రాష్ట్ర విభజన ద్రోహులు సీఎం కిరణ్, చంద్రబాబేనని వైఎస్సార్ కాంగ్రెస్ నేత, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి విమర్శించారు.
తిరుపతి: రాష్ట్ర విభజన ద్రోహులు సీఎం కిరణ్, చంద్రబాబేనని వైఎస్సార్ కాంగ్రెస్ నేత, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ డైరెక్షన్‌లోనే చంద్రబాబు నడుచుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు పోరాడుతున్న ఏకైక వ్యక్తి వైఎస్ జగన్ అని చెప్పారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తిరుపతిలో మూటలు మోసి భూమన కరుణాకరరెడ్డి నిరసన తెలిపారు.
సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న భూమన కరుణాకరరెడ్డి వినూత్న కార్యక్రమాలతో నిరసనలు తెలుపుతున్నారు. బూట్ పాలిష్ చేయడం, బుట్టలు అల్లడం, రిక్షా తొక్కడం, పశువులను కాపలా కాయడం, లాగేజీ మోయడం వంటి పనులు చేసి ఆయన అందరి దృష్టిని ఆకర్షించారు. సమైక్య ఉద్యమాలకు మద్దతు తెలుపుతూ బైకుపై ర్యాలీ కూడా చేశారాయన. తన నియోజకవర్గంలో ఎక్కడ సమైక్య ఆందోళనల్లోనూ ఆయన పాల్గొంటున్నారు.