
'భద్రాచలం డివిజన్‌ను సీమాంధ్రకు వదులుకునేది లేదు'
హైదరాబాద్: భద్రాచలం డివిజన్ ను సీమాంధ్రకు వదులుకునేది లేదని మంత్రి డీకే అరుణ స్పష్టం చేశారు. ఏళ్ల తరబడి ఖమ్మం జిల్లాలో భద్రాచలం భాగంగా ఉందని ఆమె తెలిపారు. రేపటి నుంచి మూడో విడత రచ్చబండ కార్యక్రమం ఆరంభం కానున్న సందర్భంగా అరుణ ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఈ రచ్చబండ కార్యక్రమంలో రేషన్‌కార్డులు, పెన్షన్లు, ఇళ్ల మంజూరే ప్రధాన ఎజెండా అని ఆమె అన్నారు. రచ్చబండలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన మీదుట తదుపరి కార్యచరణ ఉంటుందన్నారు. అలా కాకుండా ఇప్పటికిప్పుడు రేషన్ కార్డులు మంజూరు చేయడం సాధ్యం కాదన్నారు.
హైదరాబాద్ ను యూటీ చేయాలంటూ కేంద్ర మంత్రులు డిమాండ్ చేయడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. తమకు దక్కని హైదరాబాద్‌ను తెలంగాణకు కూడా దక్కకూడదనే దురుద్దేశమే ఇందులో కనిపిస్తోందన్నారు. విభజనకు ఇబ్బందులు స్పష్టించి, తెలంగాణ ప్రజల్లో అనుమానాలు రేకెత్తించడమే సీమాంధ్ర కేంద్ర మంత్రుల ప్రధాన ఉద్దేశ్యంగా కనిపిస్తోందన్నారు. రాష్ట్ర విభజనకు సీమాంధ్ర నేతలంతా సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.