రైతుల మధ్య ‘మట్టి’ చిచ్చు | Between the farmers 'soil' end | Sakshi
Sakshi News home page

రైతుల మధ్య ‘మట్టి’ చిచ్చు

Published Sun, Jun 8 2014 1:12 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

Between the farmers 'soil' end

  • ఆయకట్టు రైతుల్లో విభేదాలు
  •  వైఎస్సార్‌సీపీ, టీడీపీలుగా విడిపోయి ఫిర్యాదులు
  •  పట్టించుకోని నీటి పారుదల శాఖాధికారులు
  • చందర్లపాడు, న్యూస్‌లైన్ : మండలంలోని తోటరావులపాడు గ్రామంలోని చెరువులో మట్టిని పొలాలకు తోలుకునేందుకు నీటి పారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖాధికారులు ఇచ్చిన అనుమతులు గ్రామంలోని రైతుల మధ్య చిచ్చుపెట్టాయి. గ్రామ పంచాయతీ కార్యదర్శి, గ్రామానికి చెందిన షేక్ జానీ  మునేరు సబ్ డివిజన్ డీఈఈకు మట్టి పొలాలకు తోలుకునేందుకు అనుమతులు ఇవ్వాలని గత నెల 23న అర్జీ దాఖలు చేశారు. డీఈఈ ఈఈ అనుమతి కోసం గత నెల 30న పంపారు.  

    జూన్ నెల పదో తేదీ లోగా తోటరావులపాడు, తుర్లపాడు గ్రామాల చెరువుల్లో మట్టి తోలుకోవాలని ఆయన అనుమతిచ్చారు. సుమారు 500  టిప్పులు మాత్రమే మట్టి తీయాలని, రైతులు కేవలం వారి పొలాల్లో మెరక తోలుకునేందుకు మాత్రమే మట్టిని తోలించుకోవాలని షరతులతో కూడిన అనుమతిచ్చారు.

    ఈ షరతుల ప్రకారం జరుగుతుందీ లేనిదీ పర్యవేక్షించాల్సిన బాధ్యత గ్రామ సర్పంచుకు అప్పగించారు. దీంతో గ్రామంలో రెండు వర్గాలకు చెందిన రైతులు పొక్లెయిన్లు, ట్రాక్టర్లతో నాలుగు రోజులుగా మట్టిని తరలిస్తున్నారు. టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలుగా విడిపోయి రైతులు ఒకరిపై మరొకరు నీటి పారుదల శాఖ అధికారులకు ఫిర్యాదులు చేసుకున్నారు. దీంతో అధికారులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారి పొక్లెయిన్‌ను శుక్రవారం రాత్రి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.  

    అధికార పార్టీ నాయకుల ఒత్తిడి మేరకే ఎస్‌ఐ పొక్లెయిన్‌ను  స్టేషన్‌కు తెచ్చారని వైఎస్సార్‌సీపీ  నేతలు విమర్శిస్తున్నారు. చెరువు ఆయకట్టు రైతులకు సంబంధించిన పొలాలకు మాత్రమే మట్టిని తోలాల్సి ఉండగా టీడీపీ నాయకులు గ్రామ శివారులో ఉన్న గ్రావెల్ గుంతలకు కూడా మట్టిని తోలి పూడ్పిస్తున్నారని వైఎస్సార్ సీపీ నాయకులు, రైతులు ఆరోపిస్తున్నారు.

    ఈ విషయంపై నీటి పారుదల శాఖ అధికారులు కలుగజేసుకోకపోతే గ్రామంలో మట్టి తోలుకునే విషయంలో ఘర్షణలు చెలరేగే అవకాశం ఉందని వైఎస్సార్ సీపీ నాయకులు పేర్కొంటున్నారు. ఈ విషయంపై నీటి పారుదల శాఖ ఏఈ స్వాతిని వివరణ కోరగా చెరువులో మట్టిని ఆయకట్టులో ఉన్న రైతులందరూ తోలుకోవచ్చని గ్రామాల్లోని రాజకీయ నేపథ్యంలో రైతులు ఒకరిపై మరోకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారన్నారు. పదో తేదీ వరకు మాత్రమే చెరువులో మట్టి తోలుకునేందుకు అనుమతి ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement