వీడిన మహిళ అదృశ్యం కేసు మిస్టరీ
Published Mon, Sep 2 2013 3:52 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
మంగళగిరి, న్యూస్‌లైన్ : నగల కోసం మహిళను హత్య చేసి, తగులబెట్టిన ఇద్దరు నిందితులను తాడికొండ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళగిరి రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం నార్త్‌సబ్ డివిజన్ డీఎస్పీ ఎం.మధుసూదనరావ కేసు వివరాలను వెల్లడించారు. తాడికొండ జయభారతినగర్‌కు చెందిన రాపర్ల రాధ (33) భర్త రమేష్‌తో విడిపోయి కొంతకాలంగా ఇంటివద్ద చిల్లరకొట్టు, కొబ్బరి బొండాలు అమ్ముకుంటూ జీవిస్తోంది.
ఈ క్రమంలో ఆమెకు స్వరాజ్యనగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ నల్లిబోయిన శ్రీనివాసరావు అలియాస్ వాసుతో పరిచయం ఏర్పడింది. రాధ చిల్లరకొట్టుకు ఆటోలో సరుకులు తీసుకువచ్చే సమయంలో వీరి మధ్య చనువు పెరిగింది. నేర స్వభావం గల శ్రీనివాసరావుకు ఆర్థిక ఇబ్బందులు తోడు కావడంతో రాధ ఒంటిపై వున్న నగలపై కన్నుపడింది. ఈ ఏడాది ఏప్రిల్ 23వ తేదీ మధ్యాహ్నం సరుకుల కోసం శ్రీనివాసరావుతో కలసి ఆటోలో గుంటూరు వెళ్లిన రాధ తిరిగిరాలేదు. కుటుంబసభ్యులు మే7న తాడికొండ పోలీస్‌స్టేషన్‌లో రాధ అదృశ్యంపై ఫిర్యాదు చేశారు.
వెలుగులోకి వచ్చింది ఇలా...
విచారణ చేపట్టిన పోలీసులకు రాధ కుమార్తె సౌందర్య ఆగస్టు 25వ తేదీన అనుమానితుల వివరాలను తెలిపింది. పథకం ప్రకారం శ్రీనివాసరావు అదేప్రాంతానికి చెందిన కత్తి గోపితో కలిసి నిడమర్రు పొలాల్లో రాత్రి 11గంటలకు మద్యం మత్తులో సమయంలో రాధపై లైంగిక దాడిచేసినట్లు, ఆపై ఆటో స్టార్టు చేసే తాడుతో గొంతు బిగించి హత్య చేసినట్లు విచారణలో ఒప్పుకున్నాడు. సెల్‌ఫోన్లు, మెడలోని బంగారు నగలు తీసుకుని శవాన్ని ఆటోలో కొప్పురావూరు పత్తి పొలాల్లోకి తీసుకువెళ్లి పెట్రోల్ పోసి పత్తికట్టెలో దహనం చేసినట్లు నిందితుడు తెలిపాడు. సంఘటనా స్థలంలో కాలి మెట్టెలు, ఎముకలు, కాలిన దుస్తుల ఆనవాళ్లు పోలీసులకు లభించాయి.
నిందితుల వద్ద నుంచి పోలీసులు రెండు సెల్‌ఫోన్లు, బంగారపు చెవి దిద్దులు, ఉంగరం, నానుతాడు, వెండి పట్టీలతో పాటు ఆటోను స్వాధీనం చేసుకున్నారు. మిస్సింగ్ కేసును హత్య కేసుగా నమోదు చేశారు. తన తల్లి ఏమైంది అని ప్రశ్నించిన సౌందర్యను కులం పేరుతో దూషించినందుకు నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు కూడా నమోదు చేసినట్టు డీఎస్పీ మధుసూదనరావు తెలిపారు. నిందితుడు శ్రీనివాసరావుపై అమరావతి, తుళ్లూరు, తాడికొండ పోలీస్‌స్టేషన్లలో ఏడు చోరీ కేసులు వున్నట్లు తెలిపారు. సమావేశంలో మంగళగిరి రూరల్ సీఐ టి.మురళీకృష్ణ, రూరల్ ఎస్‌ఐ వై.సత్యనారాయణ, తాడికొండ కానిస్టేబుళ్లు ప్రసాద్, కె.సురేష్‌బాబు, కె.కృష్ణారావులు వున్నారు.
Advertisement