
భూమా పిటిషన్‌పై స్పందించిన హైకోర్టు
ప్రతివాదులకు నోటీసులు.. కౌంటర్ల దాఖలుకు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: నంద్యాల పట్టణంలో రోజు రోజుకు ఊర పందుల సంఖ్య పెరిగిపోతోందని, వీటిని ఆరికట్టేందుకు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదంటూ స్థానిక శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందింది. ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరిస్తూ ప్రతివాదులుగా ఉన్న నంద్యాల మునిసిపల్ కమిషనర్, జిల్లా కలెక్టర్, ఎస్‌పీ తదితరులకు నోటీసులు జారీ చేసింది.
పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. పట్టణంలో పందుల సంఖ్య పెరిగిపోతోందని, దీని వల్ల స్వైన్‌ఫ్లూ, డెంగ్యూ తదితర ప్రమాదకర వ్యాధులు ప్రబలుతున్నప్పటికీ అధికారులు ఏ మాత్రం స్పందించడం లేదంటూ భూమా నాగిరెడ్డి గతవారం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యాన్ని సోమవారం ప్రధాన న్యాయమూర్తి నేతత్వంలోని ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరఫున పి.నాగేందర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, పట్టణం చుట్టపక్కల దాదాపు 8వేల పందులు రోడ్లపై ఇష్టారాజ్యంగా తిరుగుతూ ట్రాఫక్ తీవ్ర ఇబ్బందులు సష్టిస్తున్నాయని తెలిపారు. వీటి వల్ల ముఖ్యంగా వానా కాలంలో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని వివరించారు. పందులను చంపేందుక బుల్లెట్లు కొనుగోలు చేసేందుకు జిల్లా కలెక్టర్‌ను పురపాలక కమిషనర్ అనుమతి కోగా, కలెక్టర్ అనుమతి నిరాకరించారని, దీంతో జిల్లా ఎస్‌పీ కూడా అనుమతిని ఇవ్వలేదని తెలిపారు.
దీని వల్ల పందుల సంఖ్య పెరిగిపోతోందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం, పందులను చంపడానికి బదులు వాటిని జనావాసాలకు దూరంగా ఉంచడం మేలని అభిప్రాయపడింది. పందుల వల్ల వ్యాధులు వస్తున్న మాట నిజమేనని, అయితే పర్యావరణ సమతుల్యతను కాపాడంలో పందుల పాత్ర కూడా ఉందని, అందువల్ల వాటిని జనావాసాలకు దూరంగా ఉంచాలని వ్యాఖ్యానిస్తూ విచారణను వాయిదా వేసింది.