భానుడు @ 45
మచిలీపట్నం/తిరువూరు, న్యూస్‌లైన్ : భానుడు భగభగ మండుతున్నాడు. రోహిణీకార్తె మరో రెండురోజుల్లో ఉండగానే తన విశ్వరూపం చూపిస్తున్నాడు. భానుడి ప్రతాపానికి జిల్లా ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. గురువారం జిల్లా వ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తిరువూరులో 45, మచిలీపట్నంలో 44, నూజివీడులో 43, ఘంటసాలలో 42.8, నందిగామలో 42.08, జగ్గయ్యపేటలో 42, చల్లపల్లిలో 41, అవనిగడ్డలో 40.3 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు.
ఓ వైపు బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందని వాతావరణ శాఖాధికారులు హెచ్చరికలు జారీ చేశారు. జిల్లాలో మాత్రం వాయుగుండం వాతావరణానికి భిన్నంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గురువారం ఉదయం ఏడుగంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపాడు. 10 గంటలకే ప్రజలు పనులు చూసుకుని ఇళ్లకు చేరుకోవాల్సి వచ్చింది.
మధ్యాహ్నం వేళలో ప్రధాన రహదారులతో పాటు వీధులన్నీ నిర్మానుష్యంగా మారి కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించాయి. మరో కొద్దిరోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. తిరువూరులో ఉష్ణోగ్రత అధికమవుతుండటానికి కారణం 30 కిలోమీటర్ల దూరంలోని సత్తుపల్లి ప్రాంతంలో ఉన్న సింగరేణి బొగ్గు గనులేనని పలువురు భావిస్తున్నారు.
కరెంటు కోత.. ఉక్కపోత...
అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పులతో సతమతమవుతున్న ప్రజలను కరెంటు కోతలు వేధిస్తున్నాయి. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా విధిస్తున్న కోతలతో జనం అల్లాడిపోతున్నారు. ఇళ్లలో ఉండలేక, చెట్ల నీడను ఆశ్రయిస్తున్నారు. చిన్నారులు, వృద్ధుల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి.