సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు సంబంధించిన డెడ్‌లైన్ దగ్గర పడుతుండడంతో పోలీసుశాఖలో రెండు రాష్ట్రాల డీజీపీ కార్యాలయాల ఏర్పాటుపై ఉన్నతాధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతం డీజీపీ కార్యాలయాన్ని తెలంగాణ రాష్ట్ర డీజీపీనకు, లక్‌డీకాఫూల్‌లోని రాష్ట్ర సీఐడీ కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ డీజీపీనకు కేటాయించాలని నిర్ణయించారు. అంతేకాకుండా పక్కనే ఉన్న హైదరాబాద్ రేంజ్ డీఐజీ కార్యాలయాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ డీజీపీ కార్యాలయానికే కేటాయించారు. రాష్ర్ట గవర్నర్ సలహాదారు సయ్యద్ సలావుద్దీన్‌తో మంగళవారం సచివాలయంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ ప్రతిపాననను అందజేశారు. ఈనెల 15 లోగా కీలకమైన పోలీసు శాఖను రెండుగా విభజించాలనే లక్ష్యంతో పోలీసు ఉన్నతాధికారులున్నారు.
ఇక ఏసీ గాడ్స్‌లోని సీఐడీ సైబర్‌క్రైమ్ కార్యాలయాన్ని ఎపీకి కేటాయించడంతోపాటు పక్కనే మరో భవనాన్ని కూడా అద్దెకు తీసుకుని ఈ విభాగానికి కేటాయించాలని నిర్ణయించారు. లక్డీకాపూల్‌లోని ఇంటెలిజెన్స్ కార్యాలయాన్ని రెండు రాష్ట్రాలకు కేటాయించారు. ప్రస్తుత డీజీపీ కార్యాలయంలోనే తెలంగాణ సీఐడీ కార్యాలయంతోపాటు మరి కొన్ని పోలీసు కార్యాలయాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. యూసుఫ్‌గూడలోని ఎపీఎస్పీ సాయుధ పటాలం ప్రధాన కార్యాలయం శౌర్యభవన్‌ను రెండు రాష్ట్రాలకు కేటాయించారు. రెడ్‌హిల్స్‌లోని రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ప్రధాన కార్యాలయాన్ని రెండుగా విభజించారు. వీటిని పరిశీలించిన డీజీపీ నేతృత్వంలోని అధికారుల బృందం చివరికి ఈ నిర్ణయానికి వచ్చి ప్రభుత్వానికి తెలియచేసింది. దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.