భద్రాచలం టౌన్, న్యూస్‌లైన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో బుధవారం నుంచి వైకుంఠ ఏకాదశి మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అధ్యయనోత్సవాలలో భాగంగా జరిగే పగల్‌పత్తు ఉత్సవాలలో స్వామివారు తొమ్మిది అవతారాల్లో దర్శనమిస్తారు. సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించినకాలం దేవతలకు బ్రహ్మముహూర్తకాలం. ఈ పరమ పవిత్రమైన కాలంలో వచ్చే శుద్ధ ఏకాదశియే శ్రీ వైకుంఠ ఏకాదశి. ముక్కోటి దేవతలు శ్రీ మహావిష్ణువును శ్రీ వైకుంఠంలోని ఉత్తరద్వారం నుంచి ఈ ఏకాదశి నాడే దర్శిస్తారు. కావున ఈ ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అనే మరోపేరు ఉంది.
ఇటువంటి పవిత్రమైన ఏకాదశి పర్వదినానికి ముందు పదిరోజులు ‘పగల్‌పత్తు ఉత్సవాలు’, తర్వాతి పదిరోజులను ‘రాపత్తు ఉత్సవాలు’గా వ్యవహరిస్తారు. మొత్తం 21 రోజులపాటు వైభవోపేతంగా అధ్యయనోత్సవాలను శ్రీ పాంచరాత్ర భగవశాస్త్రమును అనుసరించి దేవస్థానంలో నిర్వహించటం ఆనవాయితీ. అధ్యయనోత్సవాలలో భాగంగా జనవరి 1 నుంచి జనవరి 10 వరకు పగల్‌పత్తు ఉత్సవాలు, జనవరి 11 రాత్రి నుంచి జనవరి21 వరకు రాపత్తు ఉత్సవాలు, జనవరి 10న గోదావరిలో తెప్పోత్సవం, 11న వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం, 28వ తేదీన రామాలయంలో స్వామివారికి విశ్వరూప సేవలను ఆలయ అధికారులు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పగల్‌పత్తు ఉత్సవాలలో స్వామివారు దర్శనమిచ్చే అవతారాల విశిష్టత...
మత్స్యావతారం (1-1-2014, బుధవారం)
శ్రీ మహావిష్ణువు అవతారాలలో మొట్టమొదటి అవతారం మత్స్యావతారం. ఈ అవతారానికి సంబంధించి రెండు గాధలు పురాణాలలో ఉన్నాయి. ఒకటి జ్ఞాన నిధులైన బ్రహ్మ నుంచి అపహరించి సముద్రంలో దాగి ఉన్న సోమకాసురిని సంహరించడానికి మత్స్యావతారం ధరించి, వేదాలను ఉద్ధ రించాడు. రెండోది జలప్రళయం నుంచి నావలో ఉన్న ైవైవస్వత మనువును, సప్తరుషులను, సృష్టికి అవసరమైన విత్తనాలను, ఔషధాలను రక్షించాడు. ఈ అవతారంలో ఉన్న స్వామివారిని పూజించుట వల్ల కేతుగ్రహ బాధలు తొలగుతాయని ప్రతీతి.
కూర్మావతారం (2 -1-14, గురువారం)
దేవతలు, రాక్షసులు మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకి అనే పామును తాడుగా చేసుకొని అమృతం కోసం క్షీరసాగరాన్ని చిలకుతున్న సమయంలో ఏ ఆధారం లేక మందరగిరి మునిగిపోయింది. దేవతలు, రాక్షసుల కోరిక పై శ్రీహరి కూర్మావతారాన్ని ధరించి మునిగిపోయిన మందర పర్వతాన్ని తన వీపున నిలుపుకొని పెకైత్తి సహాయపడ్డాడు. ఈ అవతరంలోని స్వామివారిని దర్శించుట వల్ల శనిగ్రహ సంబంధమైన దోషాలు తొలగుతాయని పండితులు చెబుతున్నారు.
వరాహావతారం (3-1-14, శుక్రవారం)
ప్రజా సృష్టి చేద్దామనుకున్న స్వాయంభువుని, బ్రహ్మాదుల మొర విన్న నారాయణుడు నీటిలో మునిగివున్న భూమిని బయటకి తీయడానికి వరాహావతారాన్ని ధరించాడు. భూమిని తన కోరలతో పెకైత్తాడు. ఈ కార్యంలో ఆటంకం కలిగించిన లోక కంటకుడైన హిరణ్యకశిపుడు అనే రాక్షసున్ని సంహరించి భూమిని రక్షించాడు. రాహుగ్రహ బాధలున్న వారు ఈ అవతారాన్ని చూడటం వల్ల ఆ బాధల నుంచి విముక్తులవుతారని ప్రతీతి.
