![Bharat Ram Said ESI Hospital Would Be Transformed Into Multi Specialty Hospital - Sakshi](/styles/webp/s3/article_images/2019/11/24/05.jpg.webp?itok=_OIyg1pk)
ఈఎస్‌ఐ ఆస్పత్రిలో రోగితో మాట్లాడుతున్న ఎంపీ మార్గాని భరత్‌రామ్
సాక్షి, తాడితోట (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరంలోని ఈఎస్‌ఐ ఆసుపత్రిని 50 పడకల నుంచి వంద పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్ స్పష్టం చేశారు. శనివారం స్థానిక ఈఎస్‌ఐ ఆసుపత్రిని ఆయన పరిశీలించారు. అన్ని విభాగాల్లో శిథిలావస్థకు చేరిన గదులను చూశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి హర్షవర్థన్‌ను కలిసి ట్రామాకేర్ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని కోరామన్నారు. ఈఎస్‌ఐ ఆసుపత్రిని 50 పడకల నుంచి వంద పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకున్నామని ఆయన వివరించారన్నారు. త్వరలోనే పనులు ప్రారంభించి ఆరు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. పేపర్‌మిల్లు, ఓఎన్జీసీ, గెయిల్ వంటి సంస్థల నుంచి సీఎస్‌ఆర్ నిధులను సేకరించి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా చేస్తామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి నాడు– నేడు కార్యక్రమంలో భాగంగా ప్రస్తుత ఆసుపత్రి ఫొటోలు తీయించి అభివృద్ధి చేసిన తరువాత తిరిగి ఫొటోలు తీస్తామన్నారు.
కడవరకూ జగన్‌తోనే ఉంటాం...
వైఎస్సార్ సీపీ ఎంపీలు బీజేపీకి టచ్‌లో ఉన్నారంటూ ఎంపీ సుజనాచౌదరి చేసిన వ్యాఖ్యలపై ఎంపీ భరత్‌రామ్ స్పందించారు. సుజనాచౌదరి మైండ్ గేమ్ ఆడుతున్నారని, పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో కూర్చున్న ఎంపీలను చూసి వైఎస్సార్ సీపీ ఎంపీలు టచ్‌లో ఉన్నారనుకుంటున్నారని పేర్కొన్నారు. నిజమైన వైఎస్సార్ సీపీ ఎంపీలు కడవరకూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వెంటే ఉంటారన్నారు. 22 మంది ఎంపీలూ జగన్ నాయకత్వంలో పనిచేసి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఈఎస్‌ఐ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ తారక్‌ప్రసాద్, ఆర్‌ఎంవో డాక్టర్ రామకృష్ణ, సివిల్ సర్జన్లు కోటేశ్వరరావు, పద్మావతి, ప్రదీప్, రామారావు తదితరులు పాల్గొన్నారు.
సెగ్మెంట్‌కు మొబైల్ వాటర్ ట్యాంక్
రాజమహేంద్రవరం రూరల్: రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఒక మొబైల్ వాటర్‌ట్యాంకు ఉండే బాగుంటుందని దానిపై ఆలోచించాలని ఎంపీ మార్గాని భరత్‌రామ్ ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజినీర్లను ఆదేశించారు. శనివారం స్థానిక మార్గాని ఎస్టేట్స్‌లో ఆయన కార్యాలయంలో ఎంపీ ల్యాడ్స్‌పై పార్లమెంటు పరిధిలోని ఆర్‌డబ్ల్యూఎస్ డీఈలతో సమీక్షించారు. ఈ సందర్భంగా భరత్‌రామ్ మాట్లాడుతూ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక మొబైల్ వాటర్ ట్యాంకర్ ఉంటే ఆ నియోజకవర్గ పరిధిలోని ఏదైనా గ్రామంలో మంచినీటి సమస్య వస్తే నీరు అందించడానికి అవకాశం ఉంటుందన్నారు. మొబైల్ ట్యాంకులు సులువుగా చిన్న వీధులలో మలుపు తిరగడానికి అవకాశం ఉంటుందన్నారు.
వాటర్ హెడ్ ట్యాంకులు పైపులైను నిర్మాణాలు శాశ్వత నిర్మాణాలని, వాటికి కొంత సమయం పడుతుందని ఈలోపు వాటర్ ట్యాంకులు ఉపయోగకరంగా ఉంటాయన్నారు. గ్రామీణ నీటి సరఫరా శాఖ ఇంజినీర్లు ఈ విషయంపై ఏవిధంగా చేస్తే బాగుంటుందో చెప్పాలన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులపై ఎంపీ ఆరాతీయగా గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో గ్రామ సచివాలయాలను నిర్మిస్తామని డీఈలు తెలిపారు. ప్రస్తుతం వాటి నిర్మాణాలకు పరిపాలనా పరమైన ఆమోదాలు వచ్చాయన్నారు. సమావేశంలో పార్లమెంటు పరిధిలోని డీఈలు ఎస్.రవికుమార్, సీహెచ్ రమేష్, పి.శ్రీనివాస్, ఎంఎస్ స్వామి
పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment