- ప్రివిలైజ్ కమిటీకి పంపిస్తానన్న స్పీకర్
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఇచ్చిన సభా హక్కుల ఉల్లంఘన నోటీసుపై రాష్ట్ర శాసనసభ అట్టుడికింది. సోమవారం ప్రశ్నోత్తరాల సమయం ముగిశాక నాగిరెడ్డి తన నోటీసును స్పీకర్ కోడెల శివప్రసాదరావు దృష్టికి తెచ్చి చర్చించాలని కోరారు. స్పీకర్ స్పందిస్తూ నోటీసు అందిందని, ఇది వ్యక్తిగత సమస్య అయినందున సభలో చర్చించలేమన్నప్పుడు దుమారం రేగింది.
చర్చించాల్సిందేనని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. ఎమ్మెల్యే గా విధులు నిర్వహిస్తున్నప్పుడే పోలీసులు కేసు పెట్టి రౌడీషీటు తెరిచారని, ఇది సభా హక్కులకు భంగమని వాదించారు. ఎమ్మెల్యేలు రోజా, శ్రీకాంత్‌రెడ్డి తదితరులు స్పీకర్‌తో వాగ్వాదం చేశారు. దీంతో ఉదయం 10.32 గంటల ప్రాం తంలో స్పీకర్ సభను వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైనా వైఎస్సార్‌సీపీ సభ్యులు చర్చకు పట్టుబట్టారు. ఈ దశలో స్పీకర్... నిబంధనల ప్రకారం చర్చించలేమని చెప్పారు.
‘‘నిబంధన నిబంధనే. అందరికీ ఒకటే. మీ నోటీసును సభాహక్కుల కమిటీకి పంపిస్తా. ఆ కమిటీలో మీ వాళ్లూ (వైఎస్సార్‌సీపీ) ఉంటారు కదా. ఆ కమిటీ ఏమి నిర్ణయిస్తుందో చూద్దాం. ఇంతటితో వదిలేయండి. భూమాకి అలా జరగడంపై నేనూ బాధపడుతున్నా. ఆ కుటుంబంతో నాకు సన్నిహిత సం బంధాలున్నాయి. అయినా రూల్ రూలే కదా..’’ అని చెప్పడంతో సభ్యులు శాంతించారు.