చంద్రబాబు పాలన అంటే రాక్షసపాలనను ఆహ్వానించడమే
సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తిరిగి అధికారంలోకి రావాలని కోరుకోవడమంటే రాక్షస పాలనను ఆశించడమేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి వ్యాఖ్యానించారు. వేతనాలు పెంచాలని కోరిన అంగన్‌వాడీ మహిళలను కనికరం లేకుండా గుర్రాలతో తొక్కించిన, అలాగే కరెంటు చార్జీలు తగ్గించాలని పోరాడిన వారిని కాల్చిచంపిన ఘన చరిత్ర చంద్రబాబుకే దక్కుతుందన్నారు. 50 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులను రోడ్డున పడేసిన, అనేక ప్రభుత్వరంగ సంస్థలను మూసేసిన చరిత్ర కూడా బాబుదేనన్నారు.
సహచర ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ధర్మాన కృష్ణదాస్, మేకపాటి చంద్రశేఖరరెడ్డిలతో కలసి భూమన శనివారం అసెంబ్లీ మీడియాపాయింట్లో మాట్లాడారు. ‘‘చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావాలని ఆయన భజనపరులు చేస్తున్న ప్రచారం వింతగా ఉంది. బెల్టుషాపులు విచ్చలవిడిగా పెంచడం, వ్యవసాయాన్ని దండగ అనడం, ప్రభుత్వరంగ సంస్థల్ని మూసివేయడం, అవినీతికి చిరునామాగా రాష్ట్రాన్ని మార్చడం చేసినందుకా ఆయన పాలనను తిరిగి కోరుకుంటున్నది? నరకాసురుడు, దుర్యోధనుడు, హిరణ్యాక్షుడు తరహా రాక్షస పాలన చంద్రబాబుది. ఆయన పాలనను తిరిగి కోరుకోవడమంటే అఘోరాలు.. శ్మశానంలో ఉండి దయ్యాలను ఆహ్వానించినట్లే’’ అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు పాలన వద్దేవద్దని ప్రజలు కంకణం కట్టుకున్నారని భూమన చెప్పారు. ‘‘1980వ దశకంలో ఇళ్లముందు ‘ఓ స్త్రీ రేపురా’ అని రాసి ఉండేది. ఇప్పుడు ‘ఓ చంద్రబాబూ నువ్వు మళ్లీ అధికారంలోకి రాకు’ అని ప్రజలు రాసుకుంటున్నారు’’ అని ఎద్దేవా చేశారు.