భద్రాచలం, న్యూస్‌లైన్: భద్రాచలంను తెలంగాణలోనే ఉంచాలని జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ రెండో రోజైన శనివారం కూడా సంపూర్ణంగా జరిగింది. మూడో రోజు ఆదివారం కూడా కొనసాగిస్తామనిజర్నలిస్టు సంఘం నేతలు ప్రకటించారు. ర్యాలీలు, రాస్తారోకోలు, ధర్నాలతో భద్రాచలండివిజన్ దద్దరిల్లింది. దుకాణాలు, పెట్రోల్ పంపులు, సినిమాహాళ్లు తెరుచుకోలేదు. ఆర్టీసీబస్సులు సారపాక వరకే తిరిగాయి. దీంతో ప్రయాణికులు మూడు కిలోమీటర్ల మేర నడిచి రావాల్సి వచ్చింది. రెండో రోజు బంద్ ఉద్రిక్తతల నడుమ కొనసాగింది. రామాలయానికి వచ్చే భక్తుల సంఖ్య కూడా తగ్గిపోవటంతో ఆలయ పరిసర ప్రాంతాలు నిర్మానుష్యంగా కనిపించాయి. భద్రాచలంను తెలంగాణను నుంచి వేరు చేయవద్దంటూ నలుగురు యువకులు బహుళ అంతస్తుల భవనంపై ఉన్న హోర్డింగ్‌ల పైకి ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశారు.
సాయంత్రం ఆర్టీసీ బస్సులను తిప్పేందుకు పోలీసులు ప్రయత్నించగా నిరసనకారులు అడ్డుకున్నారు. కాగా, భద్రాచలం డివిజన్ ఖమ్మం జిల్లా లో అంతర్భాగమేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో అన్నారు. భద్రాచలం డివిజన్‌ను ఖమ్మం జిల్లాలోనే ఉంచాలని చెబుతున్న మిగతాపార్టీలు ఢిల్లీలో వాణిని వినిపించడం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు ముంపులేకుండా నిర్మించే అవకాశం ఉంటే ఈ అంశం తెరపైకి వచ్చేదే కాదన్నారు.