
హైదరాబాద్ నుంచే బీజేపీ ఎన్నికల శంఖారావం!
సాక్షి, హైదరాబాద్: గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ హైదరాబాద్‌లో ఈనెల 11న జరిగే నవభారత యువభేరీలో ‘కొత్త ఆలోచనలు- కొంగొత్త ఆశల’తో సార్వత్రిక ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తారు. సమాజంలోని వివిధ వర్గాలను ఆకట్టుకునే క్రమంలో ప్రత్యేకించి యువత కోసం ఈ సదస్సును ఏర్పాటు చేశారు. 2014 ఎన్నికలలోగా దేశవ్యాప్తంగా నిర్వహించే 100 సదస్సుల్లో ఇది మొదటిది.
బీజేపీ ప్రచార కమిటీ రథ సారధిగా ఎంపికైన తర్వాత నరేంద్ర మోడీ పాల్గొంటున్న మొదటి భారీ సదస్సు కూడా ఇదే. ఈ సభలో తెలంగాణ సహా వివిధ అంశాలను ప్రస్తావించాలని భావించినా కాంగ్రెస్ ప్రకటనతో ఇప్పుడావకాశం పోయింది. దీంతో అభివృద్ధి, అవినీతి, యూపీఏ కుంభకోణాలు, విద్య, ఉపాధిపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. కాగా.. ప్రత్యేక విమానంలో వచ్చే నరేంద్రమోడీ పార్క్ హయత్‌లో బస చేస్తారు. మధ్యాహ్నం 1.15 గంటలకు వస్తారు. నేరుగా హోటల్‌కు వెళతారు. భద్రతా కారణాల రీత్యా పార్టీ కార్యక్రమాలు తప్ప ప్రైవేటువన్నీ రద్దు అయ్యాయి.
కాంగ్రెస్ వాళ్లు దద్దమ్మలు: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రకటన అనంతరం సీమాంధ్రలో చెలరేగిన ఉద్యమానికి కాంగ్రెస్ పాలకుల అసమర్థతే కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. సీమాంధ్రులకు వాస్తవాలు చెప్పి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని, కేంద్రంలో, రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలకులు చేతగాని దద్దమ్మలని మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన ఆకుల సత్యనారాయణ, కొప్పిశెట్టి సత్యనారాయణ, కరీంనగర్ జిల్లా కోరుట్లకు చెందిన పారిశ్రామికవేత్త, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు భూంరావ్ తదితరులు గురువారం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడారు.
రంగారెడ్డి కోర్టులో ఫిర్యాదు: మోడీకి వీసా ఇవ్వొందంటూ అమెరికా అధ్యక్షునికి లేఖ రాసిన 64 మంది పార్లమెంటు సభ్యులపై చర్య తీసుకోవాలంటూ న్యాయవాది చకిలం రఘునాథరావు రంగారెడ్డి కోర్టులో ఫిర్యాదు చేశారు.
బీసీ ఉద్యమానికి మద్దతు: చట్టసభల్లో బీసీలకు 50 శాతం సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ తాము చేపట్టిన ఉద్యమానికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతూ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య గురువారం బీజేపీ నాయకుల్ని కలిశారు. తమ డిమాండ్ల సాధనకు 19న పార్లమెంటు ముందు ధర్నా చేపట్టామని, దానికి మద్దతివ్వాలన్న కృష్ణయ్య విజ్ఞప్తికి కిషన్‌రెడ్డి అంగీకరించారు.