Sree Seetha Ramachandra Swamy
-
భద్రాద్రి ఆలయంలో కీలక మార్పులు
భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని రామాయలంలో పలు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. 14 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ఉన్నపళంగా తప్పించారు. అలాగే 100 గ్రాముల లడ్డూ సైజును 80 గ్రాములకు కుదించారు. రెగ్యులర్‌గా ఉండే ఉద్యోగులను అంతర్గతంగా బదిలీలు చేశారు. ఇంత అత్యవసరంగా మార్పులు ఎందుకు చేశారో తెలియరాలేదు. -
భద్రాద్రిలో భక్తులకు డ్రెస్ కోడ్
భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర దేవస్ధానం కొత్త నిబంధనలకు శ్రీకారం చుట్టింది. భద్రాద్రి రాముని దర్శనార్థం వచ్చే భక్తులు తప్పనిసరిగా సాంప్రదాయ దుస్తులు ధరించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. ఈమేరకు శ్రీ సీతారామచంద్రుల అంతరాలయ దర్శనానికి ఇకపై సంప్రదాయ దుస్తులు ధరించి రావాల్సి ఉంటుంది. మగవారు పంచె, కండువా, స్త్రీలు చీర లేదా పంజాబి డ్రెస్ ధరించి వస్తేనే అంతరాలయ దర్శనానికి అనుమతిస్తారు. అలాగే ప్రత్యేక పూజలు, నిత్య కల్యాణానికి కూడా ఇదే సాంప్రదాయ దుస్తులతోనే రావాల్సి ఉంటుంది. ఈ నిబంధన జూన్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది. ఈ మేరకు నిబంధనలు ఖరారు చేస్తూ దేవస్థానం అధికారులు నిర్ణయం తీసుకున్నారు. -
రాములోరి కల్యాణానికి ముహూర్తం ఖరారు
భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 5 వ తేదీన కల్యాణం నిర్వహించనున్నారు. భద్రాద్రిలోని వైదిక కమిటీ ఈ ముహూర్తాన్ని ఖరారు చేసింది. మార్చి 29 నుంచి ఏప్రిల్ 11వ తేదీ వరకు తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 5న కళ్యాణం నిర్వహించనున్నారు. అలాగే ఏప్రిల్ 6న రాములవారి మహాపట్టాభిషేకానికి ఏర్పాట్లు చేస్తున్నారు. -
ముక్కోటి ఏర్పాట్లు షురూ
భద్రాచలం, న్యూస్‌లైన్ : భూలోక వైకుంఠంగా పేరుగాంచిన భద్రాచలంలో జనవరి 1 నుంచి ప్రారంభమయ్యే వైకుంఠ ఏకాదశీ ప్రయుక్త అధ్యయనోత్సవాలకు పనులను సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ఉత్తర ద్వారానికి రంగులు వేస్తున్నారు. అదే విధంగా ఉత్తర ద్వారానికి ఎదురుగా మిథిలా స్టేడియంలో చలువ పందిళ్ల నిర్మాణపు పనులు ప్రారంభించారు. శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ వేడుకలకు రాష్ట్ర నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తారు. వేడుకల్లో భాగంగా జనవరి 10న గోదావరి నదిలో స్వామి వారికి తెప్పోత్సవ ం జరుగుతుంది. ఆ మరుసటి రోజు(జనవరి 11) తెల్లవారుజామున స్వామి వారు ఉత్తర ద్వారంలో దర్శనం ఇస్తారు. ఇలా ఉత్తర ద్వారంలో దర్శనమిచ్చే స్వామి వారిని కనులారా వీక్షిస్తే సకల పాపాలు తొలగిపోతాయనేది భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇందుకోసం తెప్పోత్సవం రోజునే దూర ప్రాంతాల నుంచి భక్తులు భద్రాచలానికి చేరుకొని ఇక్కడ బస చేస్తారు. ఈసంవత్సరం అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న దేవస్థానం అధికారులు ఇందుకనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రూ.35 లక్షలతో ఏర్పాట్లు : అంగరంగ వైభవంగా ముక్కోటి ఉత్సవాలను నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. వీటిలో ఇంజినీరింగ్ పనులకు సుమారు రూ. 20 లక్షల వరకూ వెచ్చించనున్నారు. భక్తులు సేద తీరేందుకు చలువ పందిళ్ల నిర్మాణం, రామాలయం, ముక్కోటి ద్వారానికి రంగులు వేయటం, సెల్లార్ల నిర్మాణం, విద్యుత్ దీపాల అలంకరణ వంటి పనులను ఇంజనీరింగ్ అధికారులు పర్యవే క్షించనున్నారు. మిగతా ఏర్పాట్లు ఆర్డీవో పర్యవేక్షణలో జరుగనున్నాయి. లాంచీపైనే తెప్పోత్సవం : ఈసారి గోదావరి నదిలో నిర్వహించే స్వామి తెప్పోత్సవం లాంచీపైనే జరుగనుంది. గోదావరి నదిలో లాంచీ తిరగేందుకు నీరు లేని పక్షంలో బల్లకట్ట వాహనంపై తెప్పోత్సవం నిర్వహించాలని అధికారులు భావించారు. అయితే ప్రస్తుతం ఉన్న నీటి మట్టం ప్రకారం లాంచీ తిరిగేందుకు ఎటువంటి ఇబ్బంది ఉండదని నీటి పారుదల శాఖ అధికారులు చెప్పటంతో ఇందుకనుగుణంగా దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లపై నేడు సమీక్ష : వైకుంఠ ఏకాదశీ ఉత్సవాల నిర్వహణపై మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఈవో రఘునాథ్ తెలిపారు. భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయలో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గతంలో తలెత్తిన లోపాలను బేరీజు వేసుకొని ఈ ఏడాది చేపట్టాల్సిన పనులపై సమీక్షించనున్నారు. ఇదిలా ఉండగా ప్రతీ ఏటా ముక్కోటి ఏర్పాట్లల్లో లోపాలు తలెత్తుతూనే ఉన్నాయి. ఉత్సవాల రోజు వరకూ పనులు జరుగుతుండటం పెద్ద సమస్యగా మారుతోంది. అదేవిధంగా టిక్కెట్ల విక్రయాల్లో కూడా స్పష్టత లేకండా పోతోంది. ఉత్సవం జరిగే రోజు వ రకూ కూడా టిక్కెట్ల విక్రయాలు చేపట్టకపోవటంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అంతేకాకుండా టిక్కెట్లును సామాన్య భక్తులకు అందుబాటులో ఉంచకుండా ఇక్కడి అధికారులు వీవీఐపీల సేవలోనే తరిస్తున్నారనే విమర్శ కూడా ఉంది. ఈ నేపథ్యంలో గతేడాది టిక్కెట్లు మిగిలిపోవటం జరిగింది. దేవస్థానానికి పాలక మండలి కూడా లేకపోవటంతో సమస్యలపై ప్రశించే వారు కరువయ్యారు. దీంతో ఇక్కడి అధికారులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారనే విమర్శ కూడా ఉంది. భక్తుల అవసరాలకు అనుగుణంగా తగిన సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు ముందుగానే మేల్కొనాల్సిన అవసరం ఉంది. -
రామా.. కనవేమిరా..!
భద్రాచలం, న్యూస్‌లైన్ : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయాధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది. భక్తుల సౌకర్యాలు, ఆలయ అవసరాల పేరిట చేపట్టే పనుల్లో నిబంధనలను కాలరాస్తున్నారనే ఆరోపణలున్నాయి. దేవస్థానం అన్నదాన సత్రంలో 20 టేబుళ్లు, పర్ణశాల ఆలయం కోసం 8 హుండీలను కొనుగోలు చేశారు. గుంటూరులో తయారు చేయించినట్లుగా చెపుతున్న వీటిని ఆదివారం భద్రాచలం తీసుకొచ్చారు. టేబుళ్ల కోసం సుమారు రూ.2 లక్షలు, హుండీలకు రూ.1.50 లక్షలు వెచ్చించినట్లు తెలిసింది. ఈ టేబుళ్లను కొత్తగా నిర్మించిన అన్నదాన సత్రంలో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం భద్రాద్రి రామాయంలో ఉన్న హుండీలను పర్ణశాలకు పంపించి, కొత్తగా తెచ్చిన వాటిని ఇక్కడ ఏర్పాటు చేయాలని ఆలయాధికారులు భావిస్తున్నారు. అయితే ఇప్పటికే సరిపడా హుండీలు ఉన్నప్పటికీ.. మళ్లీ కొత్తగా కొనుగోలు చేయటం విమర్శలకు తావిస్తోంది. కాగా, ప్రస్తుతం అన్ని దేవాలయాల్లోనూ స్టీల్ హుండీలను మాత్రమే ఏర్పాటు చేస్తున్నారు. డబ్బులు, ఇతర కానుకలు తుప్పు పట్టకుండా ఉండేందుకు వీటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే భద్రాద్రి దేవస్థానం అధికారులు కొత్తగా కొనుగోలు చేసినవి ఇనుపవి కావటం గమనార్హం. అందులోనూ గేజ్ తక్కువగా ఉన్న ఇనుముతో చేసినవి కావడంతో ఇవి కొంతకాలం మాత్రమే ఉపయోగపడతాయని పలువురు అంటున్నారు. నిబంధనలు పట్టవా..? దేవాదాయశాఖ నిబంధనల ప్రకారం రూ.50 వేలకు పైగా విలువైన వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా టెండర్లను పిలవాలి. కానీ ఇక్కడి అధికారులు కొటేషన్ ద్వారా ఈ పనులు అప్పగించినట్లు తెలిసింది. కమీషన్ల కోసమే వారు ఇలా వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి. గతంలో అన్నదాన సత్రంలో భోజనాలు వడ్డించే ట్రేలను తయారుచేసిన దుకాణదారుల నుంచే వీటిని కూడా కొనుగోలు చేసినట్లు తెలిసింది. భోజనం వడ్డించేందుకు చంధ్రశేఖర్ ఆజాద్ ఈవోగా ఉన్న సమయంలో రెండు ట్రేలను కొనుగోలు చేయగా, అవి నాసిరకంగా ఉండటంతో బిల్లు చెల్లించేందుకు ఆయన నిరాకరించారు. అవి కొంతకాలానికే నిరుపయోగంగా మారాయి. వాటిని అన్నదాన సత్రంలోని ఓ మూలన పడేయగా, ప్రస్తుతం తప్పుపట్టాయి. అయితే వీటికి కూడా బిల్లు చేసి ఆ మొత్తాన్ని కాజేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దేవస్థానానికి పాలకమండలి కూడా లేకపోవటంతో అడిగే వారు లేక అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆలయంలో జరుగుతున్న ఈ పరిణామాలపై దేవాదాయశాఖ ఉన్నతాధికారులు ఇప్పటికైనా దృష్టి సారించాలని భ క్తులు కోరుతున్నారు. కొటేషన్లతోనే కొనుగోళ్లు : రవీందర్, దేవస్థానం ఏఈ కొటేషన్ల ద్వారానే హుండీలు, భోజనం చేసేందుకు టేబుళ్లు కొనుగోలు చేశామని ఆలయ ఏఈ రవీందర్ తెలిపారు. నిబంధనల మేరకే అన్నీ జరిగాయన్నారు.