న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో పీఎస్‌యూ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ) ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 90 శాతం జంప్‌చేసి రూ. 1,027 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 541 కోట్లు మాత్రమే ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం రూ. 12,311 కోట్ల నుంచి రూ. 11,211 కోట్లకు క్షీణించింది.
నికర వడ్డీ ఆదాయం సైతం రూ. 3,739 కోట్ల నుంచి రూ. 3,408 కోట్లకు బలహీనపడింది. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 13.25 శాతం నుంచి 10.46 శాతానికి తగ్గాయి. నికర ఎన్‌పీఏలు మాత్రం 2.46 శాతం నుంచి 2.66 శాతానికి పెరిగాయి. ప్రొవిజన్లు, కంటింజెన్సీలు రూ. 1,810 కోట్ల నుంచి భారీగా తగ్గి రూ. 335 కోట్లకు పరిమితమయ్యాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 16.66 శాతంగా నమోదైంది.
ఫలితాల నేపథ్యంలో బీవోఐ షేరు ఎన్‌ఎస్‌ఈలో 3.5 శాతం పతనమై రూ. 56.4 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment