ఓటర్లకు ‘సైకిల్‌’ తాయిలాలు | Bicycle For Voters In Nellure | Sakshi
Sakshi News home page

ఓటర్లకు ‘‘సైకిల్‌’ తాయిలాలు

Published Wed, Mar 13 2019 7:49 AM | Last Updated on Sat, Mar 23 2019 8:59 PM

Bicycle For Voters In Nellure - Sakshi

సైకిల్‌ తరలింపును అడ్డుకుంటున్న స్థానికులు, వైఎస్సార్‌సీపీ నేతలు 

ఐదేళ్లుగా ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిన తెలుగుదేశం పార్టీ అధికార అంతమున ఎన్నికల వేళ అన్ని వర్గాలకు తాయిలాల వల విసురుతోంది. పథకాల పేరుతో ప్రలోభాలకు తెరలేపింది. పేదలకు అందరికీ ఇళ్లు, రైతులకు అన్నదాత సుఖీభవ, అక్కచెల్లెమ్మలకు పసుపు, కుంకుమ అంటూ తాయిలాల ఎర వేసిన ప్రభుత్వం, విద్యా సంవత్సరం ఆఖరి నెలలో ఎన్నికల కోడ్‌ వచ్చాక విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీకి బరితెగించి అడ్డంగా దొరికిపోయింది. 


 

సాక్షి, నెల్లూరు (టౌన్‌): బాలికా విద్యను ప్రోత్సహించేందుకు  8, 9 తరగతులు చదివే బాలికలకు సైకిళ్లు పంపిణీ చేస్తామని గత ఎన్నికల మేనిఫెస్టోలో తెలుగుదేశం ప్రకటించింది. అధికారంలోకి వచ్చాక ఒక్కసారి మాత్రమే అరకొరగా సైకిళ్లు పంపిణీ చేసిన ప్రభుత్వం నాలుగేళ్లుగా విస్మరించింది. ఈ దశలో అందరికి అన్నీ చేశామని చెప్పుకునేందుకు ఎన్నికల కోడ్‌ను బేఖాతరు చేస్తూ తెలుగుదేశం పార్టీ ప్రలోభాలకు తెరలేపింది. ఎన్నికలల్లో లబ్ధి పొందేందుకు విద్యార్థులను సైతం వదలడం లేదు. ఓటర్లను మభ్యపెట్టేందుకు ఆ పార్టీ నేతల అడ్డదారులు తొక్కుతున్నారు. ఇప్పటికే అమలకు నోచుకోని ఎన్నో పథకాలను లబ్ధిదారులకు అందజేశామని ఆ పార్టీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. తాజాగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థినులకు ఇచ్చే సైకిళ్లతో వారి తల్లిదండ్రులను తమ బుట్టలో వేసుకుందామని తెర వెనుక చక్రం తిప్పిన మంత్రి నారాయణ, ఆ పార్టీ నేతలు అడ్డంగా బుక్కయ్యారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నా అవేమి లెక్క చేయని టీడీపీ నాయకులు మంగళవారం 3 ట్రక్కుల సైకిళ్లను విద్యార్థినులకు పంపిణీ చేసేందుకు సంబంధిత కాంట్రాక్టర్‌ను ఉసిగొల్పారు. ఈ నేపథ్యంలో వాటిని తీసుకెళ్తుతుండగా ఓ ట్రక్కును మూలాపేటలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల వద్ద వైఎస్సార్‌సీపీ నాయకులు అడ్డుకున్నారు. సైకిళ్లు పంపిణీపై చిన్నబజారు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  


20,419 సైకిళ్ల పంపిణీకి రంగం సిద్ధం
ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 8, 9 తరగతులు చదువుతున్న విద్యార్థినులకు సైకిళ్లు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో 20,419 మంది విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేయాల్సి ఉంది. వాటిని విద్యా సంవత్సర ప్రారంభంలో పంపిణీ చేయాల్సి ఉంది. హీరో సైకిళ్లు పంపిణీ బాధ్యతను హర్యానాకు చెందిన ఓ కాం ట్రాక్టర్‌కు అప్పజెప్పింది. మార్చిలో ఎన్నికలు జరుగుతాయని భావించిన రాష్ట్ర ప్రభుత్వం సైకిళ్ల పంపిణీకి తెరలేపింది. సైకిళ్లను ఫిబ్రవరి చివరి వారంలో జిల్లాకు పంపించింది. ఇప్పటి వరకు కేవలం 3 పాఠశాలల్లో 331 మంది విద్యార్థినులకు మాత్రమే అందజేశారు. 


