
సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళా ఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది. గంటకు 11 కిలోమీటర్ల వేగంతో వాయవ్య దిశగా పయనిస్తోంది. గురువారం రాత్రికి మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 1250, చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 1080 కి.మీ. దూరంలోనూ కేంద్రీకృతమై ఉంది. అనంతరం ఇది శుక్రవారం నాటికి (పెథాయ్)తుపానుగా బలపడనుంది. తుపానుగా మారాక వాయవ్య దిశగా కోస్తాంధ్ర వైపు పయనిస్తుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) గురువారం రాత్రి విడుదల చేసిన ప్రత్యేక బులెటిన్‌లో వెల్లడించింది. శనివారం నాటికి మరింత బలపడి తీవ్ర తుపానుగా మారనుందని తెలిపింది. తుపానుగా బలపడ్డాక శుక్రవారం గంటకు 75 నుంచి 95 కిలోమీటర్లు, తీవ్ర తుపాను అయ్యాక శనివారం నుంచి 90 నుంచి 120 కిలోమీటర్ల వేగంతోనూ కోస్తాంధ్ర తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని వివరించింది.
సముద్రం తీవ్ర అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. తుపాను ప్రభావంతో శని, ఆదివారాల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవవచ్చని పేర్కొంది. ఈనెల 17న కోస్తాంధ్ర అంతటా కొన్నిచోట్ల భారీ వర్షాలకు ఆస్కారం ఉందని తెలిపింది. తుపాను నేపథ్యంలో విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, కాకినాడ, గంగవరం పోర్టుల్లో ఒకటో నంబరు ప్రమాద సూచికను ఎగురవేశారు.
హైదరాబాద్‌లో చిరుజల్లులు..
నగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆకాశం మేఘావృతమైంది. గురువారం చందానగర్, లింగంపల్లి, మాదాపూర్ సహా పలు చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. రాగల 24 గంటల్లో అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశముందని బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. కాగా గురువారం నగరంలో గరిష్టంగా 31.2 డిగ్రీలు, కనిష్టంగా 19.8 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆకాశం ఒక్కసారిగా మేఘావృతం కావడంతో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగినట్లు వాతావరణ శాఖ తెలిపింది. సాధారణంగా డిసెంబరు రెండోవారంలో నగరంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 12 నుంచి 14 డిగ్రీల మేర నమోదవుతాయి. కానీ కొన్నిరోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు పెరగడానికి అల్పపీడన ప్రభావంతో పాటు వాతావరణ మార్పులే కారణమని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈనెలాఖరు నాటికి నగరంలో చలితీవ్రత పెరగవచ్చని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment