సాక్షి, ఉదయగిరి (నెల్లూరు): రాష్ట్రంలోనే నెల్లూరు జిల్లాకు రాజకీయంగా ప్రత్యేక స్థానం ఉంది. వారసత్వ రాజకీయాలకు పెట్టిందిపేరుగా ఈ జిల్లా గుర్తింపు పొందింది. జిల్లాలో పలు కుటుంబాలు వారసత్వ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తూనే ఉన్నాయి. బెజవాడ రామచంద్రారెడ్డి, నల్లపరెడ్డి, మాగుంట, ఆనం, మేకపాటి తదితర కుటుంబాల్లో వారసత్వ రాజకీయాలు సాగుతూనే ఉన్నాయి. సర్పంచ్ స్థాయి నుంచి రాష్ట్ర, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి, తదితర కీలకపదవులు చేపట్టిన వారు ఉన్నారు. జిల్లాలో వారసత్వ రాజకీయాలపై ప్రత్యేక కథనం.
ఐదు దఫాలు ఎంపీగా..
మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి
జిల్లాలో ఏళ్ల తరబడి రాజకీయాల్లో తమ హవా కొనసాగిస్తున్న పలు కుటుంబాల్లో మేకపాటి కుటుంబం ఒకటి.
జిల్లాలోని కడప సరిహద్దు ప్రాంతంలోని వెలుగొండ అడవుల్లో మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లికి చెందిన మేకపాటి కుటుంబం వారసత్వ రాజకీయాల్లో ప్రత్యేక స్థానం సంతరించుకుంది. ఈ కుటుంబంలో మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఐదు దఫాలుగా ఎంపీగా ఎన్నికయ్యారు. ఈయన 1983లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆయన 1985లో ఉదయగిరి అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1989లో ఒంగోలు ఎంపీగా గెలుపొందారు. 1998లో నరసారావుపేట నుంచి ఎంపీగా విజయం సాధించారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంట్ నుంచి పోటీచేసి విజయం సాధించారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా నెల్లూరు ఎంపీ స్థానం నుంచి రికార్డు మెజారిటీతో విజయఢంకా మోగించారు. ఆయన సోదరుడు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి 1999లో ఉదయగిరి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమి చెందారు. 2004, 2009 ఎన్నికల్లో ఉదయగిరి నుంచే విజయం సాధించారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో జిల్లాలోనే అత్యంత మెజారిటీతో గెలుపొందిన రికార్డు నమోదుచేసుకున్నారు. అదే కుటుంబం నుంచి మేకపాటి రాజమోహన్‌రెడ్డి కుమారుడు మేకపాటి గౌతమ్‌రెడ్డి 2014 ఎన్నికల్లో ఆత్మకూరు వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. ప్రస్తుతం ఈ కుటుంబానికి చెందిన మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఉదయగిరి నుంచి, గౌతమ్‌రెడ్డి ఆత్మకూరు నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులుగా బరిలో ఉన్నారు.
నల్లపరెడ్ల హవా
నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి
జిల్లా రాజకీయాల్లో నల్లపరెడ్డిలకు ప్రత్యేక స్థానం ఉంది. 1952, 1955లో వల్లేటి గోపాలకృష్ణారెడ్డి గూడూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన పెద్ద మేనల్లుడు నల్లపరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి జెడ్పీ చైర్మన్‌గా, వెంకటగిరి ఎమ్మెల్యేగా, రాష్ట్ర పంచాయతీరాజ్ చాంబర్ చైర్మన్‌గా పనిచేశారు. ఆయన సోదరుడు నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి రాజకీయాల్లో ఓటమెరుగని నేతగా పేరు సంపాదించుకున్నారు. ఆయన కోట సమితి అధ్యక్షునిగా, కోవూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. టి.అంజయ్య, మర్రి చెన్నారెడ్డి, ఎన్‌టీ రామారావు కేబినెట్‌లో మంత్రి పదవులు చేపట్టారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆ పార్టీలో బలమైన నాయకుడిగా పేరు సంపాదించుకున్నారు. అలాగే ఆయన సోదరులైన నల్లపరెడ్డి గోపాల్, సుబ్బారెడ్డి కోట సమితి రాజకీయాల్లో క్రియాశీలకపాత్ర పోషించారు. నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి కుమారుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి కోవూరు ఎమ్మెల్యేగా పనిచేశారు. 2014లో వైఎస్సార్‌సీపీ తరపున అదే స్థానంనుంచి పోటీచేసి పరాజయం పొందారు. 2019 ఎన్నికల్లో కోవూరు బరిలోనే వైఎస్సార్‌సీపీ తరపున పోటీ చేస్తున్నారు. ఆయన సోదరులు హరనాథరెడ్డి, సురేష్‌రెడ్డి కూడా రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు.
