
గత ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన భారీ తాగునీటి ప్రాజెక్టు ఎట్టకేలకు మంజూరైంది. దీంతో బొబ్బిలి ప్రజల తాగునీటి కష్టాలు తీరే అవకాశం ఉంది. అన్నీ అనుకున్నట్టు జరిగి ప్రాజెక్టు పనులు ప్రారంభమై సకాలంలో పనులు పూర్తయితే రానున్న రోజుల్లో బొబ్బిలి ప్రజలకు తాగునీటి కష్టాలు తీరుతాయి. అయితే ప్రస్తుత పాలకులు, అధికారులు దీన్ని ఎంత కాలంలో పూర్తి చేస్తారోనన్న సందేహం ప్రజల్లో లేకపోలేదు.
బొబ్బిలి: బొబ్బిలి మున్సిపాలిటీకి భారీ తాగునీటి పథకం మంజూరైంది. రూ.98 కోట్లతో సీతానగరం మండలంలోని సువర్ణముఖి నదిలో భారీ ఇన్‌ఫిల్టరేషన్ బావులను ఏర్పాటు చేసి అధిక సామర్ధ్యం కలిగిన మోటార్లు, పైపులతో బొబ్బిలి పట్టణానికి తాగునీటిని అందించే బృహత్తర ప్రాజెక్టు గత ప్రభుత్వ హయాంలోనే ప్రతిపాదించారు. అయితే ఈ ప్రాజెక్టుకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. దీంతో అధికారులు దీనికి సంబంధించిన ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. పలుమార్లు ఈ పథకం గూర్చి ప్రజాప్రతినిధులు, అధికారులు ఎంతో కృషి చేశారు. అయితే ఈ ప్రాజెక్టు మంజూరైనప్పటికీ గతంలో జీఎస్టీ లేకపోవడంతో ఇప్పుడు జీఎస్టీ పన్నులను కలిపి తాజా ప్రతిపాదనలు తయారు చేయాలని కోరారు.
దీంతో గతంలోని రూ.98 కోట్ల ప్రతిపాదనలు ఇప్పుడు సుమారు 30 శాతం జీఎస్టీతో అది రూ.100 కోట్లకు పైగానే పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. ఈ తరహా కొత్త ప్రతిపాదనలను ఈ నెల 26లోగా పంపించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో మున్సిపల్ అధికారులు ఈ ప్రతిపాదనలను తయారు చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన బృందం వచ్చి పరిశీలనలు చేసి వెళ్లింది. ప్రతిపాదనలు పంపిన తరువాత ఈఎన్‌సీకి పంపించి ఆ తరువాత పరిపాలన ఆమోదంతో టెండర్లను పిలుస్తారు. వెయ్యి కిలోలీటర్ల చొప్పన మూడు ఓవర్ హెడ్ ట్యాంకులతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తారు. కొత్త తరహా విధానంలో ప్రాజెక్టు నిర్మాణం ఉంటుందని మున్సిపల్ డీఈఈ మహేశ్ తెలిపారు.
గెనటింగ్ విధానంలో మరమ్మతుల ప్రతిపాదనలు
ప్రస్తుతం మున్సిపాలిటీకి తాగునీరు అందిస్తున్న ట్యాంకులు లీకులతో ఉండటంతో కొత్తగా వీటిని మరమ్మతులు చేసేందకు రూ.35 లక్షలకు కేటాయించనున్నారు. పోలీసుస్టేషన్ ఎదురుగా ఉన్న ట్యాంకు పూర్తి లీకుల మయం కావడంతో దీనికి ఈ నిధులతో కొత్త విధానంలో మరమ్మతులు చేయనున్నారు. గెనటింగ్ అనే ఈ తరహా విధానంలో లూజ్ కాంక్రీట్‌ను తొలగించి పైపింగ్, స్ప్రేల ద్వారా కొత్త కాంక్రీటు, సిమెంట్ పేస్ట్‌లను లోనికి పంపిస్తారు. తద్వారా మరో పదేళ్ల పాటు ఈ ట్యాంకులు పనిచేసేలా చర్యలు తీసుకుంటామని, ఇందుకోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామనీ డీఈఈ మహేష్ విలేకర్లకు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment