భద్రాచలాన్ని ఖమ్మం జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ఆదివారం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: భద్రాచలాన్ని ఖమ్మం జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ఆదివారం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. జేఏసీ నేత పోటు సూర్యం ఏలూరికి పూల మాల వేసి దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. తెలంగాణలో అంతర్భాగంగా ఉన్న భద్రాచలంను విడదీయాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి జీవోఎంకు ప్రతిపాదనలు పంపడం దారుణమన్నారు. సీఎం వైఖరికి నిరసనగా జిల్లా వ్యాప్తంగా రిలే దీక్షలు కొనసాగుతున్నాయని, అయినా ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం, సీమాంధ్రుల వైఖరిని నిరసిస్తూ ఆమరణ దీక్ష చేపట్టానని, భద్రాచలంను ఖమ్మం జిల్లాలో కొనసాగిస్తామని ప్రకటించే వరకూ దీక్ష కొనసాగుతుందని ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భద్రాద్రిని వ దులుకోబోమన్నారు. భద్రాచలం డివిజన్‌ను ఖమ్మం జిల్లాలోనే ఉంచాలని కోరుతూ ఆ ప్రాంతానికి చెందిన 157 పంచాయతీలు ఏకగ్రీవ తీర్మానం చేసి ప్రభుత్వానికి, జీవోఎంకు పంపినా స్పందించలేదన్నారు. ఎలాంటి షరతులు లేని, భద్రాచలం, హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. సీమాంధ్రులకు భద్రాచలంపై ప్రేమలేదని, పోలవరం నిర్మాణంతో గిరిజనులను ముంచి సంస్కృతి సంప్రదాయాలను ధ్వంసం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. గాంధేయ మార్గంలో తెలంగాణ సాధించుకున్నామని, అయితే ఇప్పుడు ఈ ప్రాంత వాసులను ప్రభుత్వం మోసగిస్తోందని అన్నారు. భద్రాచలం రాముడి శాపం కిరణ్‌కుమార్‌రెడ్డికి తగులుతుందన్నారు. ప్రజలంటే గౌరవం లేని ప్రభుత్వానికి ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
ఈ సందర్భంగా రిటైర్డ్ ఉద్యోగి పండరీనాథ్ గాంధీజీ వేషధారణతో అందరినీ ఆకట్టుకున్నారు. ఏలూరి ఆయనకు పూలమాల వేసి అభినందించారు. ఏలూరి దీక్షకు టీడీపీ, సీపీఐ, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, బీజేపీ, టీఆర్‌ఎస్ నేతలు, ఉద్యోగ సంఘాల నేతలు సంఘీభావం తెలిపారు. దీక్షా శిబిరానికి తెలంగాణా వాదులు, విద్యార్థులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున తరలి రావడంతో కలెక్టరేట్ ఎదుట కోలాహలంగా మారింది. ఈ సందర్భంగా అరుణోదయ డప్పు, కోలాట కళాకారులు ఆటపాటలతో అలరించారు. తొలుత తెలంగాణ కోసం మృతిచెందిన అమరులను స్మరిస్తూ రెండు నిముషాలు మౌనం పాటించారు. కాగా, దీక్షకు ముందు ఉదయం భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో, ఖమ్మంలోని శ్రీ స్తంభాద్రి నర్సింహస్వామి ఆలయంలో ఏలూరి ప్రత్యేక పూజలు చేశారు. కొత్తగూడెంలోని సీఎస్‌ఐ చర్చిలో ప్రార్థనలు చేశారు.