బెజవాడ చేరుకున్న ‘షోలాపూర్’ క్షతగాత్రులు
- స్పెషల్ ఆరోగ్యశ్రీ పథకం కింద శస్త్రచికిత్సలు
- కలెక్టర్ ఆదేశంతో అనూ ఆస్పత్రిలో చికిత్స
విజయవాడ : మహారాష్ట్రలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి షోలాపూర్ యశో దా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తొమ్మిదిమందిని విజయవాడ తరలించారు. మచిలీపట్నం, పరిసర ప్రాంతాలకు చెందిన వీరిని ప్రత్యేక వాహనంలో షోలాపూర్ నుంచి శుక్రవారం సాయంత్రం నగరానికి తీసుకువచ్చారు. నగరంలోని సూర్యారావుపేట అనూ ఆస్పత్రిలో రెవెన్యూ అధికారులు చేర్పించారు. ప్రత్యేక ఆరోగ్యశ్రీ పథకం కింద అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు చేయిం చాలని కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు అధికారులను ఆదేశించారు.
గాయపడినవారిలో అర్జా బాల, తోట వెంకటసుబ్బారావు, వడ్డీ లక్ష్మి, నూ కల నాగమణిలకు శస్త్ర చికిత్స చేయాల్సిన అవస రం ఉందని వైద్యులు తెలిపారు. మిగతా వారిలో అర్జా సిరి నాగమణి, తోట కనకదుర్గ, కుమార్‌బాబు, అర్జా శ్రీనివాస్, చలమలశెట్టి సుజాతలకు ప్రథమ చికిత్స చేసి, డిశ్చార్జి చేశారు.
క్షతగాత్రులను అర్బన్ తహశీల్దార్ ఆర్.శివరావు, వీఆర్వోలు బాషా, శ్రీనివాస్ ఆస్పత్రికి తరలించారు. అవసరమైన వారికి శస్త్ర చికిత్సలకు ఏర్పాట్లు చేస్తున్నారు. తహశీల్దార్ శివరావు బాధితులను పరామర్శించారు. వారికి అవసరమైన సహాయ సహకారాలను అందిస్తున్నారు.