battula nagasai
-
సర్పంచ్ హత్య కేసులో ఏడుగురి అరెస్ట్
మంగళగిరి రూరల్, న్యూస్‌లైన్: బేతపూడి సర్పంచ్ బత్తుల నాగసాయి హత్య కేసులో ఏడుగురు నిందితులను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈనెల 17న గ్రామానికి చెందిన రాఘవమ్మ కుటుంబ వివాదం విషయమై పోలీసుస్టేషన్‌కు వెళ్లి కారులో రాత్రి తిరిగి వస్తుండగా దుండగులు దారికాచి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో తాడిబోయిన ఉమామహేశ్వరరావు అలియాస్ ఉమా యాదవ్, నల్లగొర్ల రామారావు, ఆలా సుబ్బారావు, పుప్పాల రామకృష్ణ, తాడిబోయిన మహేష్, దర్శి యోహాను, పుల్లగూర కోటేశ్వరరావులను అరెస్ట్ చేశారు. ఆ వివరాలను రూరల్ సీఐ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో నార్త్‌సబ్ డివిజన్ డీఎస్పీ ఎం మధుసూదనరావు వెల్లడించారు. నాగసాయి మంగళగిరి పట్టణంలోని ద్వారకానగర్‌కు చెందిన ఆటో కన్సల్టెన్సీ నిర్వాహకుడు తాడిబోయిన ఉమా మహేశ్వరరావుతో కలిసి కొంతకాలం నుండి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండేవారు. ఏడాది క్రితం ఇద్దరూ కలసి కొనుగోలు చేసిన 400 గజాల స్థలాన్ని నాగసాయి తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మరో 120 గజాల స్థలాన్ని కొనేందుకు ఉమామహేశ్వరరావు డబ్బులు ఇవ్వగా ఆ స్థలాన్ని కూడా నాగసాయి తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దీనిపై నిలదీయడంతో అంతుచూస్తానని బెదిరించారు. దీంతో నాగసాయిని హత్య చేయాలని ఉమామహేశ్వరరావు నిర్ణయించుకున్నారు. నాగసాయి కదలికలపై నిఘా పెట్టారు. రాఘవమ్మ కుటుంబ వివాదం విషయమై పోలీసుస్టేషన్‌కు వెళ్లిన విషయం తెలుసుకొని ఆమె కోడలి సోదరుడు ఆలాగోపిని ఇన్ఫార్మర్గా పెట్టుకున్నాడు. సమాచారం అందడంతో కత్తులు, గొడ్డళ్లు, రాడ్లుతో ఇండిగో కారులో వచ్చి నాగసాయి కారును అడ్డగించి ఆయనను బయటికి లాగి హత్యచేసి పరారయ్యారు. సాక్షుల నుంచి వివరాలు సేకరించిన రూరల్ సీఐ ఎం మధుసూదనరావు నిందితులను పెదవడ్లపూడి రైల్వేస్టేషన్ సమీపంలో అరెస్ట్ చేశారు. నిందితులకు సహకరించిన ఆలాగోపి పరారీలో ఉన్నాడు. కేసును ఛేదించిన సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
బేతపూడి సర్పంచ్ దారుణ హత్య
కురగల్లు(మంగళగిరి రూరల్),న్యూస్‌లైన్: రియల్ ఎస్టేట్ ఆర్థిక లావాదేవీల వివాదం నేపథ్యంలో బేతపూడి సర్పంచ్ దారుణ హత్యకు గురయ్యారు. దుండగులు గొడ్డళ్లు,కత్తులతో నరికి హతమార్చారు. కురగల్లు - నిడమర్రు రోడ్డులో మంగళవారం రాత్రి 8.15 గంటలకు జరిగిన ఈ సంఘటన సంచలనం సృష్టించింది. పోలీసుల సమాచారం మేరకు బేతపూడి గ్రామ సర్పంచ్ బత్తుల నాగసాయి (38)ని దుండగులు గొడ్డళ్లతో హతమార్చి పరారయ్యరు. ఓ కేసు విషయమై గ్రామస్తులు ధనలక్ష్మి, సరిశెట్టి వెంకటేశ్వరమ్మ, గైరుబోయిన కోటమ్మ, బుల్లయ్యతో కలసి సాయి మంగళవారం ఉదయం తుళ్లూరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. రాత్రి 8.15 గంటలకు అంతా కలసి కారులో తిరిగి వస్తున్నారు. కురగల్లు -నిడమర్రు రోడ్డుకు రాగానే నాగసాయి కారుకు అడ్డుగా మరో కారు వేగంగా వచ్చి ఆగింది. దానిలో నుంచి ఏడెనిమిది మంది దుండగులు దిగి నాగసాయి కారును గొడ్డళ్లు, కత్తులతో ధ్వంసం చేశారు. ఈ క్రమంలోనే నాగసాయి పై విచక్షణా రహితంగా మారణాయుధాలతో దాడి చేశారు. చివరకు గొంతుకోసి పరారయ్యారు. ఈ సమయంలో కారు డ్రైవర్ గుండాల చంద్రశేఖర్ పరారు కాగా మిగిలిన వారు కారు వద్దనే వున్నారు. దుండగులు కారుపై మారణాయుధాలతో దాడి చేసినప్పుడు మహిళలకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న నార్త్‌సబ్ డివిజన్ డీఎస్పీ ఎం మధుసూదనరావు అక్కడకు చేరుకుని నాగసాయి మృతదేహన్ని పరిశీలించారు. సమాచారం ఎవరికైనా చెబితే చంపేస్తామని దుండగులు బెదిరించి పారిపోయినట్టు అక్కడి వారు తెలిపారు. క్లూస్ టీమ్ వేలిముద్రలు సేకరించింది. పట్టణానికి చెందిన ఓ ఆటో కన్సల్టెంట్ నిర్వాహకునితో వున్న రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆర్థిక లావాదేవీల వివాదం కారణంగా సర్పంచ్ హత్య జరిగినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి రూరల్ సీఐ మధుసూదనరావు దర్యాప్తు చేస్తున్నారు. దుండగుల కోసం ప్రత్యేక బృందంతో గాలిస్తున్నారు.