
మంగంపేట గనుల్లో 19వ బెంచ్‌పై ఏర్పడ్డ సొరంగమార్గం, సొరంగంలో ఏర్పడ్డ రహస్య మార్గం
వైఎస్సార్ జిల్లా,మంగంపేట(ఓబులవారిపల్లె): వైఎస్సార్ జిల్లా మంగంపేట బెరైటీస్ గనుల్లో గురువారం తెల్లవారుజామున సొరంగమార్గం బయటపడింది. గనుల్లో సుమారు 26 బెంచ్‌లు ఉన్నాయి. 19వ బెంచ్‌లో తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో కార్మికులు ఖనిజాన్ని వెలికితీసే పనులు చేస్తున్నారు. ఈ సమయంలో రెండున్నర అంగుళాల వెడల్పు పదిమీటర్లమేర గొయ్యి ఏర్పడింది. వీరంతా గొయ్యివద్దకు చేరుకుని లైట్లువేసి పరిశీలించగా మనిషి వెళ్లడానికి అనువుగా లోపల సుమారు పదిమీటర్ల దూరం రహస్యమార్గం కనిపించింది. ఇంకా లోనికి వెళ్లడానికి ఊపిరి ఆడకపోవడంతో కార్మికులు బయటకు వచ్చేశారు.
విషయం తెలుసుకున్న మీడియా అక్కడికి చేరుకోగా ఏమీలేదని, సొరంగమార్గాన్ని మూసివేయడం జరిగిందని జనరల్‌మేనేజర్ కేథార్‌నా«థ్‌రెడ్డి ఎవరినీ అనుమతించలేదు. ఏ ప్రమాదం జరుగకుండా ఉండేందుకు సొరంగాన్ని మూసివేసినట్లు జీఎం తెలిపారు. మండలంలోని వైకోట ప్రాంతాన్ని మట్లిరాజులు పాలించారు. యుద్ధ సమయాల్లో శత్రువులనుంచి తమ సంపదను, కుటుంబాన్ని రక్షించుకోవడానికి అనేక సొరంగమార్గాలు ఏర్పాటు చేసుకున్నట్లు ఇక్కడి చరిత్ర చెబుతోంది. ఇందుకు నిదర్శనంగా మండలకేంద్రం సమీపంలోని నళ్లరాళ్లగుట్ట వద్ద రహస్య మార్గం ఉంది. బండరాళ్లను వేయడంతో ఇది పూడిపోయింది. ఈ మార్గం చిత్తూరుజిల్లా చంద్రగిరి కోట వరకు ఉందని, అప్పట్లో రాజులు ఈ రహస్యమార్గం గుండా ప్రయాణించేవారని ఇప్పటికీ ప్రచారంలో ఉంది. విషయం బయటపెట్టకుండా పురావస్తుశాఖకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఏపీఎండీసీ అధికారులు రహస్యమార్గాన్ని మూసివేయడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment