క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో నిందితులైన తెలుగుదేశం పార్టీ ద్వితీయశ్రేణి నేతల చిట్టా పోలీసుల చేతికి చిక్కింది. దీంతో పోలీసులపై పెద్ద ఎత్తున ఒత్తిళ్లు వస్తున్నాయి.
క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో నిందితులైన తెలుగుదేశం పార్టీ ద్వితీయశ్రేణి నేతల చిట్టా పోలీసుల చేతికి చిక్కింది. దీంతో పోలీసులపై పెద్ద ఎత్తున ఒత్తిళ్లు వస్తున్నాయి. వారిని కాపాడేందుకు పలువురు తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నారు. కేసు నమోదు చేయవద్దని అడ్డుతగులుతున్నారు. అలాగే ప్రలోభాలకు గురిచేస్తున్నారు. దీంతో గజపతినగరం పోలీసులు నలిగిపోతున్నారు. కాగా, పోలీసులు నాయకుల ఒత్తిళ్లకు లొంగిపోతారా....? లేకపోతే పారదర్శకంగా వ్యవహరించి నిందితుల పేర్లను బయటపెడతారా అన్నదానిపై చర్చసాగుతోంది.
సాక్షి ప్రతినిధి, విజయనగరం : ప్రపంచకప్ సందర్భంగా జిల్లాలో బెట్టింగ్‌లు విచ్చలవిడిగా సాగుతున్నాయి. ముఖ్యంగా గజపతినగరం, పార్వతీపురం, విజయనగరం పట్టణాల్లోని లాడ్జీల్లో బుకీలు మకాం వేసి కోట్లాదిరూపాయలకు బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. సమాచారం తెలిసి దాడిచేసిన పోలీసులకు ఇప్పటికే ఈ మూ డు ప్రాంతాల్లో పలువురు చిక్కారు. వారిపై కేసులు కూడా నమోదయ్యాయి. ఈ క్రమంలోనే ఇటీవల గజపతినగరంలో కీలకమైన బుకీ ఒకరు పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ బుకీకి విశాఖపట్నం వరకు లింకులున్నాయి. పోలీసులు తమదైన శైలిలో కాల్ డేటా ఆధారంగా విచారించే సరికి కీలక సమాచారాన్ని బయటపెట్టాడు.
బెట్టింగ్‌లో పాల్గొంటున్న వారి పేర్లు సూచనప్రాయంగా చెప్పాడు. అందులో అధికార పార్టీకి చెందిన ద్వితీయశ్రేణి నాయకుల పేర్లు ఉన్నట్టు తెలిసింది. ఈ విషయం లీకవడంతో నిందితుల గుండెల్ల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. దీంతో అప్రమత్తమై తమ పేర్లు బయటకు రాకుండా ఉండేందుకు పలుకుబడి ఉన్న టీడీపీ నేతల్ని రంగంలోకి దించారు. వారు పోలీసులపై తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు చేస్తున్నారు. మూడు రోజుల క్రితం కేసులు లేకుండా చూడాలని కోరుతూ పోలీసులకు కొంత సొమ్మును ముట్ట జెప్పాలని చూసినప్పటికీ ఆ ప్రయత్నం విఫలమైనట్టు తెలిసింది. ఇక్కడి స్టేషన్ అధికారులకు విశాఖలో సన్నిహితంగా ఉన్న వ్యక్తుల చేత కూడా ఫోన్లు చేసి ఒత్తిడి చేశారు.
అయినప్పటికీ పోలీసులు వెనక్కి తగ్గలేదు. బుకీని సమగ్రంగా విచారించి, తదననుగుణంగా కేసు కట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ విషయంలో అధికార పార్టీ ఎమ్మెల్యే కాస్త తటస్థంగా ఉన్నట్టు తెలిసింది. ఎందుకొచ్చిందని ఆ కేసు విషయంలో జోక్యం చేసుకోవడం లేదు. పోలీసు అధికారులపై ఒత్తిడి చేసేందుకు కనీసం ప్రయత్నించలేదు. నిబంధనల మేరకు నడుచుకోవాలని పోలీస్ అధికారులకు చెప్పినట్టు తెలిసింది. ఏది ఏమైనప్పటికీ ఆ బుకీ వెల్లడించిన వ్యక్తులెవరో తెలియాల్సిన అవసరం ఉంది. వారిపై కూడా కేసులు నమోదు చేసి పారదర్శకంగా ఉన్నామని నిరూపించుకోవల్సిన బాధ్యత పోలీస్ అధికారులపై ఉంది. కాగా ఈ వ్యవహారంపై గజపతినగరం సీఐ విజయ్‌నాథ్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా పోలీసులపై ఒత్తిడి పెరుగుతున్న మాట వాస్తవమే. అయినా దేనికీ లొంగే ప్రసక్తి లేదని చెప్పారు. బెట్టింగ్‌లో ఎంతటి వారు ఉన్నా విడిచిపెట్టమని తెలిపారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.