సీఎం స్థాయికి ఎదిగిన నేదురుమల్లి
జనార్దన్‌రెడ్డి, రాజ్యలక్ష్మి, రామ్‌కుమార్‌రెడ్డి
వాకాడుకు చెందిన నేదరుమల్లి జనార్దన్‌రెడ్డి 1965లో రాజకీయాల్లోకొచ్చారు. 1970లో ఎమ్మెల్సీగా పోటీచేసి వైసి.రంగారెడ్డి చేతిలో ఓడిపోయారు. 1972లో రాజ్యసభ సభ్యునిగా ఎంపికయ్యారు. 1970,1984లో ఎమ్మెల్సీగా పనిచేశారు. అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, భవనం వెంకటరమణారెడ్డి కేబినెట్‌లో మంత్రి పదవులు చేపట్టారు. 1983లో వెంకటగిరి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 1990లో విశాలాంధ్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఆయన బాపట్ల, నరసరావుపేట, విశాఖపట్టణం ఎంపీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన సతీమణి నేదురుమల్లి రాజ్యలక్ష్మి వెంకటగిరి ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ఆయన కుమారుడు నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డి 2014లో బీజేపీలో చేరి ఆ పార్టీలో ఇమడలేక ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ తరఫున క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు. ప్రస్తుతం వెంకటగిరి నుంచి వైఎస్సార్‌సీపీ బరిలో ఉన్న రామనారాయణరెడ్డి విజయానికి పావులు కదుపుతున్నారు. నేదురుమల్లి కుటుంబం ప్రభావం నేటికీ గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాలపై ఉంది.
క్రియాశీలకం.. మాగుంట
శ్రీనివాసులురెడ్డి, సుబ్బరామిరెడ్డి, పార్వతమ్మ
జిల్లా రాజకీయాల్లో మాగుంట సుబ్బరామిరెడ్డి చురుకైన నేతగా పేరు సంపాదించుకున్నారు. స్వల్పకాలంలోనే నెల్లూరు నుంచి కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ నేతగా గుర్తింపుపొందారు. తిరుపతిలో జరిగిన కాంగ్రెస్ ప్లీనరీ సమావేశం విజయవంతం కావడంతో మాగుంట సుబ్బరామిరెడ్డి క్రియాశీలకంగా వ్యవహరించడంతో ఇందిరాగాంధీ కుటుంబానికి సన్నిహితుడుగా మారారు. 1991లో ఒంగోలు ఎంపీగా గెలుపొందారు. రాజకీయాల్లో పైస్థాయికి ఎదుగుతున్న తరుణంలో 1995 డిసెంబరు ఒకటో తేదీన ఒంగోల్లో నక్సలైట్ల కాల్పులకు బలయ్యారు. ఆ తర్వాత ఆయన సతీమణి మాగుంట పార్వతమ్మ 1996లో ఒంగోలు నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. ఆ తర్వాత మాగుంట సుబ్బరామిరెడ్డి సోదరుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి 2004, 2009 ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో ఒంగోలు ఎంపీ బరిలో టీడీపీ తరపున పోటీచేసి ఓటమిపాలయ్యారు. 2019 ఎన్నికల్లో ఒంగోలు ఎంపీ స్థానా నికి వైఎస్సార్‌సీపీ తరపున పోటీలో ఉన్నారు.
