సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా విశ్వభూషణ్ హరిచందన్ బుధవారం ఉదయం 11.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి ప్రవీణ్‌కుమార్ పదవీ ప్రమాణం చేయించారు. దీంతో విభజన తర్వాత ఏపీకి పూర్తి స్థాయి గవర్నర్‌గా విశ్వభూషణ్ బాధ్యతలు చేపట్టినట్టయింది.విజయవాడలోని రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. ఇంకా ఈ కార్యక్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారాం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ గౌతమ్ సవాంగ్, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, హైకోర్టు న్యాయమూర్తులు, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు, ప్రజాప్రతినిధులు, అఖిల భారత సర్వీసు అధికారులు, సీఎంవో కార్యాలయ అధికారులు, గవర్నర్ కార్యాలయ అధికారులు హాజరయ్యారు.
గవర్నర్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పురస్కరించుకుని రాజ్‌భవన్ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. గవర్నర్ ప్రమాణ స్వీకారానికి సీఎం, ఎమ్మెల్యేలు హాజరయ్యేందుకు వీలుగా శాసనసభను మధ్యాహ్ననికి వాయిదా వేశారు. దీంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో అసెంబ్లీ నుంచి రాజ్‌భవన్‌కు చేరుకున్నారు.
కాగా, ఒడిశాకు చెందిన విశ్వభూషణ్‌కు విశేష రాజకీయ అనుభవం ఉంది. భారతీయ జనసంఘ్‌లో 1971లో చేరడం ద్వారా రాజకీయ ప్రవేశం చేసిన విశ్వభూషణ్ హరిచందన్.. ఆ పార్టీ జాతీయ కార్యనిర్వాహక సభ్యునిగా, రాష్ట్ర జనరల్ సెక్రటరీగా పనిచేశారు. ఎమర్జెన్సీని వ్యతిరేకించినందుకు ఆయన 1975లో మీసా చట్టం కింద నిర్బంధానికి గురయ్యారు. 1977లో భారతీయ జనసంఘ్ జనతా పార్టీగా మారే వరకు ఆయన ఆ పదవుల్లో కొనసాగారు. తర్వాత బీజేపీలో చేరి 1980 నుంచి 1988 వరకు ఒడిశా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1988లో విశ్వభూషణ్ జనతా పార్టీలో చేరి తిరిగి మళ్లీ 1996 ఏప్రిల్‌లో బీజేపీలో చేరారు. ఆయనకు కవిత్వమంటే మక్కువ. మొరుబొత్తాస్, రాణా ప్రతాప్, శేషఝలక్, అష్టశిఖ, మానసి పుస్తకాలను ఒరియాలో రచించారు. ఒక నాటికనూ రచించారు. చారిత్రక ప్రదేశాలను సందర్శించడం ఆయనకెంతో ఇష్టం.
Comments
Please login to add a commentAdd a comment