నారసింహావతారం (4 -1-14, శనివారం)
తన ప్రియభక్తుడైన ప్రహ్లాదుని అనేక బాధలకు గురిచేస్తున్న హిరణ్యకశిపుడు అనే రాక్షసుని సంహరించడానికి నారాయణుడు నారసింహ అవతారాన్ని ధరించాడు. ఈ అవతార నిడివి స్వల్పకాలమైనా...భగవానుని సర్వవ్యాపకతను తెలియజేస్తుంది. భూత గ్రహ బాధలు, కుజ గ్రహ బాధలు ఉన్నవారు ఈ అవతారాన్ని పూజించటం వల్ల విముక్తి పొందుతారని శాస్త్రం చెబుతుంది.
వామనావతారం (5-1-14, ఆదివారం)
దేవతల సర్వసంపదలను తన స్వాధీనం చేసుకున్న రాక్షస రాజైన బలిచక్రవర్తి దగ్గరికి శ్రీహరి వామనరూపంలో వెళ్లి మూడు అడుగులు దానంగా స్వీకరించారు. ఒక అడుగుతో భూమిని, రెండో అడుగుతో ఆకాశాన్ని, మూడో అడుగుని బలి తలపై మోపి త్రివిక్రముడవుతాడు. ఈ అవతారాన్ని దర్శించటం వల్ల గురుగ్రహ బాధలు తొలగుతాయని వేదపండితులు తెలుపుతున్నారు.
పరశురామావతారం (6-1-14, సోమవారం)
శ్రీ మహావిష్ణువు జమదగ్ని అనే మహర్షి కొడుకుగా జన్మించారు. పరశురాముడు (భార్గవరాముడు) అని పిలవబడుతూ దుష్టులైన కార్తవీర్యార్జునుని, దుర్మార్గులైన రాజులను ఇరవై ఒక్కసార్లు దండెత్తి సంహరించి ధర్మాన్ని స్థాపించాడు. శుక్రగ్రహ బాధలున్నవారు ఈ అవతారాన్ని దర్శించటం వలన శుభపలితాలను పొందుతారని ప్రతీతి.
శ్రీ రామావతారం (7-1-14, మంగళవారం)
లోక కంఠకులైన రావణ కుంభకర్ణాది రాక్షసులను సంహరించడానికి దశరథుని కుమారునిగా శ్రీ మన్నారాయణుడు ధరించిన అవతారం శ్రీరామావతారం. వ్యక్తిగత సౌక్యాలకన్నా ధర్మాచరణయే ఉత్తమమైనదని, అదే శాశ్వతమైనదని భావించి, పరిపూర్ణమైన మానవుడు ఎలా ఉండాలో ఆచరించి చూపించిన ఆదర్శ పురుషుడు, మర్యాద పురుషోత్తముడు, మూర్తీభవించిన ధర్మ స్వరూపుడు శ్రీరామచంద్రుడు. సూర్యగ్రహ బాధలున్న వారు రామావతారాన్ని దర్శించటం వల్ల బాధల నుంచి విముక్తి పొందుతారని పండితులు చెబుతున్నారు.
శ్రీ బలరామావతారం (8-1-14, బుధవారం)
శ్రీహరికి శయనమైన ఆదిశేషుని అంశతో జన్మించి, ‘కృషితో నాస్తి దుర్భిక్షం’ అనే నానుడికి ప్రతీకగా నాగలిని ఆయుధంగా ధరించి శ్రీ కృష్ణుని అన్నగా.. ఆయనకు ధర్మ స్థాపనలో సహకరించిన అవతారం శ్రీ బలరామావతారం. సంకర్షణునిగా పిలవబడే బలరాముడు ప్రలంబాసురుడనే రాక్షసుని సంహరించాడు. ఈ అవతారాన్ని దర్శించిన వారికి మాందిగుళికా గ్రహాల బాధలు తొలగిపోతాయి.
శ్రీకృష్ణావతారం (9-1-14, గురువారం)
దేవకీ వసుదేవులకు అష్టమ సంతానంగా జన్మించి, దుష్టులైన కంసుడు, నరకాసురుడు, శిశుపాలుడు మొదలైన వారిని వధించి, ధర్మవర్తనులైన పాండవుల పక్షం వహించి, కురుక్షేత్ర సంగ్రామంలో ఉపనిషత్తుల సారాంశమైన భగవద్గీతను అర్జునునికి భోదించి.. మావన ఆదర్శాలను, ధర్మాన్ని స్థాపించిన శ్రీమన్నారాయణుని పరిపూర్ణ అవతారం శ్రీ కృష్ణావతారం. చంద్రగ్రహ బాధలున్నవారు ఈ అవతారాన్ని దర్శించడం వల్ల శుభఫలితాలను పొందుతారని ప్రతీతి.
అవతార పురుషుడు శ్రీరాముడు
Published Tue, Dec 31 2013 2:43 AM | Last Updated on Sat, Sep 2 2017 2:07 AM
Advertisement