'నాయుడు అంటే నాయకుడు అని గుర్తుపెట్టుకోండి'
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఎవరు అడ్డుకున్నా సహించేది లేదని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు హెచ్చరించారు. శనివారం విజయవాడ వచ్చిన ఆయనకు పార్టీ కార్యకర్తలు, నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో వెంకయ్య మాట్లాడుతూ ఇరు ప్రాంతాల మధ్య ప్రాంతీయ విభేదాలు సృష్టించవద్దని సూచించారు.ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా తప్పక లభిస్తుందన్నారు. ఆ నాయుడు...ఈ నాయుడు కుమ్మక్కయ్యారని వ్యాఖ్యలు సరికాదని, నాయుడు అంటే నాయకుడు అని గుర్తు పెట్టుకోవాలన్నారు.
పోలవరం ఆంధ్రా ప్రజల జీవన రేఖ అని వెంకయ్య అన్నారు. ముంపు మండలాలను తాము బంగ్లాదేశ్లో కలపలేదని... ఆరు మండలాలు అటు కలిసినా... ఇటు కలిసినా పోయేదేమీ లేదన్నారు. అలాగే తెలంగాణకు నష్టం జరగనివ్వమని వెంకయ్యనాయుడు అన్నారు. రెండు రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం సహకారం అందిస్తుందని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీపై దేశ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని వెంకయ్య పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి సమయం పడుతోందని ఆయన తెలిపారు.