బినామీల గుండెల్లో... ‘ఆధార్’ రైళ్లు!
- వెలుగుచూసిన 615 నకిలీ పాస్ పుస్తకాలు
- రాయితీలకు ఇక మంగళం!
అనకాపల్లి : ఆధార్ అనుసంధానం బినామీల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. ఇన్నాళ్లు అక్రమంగా లబ్ధిపొందుతున్న వారికి కొమ్ముకాసే మధ్యవర్తులకు సైతం ఏం చేయాలో అర్థం కావడం లేదు. అన్ని అర్హతలు ఉండీ ప్రభుత్వ పథకాలు పొందలేని వారు కొందరుంటే, అడ్డదారిలో ఒక్కో పథకాన్ని రెండు ప్రాంతాల్లో రెండు సార్లు పొందిన ఘనులూ ఉన్నారు. ఇప్పుడు వీరి కథ బట్టబయలవుతోంది. పాసు పుస్తకాలు, రేషన్ కార్డు, అంగన్ వాడీ కేంద్రాలు, వసతి గృహ విద్యార్థులు, మధ్యాహ్న భోజన పథకం విద్యార్థులు, డ్వాక్రా గ్రూపులు, విద్యుత్ వినియోగదారులు ఇలా అన్ని వ్యవస్థల్లోని లబ్ధిదారుల వివరాలు ఆధార్‌తో అనుసంధానం కావడంతో అసలు రంగు బయటపడుతోంది.
కార్డుల రద్దు
అనకాపల్లిలో 10 రోజుల వ్యవధిలో రేషన్ కార్డుల ఆధార్ గణాంకాల అప్‌డేషన్‌లో 6,924 కార్డులను రద్దు చేశారు. రేషన్ కార్డుల ఆధార్ అనుసంధానంలో భాగంగా ఎన్‌రోల్‌మెంట్ ఐడెంటిఫికేషన్ నంబర్లు అధికంగా ఉండటంతో ఉన్నతాధికారులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఇక రెండేసి పాసు పుస్తకాలు పొందిన ఘనులు అనకాపల్లి పట్టణం, మండలంలోనూ ఉన్నారు.
ఈ రెండు చోట్ల 23వేల 483 రేషన్ కార్డులుండగా, 13 వేల 311 పాసు పుస్తకాల ఆధార్‌ను అనుసంధానం చేశారు. వీటిలో 615 పాసు పుస్తకాలు నకిలీవని అధికారులు తేల్చారు. మిగిలిన ప్రభుత్వ పథకాల అర్హత విషయంలో మాన్యువల్ ద్వారా అక్రమాలు జరిపేందుకు అవకాశం ఉన్నప్పటికీ ఆన్‌లైన్ ద్వారా ఆధార్ నంబర్ అనుసంధానం చేయడం వల్ల పూర్తి పారదర్శకత లభిస్తుంది.
అయితే ఇన్నాళ్లు ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు అందించే విషయంలో నైపుణ్యం ప్రదర్శించి లబ్ధిదారుల నుంచి నొక్కేసిన మధ్యవర్తులకు ఇప్పుడు గడ్డుకాలం వచ్చి పడింది. విద్యార్థులు పేర్లను అటూ, ఇటూ మార్చి మధ్యాహ్న భోజనం, వసతి గృహాల భోజనం మెనూను అధికంగా చూపించిన అధికారులు ఆధార్ ద్వారా వారి వివరాలను సైతం నమోదు చేయడం, విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల వ్యవహారాన్ని నిశిత దృష్టితో చూడటంతో ఇక మోసాలకు తావులేకుండా ఉండేందుకు అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
తాజాగా సామాజిక, ఆర్థిక, కుల గణన
ఆధార్‌తో ప్రభుత్వ పథకాల లబ్ధి విషయంలో ఇబ్బందులు పడుతున్న అక్రమార్కులకు తాజాగా సామాజిక, ఆర్థిక, కుల గణన నమోదు కొత్త చిక్కులను తెచ్చిపెడుతోంది. ఈ నెల10 నుంచి 19వ తేదీన వరకూ సంబంధింత గణనలో వివరాలను మార్పులు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. 2011లో చేసిన సర్వే మేరకు ఆర్థిక, సామాజిక, కుల గణన వివరాలు ఇప్పటికే పంచాయితీలకు చేరాయి.
ఈ కారణంగా కుటుంబ సభ్యుల పేర్లు, వృత్తి, విద్యార్హతలు, ఇంటి స్థితిగతులు, కుల, సామాజిక నేపథ్యం రికార్డు పరంగా ఆన్‌లైన్‌లో నమోదయితే ఇక మోసాలకు తావుంటే అవకాశం ఉండదు. తద్వారా బలహీన వర్గాలకు చెందిన వారు పొందాల్సిన పథకాలు ఇక అక్రమార్కుల దరి చేరవు. ఈ గణనలో ప్రతి ఒక్కరి వివరాలు యథాతథంగా నమోదైతే రాయితీలు హుళక్కే.