భద్రాచలం, న్యూస్‌లైన్ : భూలోక వైకుంఠంగా పేరుగాంచిన భద్రాచలంలో జనవరి 1 నుంచి ప్రారంభమయ్యే వైకుంఠ ఏకాదశీ ప్రయుక్త అధ్యయనోత్సవాలకు పనులను సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ఉత్తర ద్వారానికి రంగులు వేస్తున్నారు. అదే విధంగా ఉత్తర ద్వారానికి ఎదురుగా మిథిలా స్టేడియంలో చలువ పందిళ్ల నిర్మాణపు పనులు ప్రారంభించారు. శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ వేడుకలకు రాష్ట్ర నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తారు. వేడుకల్లో భాగంగా జనవరి 10న గోదావరి నదిలో స్వామి వారికి తెప్పోత్సవ ం జరుగుతుంది. ఆ మరుసటి రోజు(జనవరి 11) తెల్లవారుజామున స్వామి వారు ఉత్తర ద్వారంలో దర్శనం ఇస్తారు. ఇలా ఉత్తర ద్వారంలో దర్శనమిచ్చే స్వామి వారిని కనులారా వీక్షిస్తే సకల పాపాలు తొలగిపోతాయనేది భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇందుకోసం తెప్పోత్సవం రోజునే దూర ప్రాంతాల నుంచి భక్తులు భద్రాచలానికి చేరుకొని ఇక్కడ బస చేస్తారు. ఈసంవత్సరం అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న దేవస్థానం అధికారులు ఇందుకనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
రూ.35 లక్షలతో ఏర్పాట్లు : అంగరంగ వైభవంగా ముక్కోటి ఉత్సవాలను నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. వీటిలో ఇంజినీరింగ్ పనులకు సుమారు రూ. 20 లక్షల వరకూ వెచ్చించనున్నారు. భక్తులు సేద తీరేందుకు చలువ పందిళ్ల నిర్మాణం, రామాలయం, ముక్కోటి ద్వారానికి రంగులు వేయటం, సెల్లార్ల నిర్మాణం, విద్యుత్ దీపాల అలంకరణ వంటి పనులను ఇంజనీరింగ్ అధికారులు పర్యవే క్షించనున్నారు. మిగతా ఏర్పాట్లు ఆర్‌డీవో పర్యవేక్షణలో జరుగనున్నాయి.
లాంచీపైనే తెప్పోత్సవం :
ఈసారి గోదావరి నదిలో నిర్వహించే స్వామి తెప్పోత్సవం లాంచీపైనే జరుగనుంది. గోదావరి నదిలో లాంచీ తిరగేందుకు నీరు లేని పక్షంలో బల్లకట్ట వాహనంపై తెప్పోత్సవం నిర్వహించాలని అధికారులు భావించారు. అయితే ప్రస్తుతం ఉన్న నీటి మట్టం ప్రకారం లాంచీ తిరిగేందుకు ఎటువంటి ఇబ్బంది ఉండదని నీటి పారుదల శాఖ అధికారులు చెప్పటంతో ఇందుకనుగుణంగా దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఏర్పాట్లపై నేడు సమీక్ష :
వైకుంఠ ఏకాదశీ ఉత్సవాల నిర్వహణపై మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఈవో రఘునాథ్ తెలిపారు. భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయలో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గతంలో తలెత్తిన లోపాలను బేరీజు వేసుకొని ఈ ఏడాది చేపట్టాల్సిన పనులపై సమీక్షించనున్నారు. ఇదిలా ఉండగా ప్రతీ ఏటా ముక్కోటి ఏర్పాట్లల్లో లోపాలు తలెత్తుతూనే ఉన్నాయి. ఉత్సవాల రోజు వరకూ పనులు జరుగుతుండటం పెద్ద సమస్యగా మారుతోంది. అదేవిధంగా టిక్కెట్ల విక్రయాల్లో కూడా స్పష్టత లేకండా పోతోంది. ఉత్సవం జరిగే రోజు వ రకూ కూడా టిక్కెట్ల విక్రయాలు చేపట్టకపోవటంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అంతేకాకుండా టిక్కెట్లును సామాన్య భక్తులకు అందుబాటులో ఉంచకుండా ఇక్కడి అధికారులు వీవీఐపీల సేవలోనే తరిస్తున్నారనే విమర్శ కూడా ఉంది. ఈ నేపథ్యంలో గతేడాది టిక్కెట్లు మిగిలిపోవటం జరిగింది.
దేవస్థానానికి పాలక మండలి కూడా లేకపోవటంతో సమస్యలపై ప్రశించే వారు కరువయ్యారు. దీంతో ఇక్కడి అధికారులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారనే విమర్శ కూడా ఉంది. భక్తుల అవసరాలకు అనుగుణంగా తగిన సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు ముందుగానే మేల్కొనాల్సిన అవసరం ఉంది.
ముక్కోటి ఏర్పాట్లు షురూ
Published Tue, Dec 10 2013 5:37 AM | Last Updated on Sat, Sep 2 2017 1:27 AM
Advertisement
Advertisement