మంగళగిరి రూరల్, న్యూస్‌లైన్: బేతపూడి సర్పంచ్ బత్తుల నాగసాయి హత్య కేసులో ఏడుగురు నిందితులను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈనెల 17న గ్రామానికి చెందిన రాఘవమ్మ కుటుంబ వివాదం విషయమై పోలీసుస్టేషన్‌కు వెళ్లి కారులో రాత్రి తిరిగి వస్తుండగా దుండగులు దారికాచి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో తాడిబోయిన ఉమామహేశ్వరరావు అలియాస్ ఉమా యాదవ్, నల్లగొర్ల రామారావు, ఆలా సుబ్బారావు, పుప్పాల రామకృష్ణ, తాడిబోయిన మహేష్, దర్శి యోహాను, పుల్లగూర కోటేశ్వరరావులను అరెస్ట్ చేశారు. ఆ వివరాలను రూరల్ సీఐ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో నార్త్‌సబ్ డివిజన్ డీఎస్పీ ఎం మధుసూదనరావు వెల్లడించారు.
నాగసాయి మంగళగిరి పట్టణంలోని ద్వారకానగర్‌కు చెందిన ఆటో కన్సల్‌టెన్సీ నిర్వాహకుడు తాడిబోయిన ఉమా మహేశ్వరరావుతో కలిసి కొంతకాలం నుండి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండేవారు. ఏడాది క్రితం ఇద్దరూ కలసి కొనుగోలు చేసిన 400 గజాల స్థలాన్ని నాగసాయి తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మరో 120 గజాల స్థలాన్ని కొనేందుకు ఉమామహేశ్వరరావు డబ్బులు ఇవ్వగా ఆ స్థలాన్ని కూడా నాగసాయి తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దీనిపై నిలదీయడంతో అంతుచూస్తానని బెదిరించారు. దీంతో నాగసాయిని హత్య చేయాలని ఉమామహేశ్వరరావు నిర్ణయించుకున్నారు. నాగసాయి కదలికలపై నిఘా పెట్టారు.
రాఘవమ్మ కుటుంబ వివాదం విషయమై పోలీసుస్టేషన్‌కు వెళ్లిన విషయం తెలుసుకొని ఆమె కోడలి సోదరుడు ఆలాగోపిని ఇన్‌ఫార్మర్‌గా పెట్టుకున్నాడు. సమాచారం అందడంతో కత్తులు, గొడ్డళ్లు, రాడ్లుతో ఇండిగో కారులో వచ్చి నాగసాయి కారును అడ్డగించి ఆయనను బయటికి లాగి హత్యచేసి పరారయ్యారు. సాక్షుల నుంచి వివరాలు సేకరించిన రూరల్ సీఐ ఎం మధుసూదనరావు నిందితులను పెదవడ్లపూడి రైల్వేస్టేషన్ సమీపంలో అరెస్ట్ చేశారు. నిందితులకు సహకరించిన ఆలాగోపి పరారీలో ఉన్నాడు. కేసును ఛేదించిన సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
సర్పంచ్ హత్య కేసులో ఏడుగురి అరెస్ట్
Published Wed, Dec 25 2013 2:23 AM | Last Updated on Sat, Sep 2 2017 1:55 AM
Advertisement