ఆనం కుటుంబానికి ప్రత్యేక స్థానం
వెంకటరెడ్డి, రామనారాయణరెడ్డి, చెంచుసుబ్బారెడ్డి, వివేకానందరెడ్డి
జిల్లా రాజకీయ చరిత్రలో ఆనం కుటుంబానికి సుమారు 80 ఏళ్ల చరిత్ర ఉంది. దివంగత నేత ఆనం చెంచు సుబ్బారెడ్డి (ఏ.సి.సుబ్బారెడ్డి)తో రాజకీయ జీవితం ప్రారంభమై రామనారాయణరెడ్డి, వివేకానందరెడ్డి పిల్లల వరకు కొనసాగుతోంది. బ్రిటిష్ పాలనలో పోలీసు అధికారిగా పని చేసిన ఆనం సుబ్బారెడ్డి కుమారుడు ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి రాజకీయాల్లో ప్రముఖ పాత్రవహించారు. వీరిలో ఏసి.సుబ్బారెడ్డి సహకార సంస్థల నుంచి నెల్లూరు మున్సిపల్ చైర్మన్‌గా పోటీకి దిగి మొదట పరాజయం పొందినా 1937లో చైర్మన్‌గిరి దక్కించుకుని 1952 వరకు కొనసాగారు. 1952లో నెల్లూరు నుంచి అసెంబ్లీకి పోటీచేసి ఓటమిచెందారు. 1955 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ నేపథ్యంలో కొంతకాలం టీటీడీ చైర్మన్‌గా కూడా పనిచేశారు. ఇరిగేషన్, ఆర్థికశాఖ మంత్రిగా పనిచేశారు.
1967లో ఏసి.సుబ్బారెడ్డి మరణించడంతో ఆయన వారసుడిగా ఆనం వెంకటరెడ్డి రాజకీయ ప్రవేశం చేసి డీసీసీబీ అధ్యక్షునిగా పనిచేశారు. 1972లో నెల్లూరు ఎమ్మెల్యేగా ఎన్నికై నీటిపారుదలశాఖ మంత్రిగా పనిచేశారు.1978లో నెల్లూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓటమిచెంది 1983లో టీడీపీ తరపున ఆత్మకూరు నుంచి పోటీచేసి విజయం సాధించారు. ఈ విధంగా జిల్లా రాజకీయాల్లో ఆనం కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. ఏసి.సుబ్బారెడ్డి కుమారుడు భక్తవత్సలరెడ్డి ఇందుకూరుపేట సమితి అధ్యక్షుడిగా రాజకీయ ప్రవేశం చేశారు. ఆయన 1972లో ఒంగోలు పార్లమెంట్ స్థానానికి జనతా పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత సర్వేపల్లి అసెంబ్లీ స్థానానికి పోటీచేసి పరాజయం పొందారు. ఏసి.సుబ్బారెడ్డి రాజకీయ స్ఫూర్తిగా వారి సంతానంలో రామనారాయణరెడ్డి, వెంకటరమణారెడ్డి, విజయకుమార్‌రెడ్డి రాజకీయాల్లో ముందుకు వెళుతున్నారు.
ఆనం వివేకానందరెడ్డి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించారు. ఆయన అనారోగ్యంతో తనువు చాలించినప్పటికీ సోదరులు రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆనం రామనారాయణరెడ్డి ఆత్మకూరు, రాపూరు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాష్ట్ర మంత్రివర్గంలో పనిచేశారు. కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రి వర్గంలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రిగా చక్రం తిప్పారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014లో కాంగ్రెస్ తరపున ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి పరాజయం పాలయ్యారు. అనంతరం టీడీపీలోకి వెళ్లినా అక్కడ ఇమడలేక వైఎస్సార్‌సీపీలో చేరారు. 2019 ఎన్నికల బరిలో వెంకటగిరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేస్తున్నారు. ఆయన సోదరుడు ఆనం విజయకుమార్‌రెడ్డి వైఎస్సార్‌సీపీలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో క్రియాశీలకంగా ఉన్నారు. ఆనం జయకుమార్‌రెడ్డి టీడీపీలో కొనసాగుతున్నారు. ఆనం వివేకానందరెడ్డి కుమారుడు రంగమయూర్‌రెడ్డి రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment