భద్రాచలం, న్యూస్‌లైన్ : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయాధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది. భక్తుల సౌకర్యాలు, ఆలయ అవసరాల పేరిట చేపట్టే పనుల్లో నిబంధనలను కాలరాస్తున్నారనే ఆరోపణలున్నాయి. దేవస్థానం అన్నదాన సత్రంలో 20 టేబుళ్లు, పర్ణశాల ఆలయం కోసం 8 హుండీలను కొనుగోలు చేశారు. గుంటూరులో తయారు చేయించినట్లుగా చెపుతున్న వీటిని ఆదివారం భద్రాచలం తీసుకొచ్చారు. టేబుళ్ల కోసం సుమారు రూ.2 లక్షలు, హుండీలకు రూ.1.50 లక్షలు వెచ్చించినట్లు తెలిసింది.
ఈ టేబుళ్లను కొత్తగా నిర్మించిన అన్నదాన సత్రంలో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం భద్రాద్రి రామాయంలో ఉన్న హుండీలను పర్ణశాలకు పంపించి, కొత్తగా తెచ్చిన వాటిని ఇక్కడ ఏర్పాటు చేయాలని ఆలయాధికారులు భావిస్తున్నారు. అయితే ఇప్పటికే సరిపడా హుండీలు ఉన్నప్పటికీ.. మళ్లీ కొత్తగా కొనుగోలు చేయటం విమర్శలకు తావిస్తోంది. కాగా, ప్రస్తుతం అన్ని దేవాలయాల్లోనూ స్టీల్ హుండీలను మాత్రమే ఏర్పాటు చేస్తున్నారు. డబ్బులు, ఇతర కానుకలు తుప్పు పట్టకుండా ఉండేందుకు వీటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే భద్రాద్రి దేవస్థానం అధికారులు కొత్తగా కొనుగోలు చేసినవి ఇనుపవి కావటం గమనార్హం. అందులోనూ గేజ్ తక్కువగా ఉన్న ఇనుముతో చేసినవి కావడంతో ఇవి కొంతకాలం మాత్రమే ఉపయోగపడతాయని పలువురు అంటున్నారు.
నిబంధనలు పట్టవా..?
దేవాదాయశాఖ నిబంధనల ప్రకారం రూ.50 వేలకు పైగా విలువైన వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా టెండర్‌లను పిలవాలి. కానీ ఇక్కడి అధికారులు కొటేషన్ ద్వారా ఈ పనులు అప్పగించినట్లు తెలిసింది. కమీషన్‌ల కోసమే వారు ఇలా వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి.
గతంలో అన్నదాన సత్రంలో భోజనాలు వడ్డించే ట్రేలను తయారుచేసిన దుకాణదారుల నుంచే వీటిని కూడా కొనుగోలు చేసినట్లు తెలిసింది. భోజనం వడ్డించేందుకు చంధ్రశేఖర్ ఆజాద్ ఈవోగా ఉన్న సమయంలో రెండు ట్రేలను కొనుగోలు చేయగా, అవి నాసిరకంగా ఉండటంతో బిల్లు చెల్లించేందుకు ఆయన నిరాకరించారు. అవి కొంతకాలానికే నిరుపయోగంగా మారాయి. వాటిని అన్నదాన సత్రంలోని ఓ మూలన పడేయగా, ప్రస్తుతం తప్పుపట్టాయి. అయితే వీటికి కూడా బిల్లు చేసి ఆ మొత్తాన్ని కాజేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దేవస్థానానికి పాలకమండలి కూడా లేకపోవటంతో అడిగే వారు లేక అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆలయంలో జరుగుతున్న ఈ పరిణామాలపై దేవాదాయశాఖ ఉన్నతాధికారులు ఇప్పటికైనా దృష్టి సారించాలని భ క్తులు కోరుతున్నారు.
కొటేషన్‌లతోనే కొనుగోళ్లు : రవీందర్, దేవస్థానం ఏఈ
కొటేషన్‌ల ద్వారానే హుండీలు, భోజనం చేసేందుకు టేబుళ్లు కొనుగోలు చేశామని ఆలయ ఏఈ రవీందర్ తెలిపారు. నిబంధనల మేరకే అన్నీ జరిగాయన్నారు.
రామా.. కనవేమిరా..!
Published Mon, Sep 30 2013 3:56 AM | Last Updated on Fri, Sep 1 2017 11:10 PM
Advertisement