సాక్షి, (కావలి) నెల్లూరు : ‘ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. గత 10 రోజులుగా చంద్రబాబునాయుడు నోట్లో నుంచి ఒకే పేరు వినిపిస్తోంది. జగన్.. జగన్.. జగన్.. జగన్... కనీసం రోజుకు వంద సార్లు జగన్ పేరే చెబుతున్నారు. అయ్యా.. చంద్రబాబు మీరు మంచి పాలన చేస్తే.. ఆ పరిపాలన చూపించి ఓటు ఎందుకు అడగలేకపోతున్నారు. నీ ఎల్లో మీడియా నీ మంచి పాలన మీద చర్చపెట్టకుండా మా మీద ఎందుకు ఏడుస్తోంది.’ అని ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల ప్రచారలో భాగంగా బుధవారం ఆయన నెల్లూరు జిల్లా కావలి బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. మండుటెండను కూడా లెక్కచేయకుండా భారీగా తరలివచ్చిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జగన్ ఈ సభలో ఇంకా ఏమన్నారంటే..
చేయని అన్యాయం.. చేయని మోసం లేదు..
‘ఐదేళ్లుగా చంద్రబాబు ఆయన కొడుకు నారా లోకేష్ రాష్ట్రాన్ని అన్యాయంగా దోచేశారు. ఎప్పుడూ లేనంతగా దుష్టపాలన సాగిస్తున్నారు. వీరి పరిపాలన గురించి ఏ టీవీ చానెళ్లలో కూడా చర్చ జరగకుండా మ్యానేజ్ చేశారు. ప్రతిరోజు అధికారంలో లేని మమ్మల్ని విమర్శిస్తూ వారి డిబెట్లు జరుగుతూ ఉంటాయి. ఈ రోజు యుద్దం ధర్మానికి, అధర్మానికి జరుగుతోంది కాబట్టి వీటన్నిటిని మీరంతా గమనించాలి. ఈ దుర్మార్గపు చంద్రబాబు పాలన చూసి.. ఆయన కండువా కప్పుతానంటే కూడా దగ్గరకు వచ్చే వాళ్లు లేరు. ఆగండయ్యా అని ఆపితే కూడా ఎవ్వరు ఉండటం లేదు. చంద్రబాబుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో మనందరికి తెలుసు.
2014 ఎన్నికల్లో ఆయన ఏం చెప్పాడు.. ఏం చేశాడో అందరికి తెలుసు. అందుకే ఆయన పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. యాబై పేజీలతో మేనిఫెస్టో బుక్ ఇచ్చాడు. ఇందులో 12వ పేజీలో అయితే స్వయంగా చంద్రబాబు నాయుడు 12 వాగ్ధానాలు చేసి సంతకం కూడా పెట్టారు. ఇంటింటికి చంద్రబాబునాయుడు ఓ లేఖ కూడా పంపించారు. ఈ లెటర్ వచ్చినట్లు మీకు గుర్తుకుందా? ఈ ఎన్నికల ప్రణాళికలో దాదాపు 650 హామీలు ఇచ్చారు. రైతుల రుణమాఫీపై తొలి సంతకం. ఇవాళ అడుగుతున్నా.. మీ రుణాలు మాఫీ అయ్యాయా? ఆయన హయాంలో అధికారంలోకి వచ్చే నాటికి రూ. 87,612 కోట్ల వ్యవసాయ రుణాలు ఉంటే ఈయన చేసేంది వడ్డీలకు సరిపోలేదు. ఆ రుణాలు ఇవ్వాళ రూ. లక్షా 25 వేల కోట్లకు ఎగబాకాయి. డ్వాక్రా సంఘాలకు రుణాలు పూర్తిగా రద్దు చేస్తామన్నారు. మాఫీ అయ్యాయా.. అక్కా? ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మీ కింద రూ.85 వేలు డిపాజిట్ చేస్తా అన్నారు. చేశాడా.. అక్కా? జాబు కావాలంటే బాబు రావాలన్నారు.. ఇంటికో ఉద్యోగమన్నారు.. ఉపాధి దొరికే వరకు ఇంటింటికి రెండు వేలన్నారు.. మరీ ఉద్యోగం వచ్చిందా అన్నా? అక్కా వచ్చిందా? 60 నెలలకు ప్రతి ఇంటికి రూ. లక్షా ఇరువై వేలు బాకీ పడ్డారు ఈ పెద్దమనిషి. ఎన్టీఆర్ సుజల పథకం కింద రూ. 2లకు మినరల్ వాటర్ అన్నారు.. కనిపించిందా? బీసీలకు సబ్ ప్లాన్.. పేదవారికి మూడు సెంట్ల స్థలం.. ఇళ్లు వచ్చిందా? ఇలా చదువుతూపోతే.. చంద్రబాబు దారుణ మోసాలు తెలుస్తాయి.
మేనిఫెస్టో మాయం..
ఇవి సరిపోనట్లు ఎన్నికలు ముందు ఈ మాదిరిగానే మరోసారి ఫోజిస్తారు. మళ్లీ ఇటువంటివే చెప్పి.. మోసం చేసేందుకు కొత్త సినిమా స్టార్ట్ చేశారు. ఇప్పటి వరకు ఆయన తీసిన సినిమాలు చూసి చూసి.. చాలైన పరిస్థితిలో మళ్లీ 25 ఏళ్ల కుర్రాడిగా సిద్దమై మరో సినిమాకు సిద్దమవుతున్నారు. ఈ ఐదేళ్లలో ఆయన ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి చేశాడా? ఈ పెద్దమనిషి ఏం చేశాడో తెలుసా.. ఈ మేనిఫెస్టోను మాయం చేశాడు. ప్రజలు ఛీ కొడతారని టీడీపీ వెబ్‌సైట్స్‌లో కనబడకుండా చేశారు. ఇదిగో ఈ మేనిఫెస్టోలో ఉన్నవన్నీ చేశా.. చేశాను కాబట్టి ఓట్లేయండి అన్నట్లు మేనిఫెస్టో ఉండాలి. కానీ చంద్రబాబు అలాకాకుండా దోపిడీ ముఠాగా రాష్ట్రాన్ని దోచుకున్నారు. సర్వం దోచేశారు. ఏ ఒక్క వర్గానికి తానిచ్చిన మాటను నిలబెట్టుకోలేదు.
ఇప్పుడేం ఏమంటున్నాడో తెలుసా? నాలుగేళ్లు బీజేపీతో సంసారం చేస్తాడు. ఆయన ఈయనను పొగడితే.. ఈయన ఆయన పొగుడుతాడు. మంత్రులుగా కొనసాగుతారు. ఇక చివరి ఏడాది వచ్చేసరికి తానే బీజేపీ మీద పోరాడుతున్నానని బిల్డప్ ఇస్తారు. సొంత బావమరిది హరికృష్ణ శవం పక్కనే టీఆర్‌ఎస్ నేత కేటీఆర్‌తో డీల్ మాట్లాడుతారు. వాళ్లు కుదరదన్నారు.. అప్పుడు ఏం అనడు. అదే టీఆర్‌ఎస్‌తో తాను పోరాటం చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తాడు. ఆయన చేస్తే సంసారం.. ఇంకొకరు చేస్తే వ్యభిచారం. ఈ ఐదేళ్లలో చంద్రబాబును మీరంతా అతి దగ్గరగా చూశారు. ఆయన నైజాన్నీ, మోసాలను చూడమంటున్నా. ఆయనకు అభ్యర్థులు కరువై 175 స్థానాలకు ఒకేసారి ప్రకటించలేకపోయారు. మళ్లీ తమ నేతలను టీఆర్‌ఎస్ బెదిరిస్తుందంటారు. చంద్రబాబు నాయుడు పాలనలో 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొన్నారు. చంద్రబాబు నాయుడు నీవు మంచి పాలన చేస్తే.. నీ ఎల్లో మీడియా నీ పాలన మీద చర్చ పెట్టకుండా మా మీదపడి ఎందుకు ఏడుస్తుంది. ఈయనకు సరైన పాలన చేతకాక.. దొంగ ఓట్లను నమోదు చేయడం.. ఉన్న ఓట్లను తొలగించడం చేశారు.
అన్న అవకాశం ఇద్దామని చెప్పండి
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ చంద్రబాబు చేయని జిమ్మిక్కులు ఉండవు. గ్రామాల్లోకి డబ్బులు మూటలు పంపిస్తారు. అందుకే ప్రతి ఊరికి వెళ్లండి. ప్రతి ఒక్కరికీ చెప్పండి. చంద్రబాబుకు ఇచ్చే రూ.3వేలకు మోసపోవద్దని చెప్పండి. 20 రోజులు ఓపిక పట్టండి అక్కా అని చెప్పంది.
- చంద్రబాబు ఇచ్చే డబ్బులకు ఆశ పడకండి, అన్న ముఖ్యమంత్రి అవుతాడు, మన పిల్లలను బడికి పంపిస్తే, ప్రతి కుటుంబానికి ఏటా రూ.15,000 ఇస్తాడని చెప్పండి.
- విద్యార్థులు ఎక్కడ, ఏ కోర్సు చదివినా పూర్తి ఫీజు చెల్లిస్తాడని ప్రతి అక్కచెల్లెమ్మకు చెప్పండి. ఇంజనీరింగ్, డాక్టర్, ఎంబీఏ.. ఏ కోర్సు అయినా సరే, ఎంత ఫీజు అయినా సరే అన్న చదివిస్తాడని చెప్పండి. - అన్నను సీఎం చేసుకుందాం, పెట్టుబడి సాయం కింద నాలుగేళ్లలో రూ.50,000 ఇస్తాడని రైతన్నలకు చెప్పండి. ప్రతి ఏటా మేలో రూ.12,500 రైతుల చేతిలో పెడతాడని చెప్పండి. ప్రతి పంటకు కచ్చితంగా గిట్టుబాటు ధర కల్పిస్తాడని చెప్పండి.
- ‘వైఎస్సార్ చేయూత’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుడతాడని చెప్పండి. ఈ కార్యక్రమం కింద 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు వయసు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అక్క చేతిలో రూ.75,000 పెడతాడని చెప్పండి.
- అన్నను సీఎంను చేసుకుంటే, ఎన్నికల నాటికి ఉన్న అప్పును నాలుగు విడతల్లో నేరుగా మీ చేతికే ఇస్తాడని పొదుపు సంఘాల మహిళలకు చెప్పండి. సున్నా వడ్డీకే రుణాలు అందుతాయని, మీరు లక్షాధికారులు అవుతారని చెప్పండి.
- అవ్వాతాతల దగ్గరకు వెళ్లి ఒక మాట అడగండి. మీకు మూడు నెలల క్రితం దాకా ఎంత పెన్షన్ వచ్చేదని అడగండి. తమకు పెన్షన్ రావడం లేదని కొందరు చెబుతారు. ఇంకొందరు రూ.2,000 వస్తున్నాయని చెబుతారు. మరి జగనన్న లేకపోతే ఆ పెన్షన్ వచ్చేదా? అని అడగండి. జగన్ అన్నకు భయపడే చంద్రబాబు ఎన్నికలకు కేవలం మూడు నెలల ముందే పెన్షన్ పెంచాడని చెప్పండి.
- జగనన్న ముఖ్యమంత్రి అయితే పెన్షన్ రూ.3,000 దాకా పెంచుకుంటూ పోతాడని అవ్వాతాతలకు చెప్పండి.
కావలి నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రతాప్ కుమార్ రెడ్డి, నెల్లూరు ఎంపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డిలకు మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు కావాలి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి, ఫ్యాన్ గుర్తుకే మీ ఓటు వేయండి. వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి’ అని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు.
కావలిలో ఎగసిన జనకెరటం
Comments
Please login to add a commentAdd a comment