బినామీలపై సీఐడీ విచారణ
- రైతుల పేరుతో రుణాలు తీసుకున్న పెద్దమనుషులను వదలం
- కొండపి సదస్సులో సీఎం హెచ్చరిక
- 50 వేలలోపు రుణం చెల్లించవద్దు
- డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలిస్తాం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రైతుల పేరుతో కొందరు పెద్ద మనుషులు బినామీ రుణాలు పెద్ద ఎత్తున తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయని, వీటిపై సీబీసీఐడీ విచారణ జరిపిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఆయన సోమవారం కొండపి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన రైతు సాధికారత సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విజయనగరం, కడప, గుంటూరు జిల్లాల్లో వేరే వ్యక్తులు బినామీ పేర్లతో రుణాలు తీసుకున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.
ప్రకాశం జిల్లాలో కూడా అక్రమార్కులున్నారని, వారిపై సీబీసీఐడీ విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.రూ.50 వేలకన్నా తక్కువ రుణం తీసుకున్నవారు ఒక్కపైసా కూడా కట్టాల్సిన అవసరం లేదని, తామిచ్చే రుణవిముక్తి ఫారం ఇస్తే సరిపోతుందని స్పష్టంచేశారు. డ్వాక్రా మహిళలందరికీ ఒక్కొక్క సభ్యురాలికి రూ. పది వేల చొప్పున చెల్లించడానికి త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
డ్వాక్రా రుణమాఫీ ప్రకటించినప్పటి నుంచి రుణాలు చెల్లించని వాటికి పడిన వడ్డీని తామే చెల్లిస్తామని స్పష్టం చేశారు. 40 టీఎంసీల నీటిని వెలుగొండ ప్రాజెక్టు ద్వారా తీసుకువస్తే పశ్చిమ ప్రకాశం సస్యశ్యామలంగా మారుతుందన్నారు. ఇప్పటికే ప్రకాశం జిల్లాలో 46 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని, చిత్తూరు, అనంతపురంలో కరువు పరిస్థితులు వచ్చాయని తెలిపారు.
తొలుత రుణమాఫీ జరిగిన రైతులతో ముఖ్యమంత్రి మాట్లాడించారు. అనంతరం డ్వాక్రా మహిళలు మాట్లాడారు. వ్యవసాయం కోసం బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న తమకు పాస్ బుక్కులు లేవని రుణ మాఫీ ఇవ్వడం లేదని ఒక మహిళ చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లినా ఆయన స్పందించలేదు. కార్యక్రమంలో మంత్రులు పత్తిపాటి పుల్లారావు, శిద్దా రాఘవరావు, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్ధన్, డోలా వీరాంజనేయస్వామి, ఏలూరి సాంబశివరావు, కదిరి బాబూరావు, తదితరులు పాల్గొన్నారు.