వడ్లను గోటితో ఒలుస్తున్న మహిళలు
సాక్షి, చీరాల అర్బన్: జగదభిరాముడు.. కోదండ రాముడు.. రఘురాముడు.. ఇలా ఏ పేరుతో పిలిచినా పలికే నీలమేఘశ్యాముడు శ్రీరాముడు. పితృవాక్య పరిపాలన అనే మాటకు అర్థం చెప్పిన మహోన్నతుడు. అటువంటి ఏకపత్నీవ్రతుడు శ్రీరామచంద్రమూర్తి కల్యాణమంటే జగత్కల్యాణమే. దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలంలో శ్రీరామనవమి రోజున నిర్వహించే సీతారాముల కల్యాణం చూసినా, వినినా ఎంతో పుణ్యం. అంతటి కల్యాణ ఘట్టంలో తమకు ఏదో ఒక భాగస్వామ్యం కావాలని ఎంతో మంది కోరుకుంటారు. కల్యాణంలో ప్రధానంగా వినియోగించేవి తలంబ్రాలు. ఆ తలంబ్రాలను గోటితో ఒలిచే మహద్భాగ్యం క్షీరపురి వాసులకు ఆరోసారి దక్కింది.
చీరాలకు చెందిన రఘురామభక్త సేవా సమితి చైర్మన్ పొత్తూరి బాలకేశవులు 2013లో శ్రీరామనవమి కల్యాణం తిలకించేందుకు భద్రాచలం వెళ్లారు. అక్కడ కల్యాణంలో స్వామివారికి గోటితో ఒలిచిన తలంబ్రాలను ఉభయ గోదావరి జిల్లాలతోపాటు పలు జిల్లాల నుంచి భక్తులు దేవస్థానానికి సమర్పించారు. ఆ అవకాశాన్ని తమకు అందించాలని ఆయన దేవస్థాన యాజమాన్యాన్ని కోరారు. దీంతో 2014లో చీరాల వాసులకు అవకాశం దక్కింది. అప్పటి నుంచి ఏటా భద్రాచలంలో నిర్వహించే సీతారాముల కల్యాణానికి చీరాల నుంచి కూడా గోటి తలంబ్రాలు స్వామివారికి అందుతున్నాయి. 2020లో జరిగే కల్యాణానికి కూడా ఆరోసారి ఆ అదృష్టం చీరాలవాసులకు దక్కింది. ఈ మేరకు దేవస్థాన అధికారుల నుంచి అనుమతి లభించింది. ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం వడ్లను గోటితో ఒలిచే కార్యక్రమాన్ని మహిళలు సోమవారం ప్రారంభించారు. పలు మహిళా సమాజాల ద్వారా, అలానే పలు దేవాలయాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టి శ్రీరామనవమి నాటికి భక్తిశ్రద్ధలతో భద్రాద్రికి చేరుస్తారు. అరుదైన అవకాశం ఆరుసార్లు తమను వరించడం పూర్వ జన్మ పుణ్యంగా భావిస్తున్నట్లు బాలకేశవులు చెబుతున్నారు.
150 క్వింటాళ్లకు అనుమతి
భద్రాచలంలో 2020లో నిర్వహించే శ్రీరామనవమి పర్వదినానికి ఉపయోగించే తలంబ్రాలను 150 క్వింటాళ్లకు ఆలయ అధికారుల నుంచి అనుమతి వచ్చింది. కల్యాణానికి వినియోగించే మొత్తం 150 క్వింటాళ్ల తలంబ్రాలు క్షీరపురి వాసులే అందించడం కోటి నోములు ఫలం. తలంబ్రాలతోపాటు పసుపు 225 కిలోలు, కుంకుమ 450 కిలోలు, గులాం 450 కిలోలు, నూనె 225 కిలోలు, సెంటు(జాస్మిన్) 75 లీటర్లు, రోజ్ వాటర్ 75 లీటర్లు, 100 కిలోల లోపు ముత్యాలు అందించాలని అనుమతి పత్రంలో ఆలయ అధికారులు కోరారు.
గోటి తలంబ్రాల కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న దృశ్యం
Comments
Please login to add a commentAdd a comment