణయించారు. అర్ధ వార్షిక పరీక్షల్లో వెనుకబడిన విద్యార్థులను ఉపాధ్యాయులు దత్తత తీసుకుంటారు.
పరీక్షల్లో వారు ఉత్తీర్ణత సాధించేలా తర్ఫీదు ఇస్తారు. అర్ధవార్షిక పరీక్షల్లో ఒక సబ్జెక్టులో ఫెయిలైన విద్యార్థులు 2,065 మంది, రెండు సబ్జెక్టుల్లో ఫెయిలైన వారు 1,418 మంది, మూడు కంటే ఎక్కువ సబ్జెక్టుల్లో తప్పినవారు 1,631 మంది ఉన్నారు. వీరందరికీ ప్రత్యేక తర్ఫీదు ఇచ్చేందుకు చర్యలు చేపట్టామని డీఈవో డి.మధుసూదనరావు చెప్పారు. పదో తరగతి ఉత్తీర్ణతలో అగ్రస్థానం సాధించేందుకు కమిట్‌మెంట్ పేరిట ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు.
అష్టాంగ మార్గాలను ఆయన వివరించారు అష్టాంగ మార్గాలివీ
విద్యార్థుల్లో విద్యా సామర్థ్యాల గ్రేడింగ్ నిర్ణయించటం
విద్యార్థుల దత్తత : ఒక్కో ఉపాధ్యాయుడు పదిమందిని దత్తత తీసుకోవటం
గృహ సందర్శన : ఉపాధ్యాయులు విద్యార్థుల గృహాలను సందర్శించటం. గృహాల సందర్శన ప్రతిరోజూ సాయంత్రం 6.30 నుంచి 8.30 గంటల వరకు, ఉదయం 4.30 నుంచి 6.30గంటల వరకు ఉండాలి.
హామీ పత్రాలు : ప్రతి ఉపాధ్యాయుడి నుంచి ‘నేను బోధించి సబ్జెక్ట్‌లో ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించేలా కృషి చేస్తా’నని హామీ పత్రాలు తీసుకుంటారు.
ప్రత్యేక తరగతులు : ఉదయం 8.30నుంచి 9.30 గంటల వరకు, సాయంత్రం 4.40నుంచి 5.40 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహణ
బృంద చదువులు : గ్రామాల్లో ఉపాధ్యాయుల ఇళ్లవద్ద లేదా అంగన్‌వాడీ కేంద్రాల వద్ద టెన్త్ విద్యార్థులకు బృంద చదువులు
మార్గదర్శక బృందాలు : ప్రతి బుధవారం మార్గదర్శక బృందం గ్రామాల్లో తిరుగుతూ బృంద చదువుల పరిస్థితిని పరిశీలిస్తుంది. ఎంఈవో, నలుగురు సబ్జెక్టు నిపుణులతో ఈ బృందాన్ని ఏర్పాటు చేశారు.
బడిలో బస : సంక్రాంతి సెలవుల అనంతరం బడిలో బస కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. విద్యా శాఖ అధికారులంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి
స్టడీ మెటీరియల్ : టెన్త్ విద్యార్థులందరికీ స్టడీ మెటీరియల్ అందజేస్తారు. ప్రత్యేకంగా రూపొందిం చిన 10వారాల కమిట్‌మెంట్ ప్రోగ్రామ్ బుక్‌లెట్‌ను ఉపాధ్యాయులకు అందజేస్తారు.
టెన్త్‌కు అంకితమై
Published Sun, Jan 3 2016 12:29 AM | Last Updated on Sun, Sep 3 2017 2:58 PM
Advertisement
Advertisement