Kodela Shiva Rama Krishna
-
కోడెల తనయుడి అక్రమాలకు అడ్డేలేదు
గుంటూరు: స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనయుడు శివరామకృష్ణ అక్రమాలకు అడ్డూ, అదుపూ లేకుండా పోయిందని టీడీపీకి చెందిన తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి పులిమి వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం పేరుతో అక్రమ కేసులు బనాయించి తమను వేధిస్తున్నారని గుంటూరు రూరల్ ఎస్పీ వెంకటప్పలనాయుడికి సోమవారం ఆయన ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రత్యేక అధికారితో విచారణ జరిపించాలని కోరారు. అనంతరం వెంకటరామిరెడ్డి పాలపాడు గ్రామస్తులతో కలసి మీడియాతో మాట్లాడారు. పోలీస్, రెవెన్యూ అధికారులను కోడెల శివరామకృష్ణ తన చెప్పుచేతల్లో పెట్టుకొని.. ఇష్టానుసారంగా అవినీతికి పాల్పడుతున్నారని చెప్పారు. దీనిపై మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో పాటు ఎంపీ రాయపాటి సాంబశివరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులకు ఫిర్యాదు చేయగా.. వారు స్పందించలేదన్నారు. పార్టీ ప్రతిష్టను కాపాడుకునేందుకు ఈ నెల 15న తన నివాసంలో ఆమరణ దీక్షకు దిగగా.. వెయ్యి మంది టీడీపీ కార్యకర్తలు సంఘీభావం తెలిపారని చెప్పారు. దీన్ని సహించలేని శివరామకృష్ణ పోలీసులతో దీక్షను భగ్నం చేయించారని ధ్వజమెత్తారు. అదే సమయంలో శివరామకృష్ణ వర్గానికి చెందిన వ్యక్తులు పోలీస్ వాహనాన్ని ధ్వంసం చేశారని ఆరోపించారు. కానీ ఈ ఘటననూ తమకు అంటగడుతూ 29 మందిపై అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు. అదేమని ప్రశ్నిస్తే రౌడీషీట్ తెరుస్తామంటూ పోలీసులు బెదిరిస్తున్నారని వాపోయారు. చివరకు విద్యార్థులపైనా కేసు నమోదు చేయడం దారుణమన్నారు. దీనిపై ప్రత్యేక అధికారితో దర్యాప్తు చేయించాలని ఎస్పీని కోరామన్నారు. -
స్పీకర్ కోడెల కుమారుడికి నోటీసులు
సాక్షి, హైదరాబాద్: గుంటూరు జిల్లా, సత్తెనపల్లి మండలం, ధూళిపాళ్ల గ్రామంలోని సర్వే నంబర్ 167, 168ల్లో తనకున్న 11.60 ఎకరాల భూమిని స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరామకృష్ణ ఆక్రమించుకోవడంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ రైతు గొడుగుల సుబ్బారావు దాఖలు చేసిన వ్యాజ్యంపై ఉమ్మడి హైకోర్టు స్పందించింది. సుబ్బారావు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు, ఈ మొత్తం వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, గుంటూరు రేంజ్ ఐజీ, జిల్లా రూరల్ ఎస్పీ, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్ జనరల్, ఆర్డీవో, తహసీల్దార్లకు నోటీసులు జారీ చేశారు. అలాగే వ్యక్తిగత ప్రతివాదులుగా ఉన్న డీఎస్పీ ఎం.మధుసూదన్‌రావు, సీఐ కోటేశ్వరరావు, ఎస్ఐ వెంకటరావు, కోడెల శివరామకృష్ణ, అతని పీఏ గుత్తా నాగప్రసాద్‌లకు కూడా నోటీసులిచ్చింది. -
భూమా నోటీసుపై రభస
ప్రివిలైజ్ కమిటీకి పంపిస్తానన్న స్పీకర్ సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఇచ్చిన సభా హక్కుల ఉల్లంఘన నోటీసుపై రాష్ట్ర శాసనసభ అట్టుడికింది. సోమవారం ప్రశ్నోత్తరాల సమయం ముగిశాక నాగిరెడ్డి తన నోటీసును స్పీకర్ కోడెల శివప్రసాదరావు దృష్టికి తెచ్చి చర్చించాలని కోరారు. స్పీకర్ స్పందిస్తూ నోటీసు అందిందని, ఇది వ్యక్తిగత సమస్య అయినందున సభలో చర్చించలేమన్నప్పుడు దుమారం రేగింది. చర్చించాల్సిందేనని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. ఎమ్మెల్యే గా విధులు నిర్వహిస్తున్నప్పుడే పోలీసులు కేసు పెట్టి రౌడీషీటు తెరిచారని, ఇది సభా హక్కులకు భంగమని వాదించారు. ఎమ్మెల్యేలు రోజా, శ్రీకాంత్‌రెడ్డి తదితరులు స్పీకర్‌తో వాగ్వాదం చేశారు. దీంతో ఉదయం 10.32 గంటల ప్రాం తంలో స్పీకర్ సభను వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైనా వైఎస్సార్సీపీ సభ్యులు చర్చకు పట్టుబట్టారు. ఈ దశలో స్పీకర్... నిబంధనల ప్రకారం చర్చించలేమని చెప్పారు. ‘‘నిబంధన నిబంధనే. అందరికీ ఒకటే. మీ నోటీసును సభాహక్కుల కమిటీకి పంపిస్తా. ఆ కమిటీలో మీ వాళ్లూ (వైఎస్సార్సీపీ) ఉంటారు కదా. ఆ కమిటీ ఏమి నిర్ణయిస్తుందో చూద్దాం. ఇంతటితో వదిలేయండి. భూమాకి అలా జరగడంపై నేనూ బాధపడుతున్నా. ఆ కుటుంబంతో నాకు సన్నిహిత సం బంధాలున్నాయి. అయినా రూల్ రూలే కదా..’’ అని చెప్పడంతో సభ్యులు శాంతించారు. -
కోడెల కుమారుడిపై కిడ్నాప్ కేసు
దౌర్జన్యం చేసి తన బిడ్డను ఎత్తుకెళ్లారని భార్య ఫిర్యాదు సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరామకృష్ణపై విశాఖపట్నంలోని మూడోపట్టణ పోలీసులు కిడ్నాప్కేసు నమోదు చేశారు. బుధవారం అర్ధరాత్రి పదిమంది అనుచరులతో కలిసి తన భర్త శివరామకృష్ణ తన ఇంటిపై దాడిచేసి, భయభ్రాంతులకు గురిచేసి నాలుగేళ్ల బిడ్డ గౌతమ్‌ను తీసుకెళ్లి పోయినట్లు భార్య పద్మప్రియ పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో శివరామకృష్ణపై గురువారం కిడ్నాప్ కేసు నమోదు చేసినట్లు తూర్పు జోన్ ఏసీపీ మహేష్ మీడియాకు తెలిపారు.