కురగల్లు(మంగళగిరి రూరల్),న్యూస్‌లైన్: రియల్ ఎస్టేట్ ఆర్థిక లావాదేవీల వివాదం నేపథ్యంలో బేతపూడి సర్పంచ్ దారుణ హత్యకు గురయ్యారు. దుండగులు గొడ్డళ్లు,కత్తులతో నరికి హతమార్చారు. కురగల్లు - నిడమర్రు రోడ్డులో మంగళవారం రాత్రి 8.15 గంటలకు జరిగిన ఈ సంఘటన సంచలనం సృష్టించింది. పోలీసుల సమాచారం మేరకు బేతపూడి గ్రామ సర్పంచ్ బత్తుల నాగసాయి (38)ని దుండగులు గొడ్డళ్లతో హతమార్చి పరారయ్యరు. ఓ కేసు విషయమై గ్రామస్తులు ధనలక్ష్మి, సరిశెట్టి వెంకటేశ్వరమ్మ, గైరుబోయిన కోటమ్మ, బుల్లయ్యతో కలసి సాయి మంగళవారం ఉదయం తుళ్లూరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. రాత్రి 8.15 గంటలకు అంతా కలసి కారులో తిరిగి వస్తున్నారు.
కురగల్లు -నిడమర్రు రోడ్డుకు రాగానే నాగసాయి కారుకు అడ్డుగా మరో కారు వేగంగా వచ్చి ఆగింది. దానిలో నుంచి ఏడెనిమిది మంది దుండగులు దిగి నాగసాయి కారును గొడ్డళ్లు, కత్తులతో ధ్వంసం చేశారు. ఈ క్రమంలోనే నాగసాయి పై విచక్షణా రహితంగా మారణాయుధాలతో దాడి చేశారు. చివరకు గొంతుకోసి పరారయ్యారు. ఈ సమయంలో కారు డ్రైవర్ గుండాల చంద్రశేఖర్ పరారు కాగా మిగిలిన వారు కారు వద్దనే వున్నారు. దుండగులు కారుపై మారణాయుధాలతో దాడి చేసినప్పుడు మహిళలకు గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న నార్త్‌సబ్ డివిజన్ డీఎస్పీ ఎం మధుసూదనరావు అక్కడకు చేరుకుని నాగసాయి మృతదేహన్ని పరిశీలించారు. సమాచారం ఎవరికైనా చెబితే చంపేస్తామని దుండగులు బెదిరించి పారిపోయినట్టు అక్కడి వారు తెలిపారు. క్లూస్ టీమ్ వేలిముద్రలు సేకరించింది. పట్టణానికి చెందిన ఓ ఆటో కన్సల్టెంట్ నిర్వాహకునితో వున్న రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆర్థిక లావాదేవీల వివాదం కారణంగా సర్పంచ్ హత్య జరిగినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి రూరల్ సీఐ మధుసూదనరావు దర్యాప్తు చేస్తున్నారు. దుండగుల కోసం ప్రత్యేక బృందంతో గాలిస్తున్నారు.
బేతపూడి సర్పంచ్ దారుణ హత్య
Published Wed, Dec 18 2013 4:48 AM | Last Updated on Sat, Sep 2 2017 1:42 AM
Advertisement