60 సైకిళ్లను సీజ్‌ చేసిన పోలీసులు
సైకిళ్లు పంపిణీ ఎన్నికల్లో కలిసి వస్తుందని భావించిన టీడీపీ నేతలు వెంటనే అమలుకు శ్రీకారం చుట్టారు. సదరు కాంట్రాక్టరుపై ఒత్తిడి తీసుకువచ్చి సైకిళ్లు పంపిణీ చేసేలా ఒప్పించారు. నవాబుపేట ప్రాంతంలోని బీవీఎస్‌ మున్సిపల్‌ పాఠశాలల్లో ఉన్న విడి పరికరాలను రాత్రికి రాత్రి హడావుడిగా బిగించి 3 ట్రక్కుల్లో ఇతర పాఠశాలలకు తీసుకెళ్లి విద్యార్థినులకు పంపిణీ చేసేలా నిర్ణయం తీసుకున్నారు. అయితే స్థానిక మూలాపేట వద్ద ఉన్న ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల వద్ద ట్రక్కును వైఎస్సార్‌సీపీ నేతలు అడ్డుకున్నారు. ఆ ట్రక్కులో 60 సైకిళ్లు ఉన్నాయి. ఈ విషయంపై వెంటనే పోలీసులకు సమాచారం అందించి వారికి ట్రక్కును అప్పగించారు. అయితే మరో 2 ట్రక్కుల సమాచారం ఇప్పటికి తెలియలేదు. ట్రక్కును తీసుకు వచ్చిన కాంట్రాక్టర్‌పై చిన్నబజారు పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైనట్లు తెలిసింది. 


తెర వెనుక మంత్రి నారాయణ, నేతల హస్తం 
ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీని నిలిపివేయాలని సదరు కాంట్రాక్టర్‌కు ఆదేశాలు ఇచ్చినట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. సైకిళ్లు విడి పరికరాల కోసం నగరంలో 3 పాఠశాలల్లో 6 గదులను వారికి అప్పగించారు. పంపిణీ నిలిపివేయాలని ఆదేశాలు ఉన్నా.. సదరు కాంట్రాక్టర్‌ ట్రక్కుల్లో సైకిళ్లను తరలించడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేయడంలో మంత్రి నారాయణ, టీడీపీ నేతల ఒత్తిడి ఉందన్న ప్రచారం జరుగుతోంది. సైకిళ్లపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీని వాసరావు ఫొటోలు ఉన్నాయి. సైకిళ్లను పంపిణీ చేసినట్లయితే ఎన్నికల్లో తమకు కలిసి వస్తుందని టీడీపీ నేతలు భావించారు. ఈ నేపథ్యంలో సైకిళ్లను ఆయా పాఠశాలలకు పంపిణీ చేసే బాధ్యతను సదరు కాంట్రాక్టర్‌కు అప్పగించి చేతులు దులుపుకున్నారు. అయితే సైకిళ్లతో కూడిన ట్రక్కును పట్టుకోవడంతో టీడీపీ నేతల నోటిలో వెలక్కాయ పడిన చందంగా మారింది. 

కాంట్రాక్టర్‌పై ఫిర్యాదు చేశాం 
సైకిళ్లు తరలిస్తున్న కాంట్రాక్టర్‌పై చిన్న బజారు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాం. ట్రక్కులో ఉన్న సైకిళ్లను పోలీసు స్టేషన్‌లో అప్పగించాము. వీటిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటాం.
 – అలీంబాషా, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement