nava bharat yuvabhari
-
ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న యుపిఏ:మోడీ
-
ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న యుపిఏ:మోడీ
హైదరాబాద్: యుపిఏ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని బీజేపీ ప్రచార కమిటీ సారధి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ విమర్శించారు. ఎల్బి స్టేడియంలో ఈ సాయంత్రం జరిగిన నవభారత యువభేరీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. గాంధీ, వల్లభాయి పటేల్ పుట్టిన ప్రాంతం నుంచి తాను వచ్చినట్లు తెలిపారు. దేశం ప్రస్తుత పరిస్థితుల నుంచి త్వరలోనే బయటకు రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్‌కు సద్బుద్ధి ప్రసాదించమని దేవుడిని ప్రార్ధిస్తున్నానన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. దేశ ప్రజలు కాంగ్రెస్ నుంచి విముక్తి కోరుకుంటున్నారని చెప్పారు. విదేశాల్లో ఉన్న నల్లధనం తీసుకురావడానికి ఈ ప్రభుత్వానికి ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. సామాన్యుడికి మేలు చేయడంలో ఈ ప్రభుత్వం విఫలమైందన్నారు. గత 15 రోజులుగా జరుగుతున్న సంఘటనలు దేశంలో చర్చనీయాంశమవుతున్నాయి. అయిదుగురు జవాన్లను పాకిస్తాన్ సైన్యం హతమార్చింది. పాకిస్తాన్ పెట్రేగిపోతున్న ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు కూచుంది. ఇంత జరుగుతుంటే ప్రభుత్వం ఎక్కడ ఉందని దేశం మొత్తం ఆందోళన వ్యక్తం చేస్తోందన్నారు. జమ్మూలో మత ఘర్షణలు అమానుషం అని పేర్కొన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లను అడ్డుకోలేకపోతున్నారని, సరిహద్దు రేఖల వెంట భద్రతాలోపం ఆందోళన కలిగిస్తోందన్నారు. చైనా సరిహద్దుల నుంచి సైన్యాన్ని వెనక్కు రప్పించడం దౌర్బాగ్యస్థితిని తెలియజేస్తుందన్నారు. ఆంధ్ర, తెలంగాణ ప్రజలు సోదర భావంతో మెలగాలన్నారు. గుజరాత్ మాదిరిగా ఆంధ్ర, తెలంగాణలను అభివృద్ధి చేయాలన్నది తమ లక్ష్యం అన్నారు. అన్నదమ్ముల్లాంటి మీ మధ్య కాంగ్రెస్ మాదిరిగా తాము చిచ్చు పెట్టం అని చెప్పారు. రాష్ట్రంలో ఒకరినొకరు తిట్టుకునే పరిస్థితి కాంగ్రెస్ కల్పించిందన్నారు. విభజించు పాలించు అనేది కాంగ్రెస్ విధానం అన్నారు. ఓట్ల కోసమే కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణ ప్రకటించిందన్నారు. 2004లోనే ఎందుకు తెలంగాణ ప్రక్రియ ఎందుకు మొదలుపెట్టలేదని మోడీ అడిగారు. తెలంగాణ ఎంత ముఖ్యమో, సీమాంధ్ర కూడా అంతే ముఖ్యం అన్నారు. కాంగ్రేసేతర ప్రభుత్వాలు ఏర్పడటానికి ఎన్టీఆరే కారణం అన్నారు. కాంగ్రెస్ నుంచి దేశానికి విముక్తి లభిస్తేనే ఎన్టీఆర్‌కు నిజమైన నివాళి అన్నారు. కుటుంబ సభ్యులు వారించినా వినకుండా ఓ స్వాతంత్ర్య సమరయోధుడు ఈ సభకు రావడం ఆనందంగా ఉందన్నారు. యువతీయువకులతో స్టేడియం కిక్కరిసిపోయింది. ఈ స్టేడియంలో మీకు స్థలం దొరకకపోయినా నా హృదయంలో స్థానం ఉందని చెప్పారు. ఉత్తరాఖండ్ బాధితుల కోసం విరాళం ఇచ్చినవారందరికీ అభినందనలు తెలిపారు. -
కాంగ్రెస్ పాలనలో అధోగతిపాలైన దేశం:వెంకయ్య
-
కాంగ్రెస్ పాలనలో అధోగతిపాలైన దేశం:వెంకయ్య
హైదరాబాద్: కాంగ్రెస్ పాలనలో దేశం అధోగతిపాలైందని బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడు అన్నారు. ఎల్బి స్టేడియంలో నవభారత యువభేరీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పోవాలి - బిజెపి రావాలి - నరేంద్ర మోడీ కావాలి అన్నట్లు ఉందన్నారు. దేశంలో పేదరికం పెరిగింది, అక్కడ ఇక్కడ అనిలేదు, ఎక్కడబడితే అక్కడ అవినీతి తాండవిస్తోందని చెప్పారు. ఇక భూమ్మీద, భూ గర్భం కూడా కుంభకోణాలమయం అయిందన్నారు. ధరలు అన్నీ విపరీతంగా పెరిగిపోయాయన్నారు. బిజెపి యువతలో విశ్వాసం కలిగిస్తున్నట్లు చెప్పారు. నరేంద్ర మోడీ గురజాత్‌లో మూడు పర్యాయాలు ఘనవిజయం సాధించారు. గుజరాత్‌ను అభివృద్ధిపరిచారు. యువతకు అవకాశాలు ఇచ్చారని చెప్పారు. -
మోడీ సభ సందర్భంగా రేపు ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్ : రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ.. హైదరాబాద్ వేదికగా తన ప్రచారయుద్ధాన్ని మొదలుపెట్టనున్నారు. ఆదివారం నాడు ఆయన ఇక్కడి ఎల్బీ స్టేడియంలో ప్రభంజనం సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. రేపు 'నవభారత యువభేరి' పేరుతో హైదరాబాద్ నడిబొడ్డున ఎల్బీ స్టేడియంలో మోడీ సభ జరగనుంది. రేపు నరేంద్రమోడీ బహిరంగ సభ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 7గంటల వరకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని అడిషనల్ కమిషనర్ ట్రాఫిక్ అమిత్‌గార్గ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏఆర్ పెట్రోల్ పంపు జంక్షన్ నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వాహనాలకు అనుమతిలేదని చెప్పారు. అంతేకాకుండా ఆబిడ్స్, గన్‌ఫౌండ్రి నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వచ్చే వాహనాలకు అనుమతిలేదని తెలిపారు. దీంతో ట్రాఫిక్ ను నియంత్రించేందకు గన్‌ఫౌండ్రి నుంచి చాపెల్‌రోడ్డు వైపు ప్రత్యామ్నయ మార్గమని అమిత్‌గార్గ్ చెప్పారు. బషీర్‌బాగ్ జంక్షన్ నుంచి ఆబిడ్స్ జీపీవో వరకు వాహనాలకు అనుమతిలేదని అన్నారు. అటువైపు నుంచి వచ్చే వాహనాదారులు బషీర్‌బాగ్ జంక్షన్ నుంచి హైదర్‌గూడ మార్గంలో వెళ్లాలిని అమిత్‌గార్గ్ సూచించారు. -
నరేంద్ర మోడీ బహిరంగ సభకు తాకనున్న విభజన సెగ
హైదరాబాద్/ కడప: రాష్ట్ర విభజనపై నిరసనగా సీమాంధ్రలో ఉద్యమాలు, నిరసనలు, ర్యాలీలతో అట్టడుకిపోతోంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అంశంపై తమ నిర్ణయాన్ని సీడబ్య్లూసీ సమావేశంలో తీర్మానం చేసినా నాటినుంచి దాదాపు 10రోజులుగా సమైక్యంధ్ర రగలిపోతోంది. కేంద్రం తెలంగాణ ప్రకటనను వెలవబడటంతోనే సీమాంధ్ర ప్రాంతాలలో అందోళన వాతావారణం నెలకొంది. గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ ఏర్పాటు చేయాలంటూ తెలంగాణవాదులు తెచ్చినా ఒత్తిడితో కేంద్రం తలొగ్గి గత నెల జూలై 30న తెలంగాణ ప్రకటించింది. హైదరాబాద్ ను పది సంవత్సరాలపాటు ఉమ్మడి రాజధానిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ.. హైదరాబాద్ వేదికగా తన ప్రచారయుద్ధాన్ని మొదలుపెట్టనున్నారు. ఆదివారం నాడు ఆయన ఇక్కడి ఎల్బీ స్టేడియంలో ప్రభంజనం సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. 'నవభారత యువభేరి' పేరుతో హైదరాబాద్ నడిబొడ్డున ఎల్బీ స్టేడియంలో మోడీ సభ జరగనుంది. అయితే ప్రస్తుతం రాష్ర్టంలో గత కొన్నిరోజులుగా వేడిక్కిన విభజన సెగతో నరేంద్ర మోడీ సమావేశానికి ఆదరణ తగ్గనున్నట్టు తెలుస్తోంది. రాయలసీమనుంచి నాయకులు గానీ, కార్యకర్తులు గానీ ర్యాలీలో పాల్గొనడానికి సుముఖంగా లేరని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, గత నెల జూలై ఒకటి, రెండు తేదీలలో తిరుపతిలో బీజేపీ రాష్ట్ర కార్యనిర్శాహకుడు ఒకరు రాయలసీమ నాయకులను కలిశారు. బీజేపీ ర్యాలీలో సీమాంధ్ర ప్రాంతాలనుంచి దాదాపుగా 10వేల మంది పాల్గొవలసి ఉండగా, సమైక్యాంధ్ర నిరసన సెగతో 2వేలమంది వరకూ తగ్గారు. కానీ తెలంగాణ అంశంపై రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు ప్రాంతాల్లోని ఇరుప్రాంతాల కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో బీజేపీ కార్యకర్తలు, నాయకులు హైదరాబాద్ లో జరిగే బీజేపీ సమావేశానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాయలసీమలో దాదాపు వారంతా తమ నాయకత్వాన్ని వదిలేసినట్టేనని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ విషయంలో తమ భవిష్యత్తు కార్యచరణ ఏమిటి అన్నదానిపై వారు వివరించేందుకు సిద్ధంగాలేరని తెలుస్తోంది. బీజేపీ నాయకులు కూడా ఆ పార్టీ కార్యకర్తలను బుజ్జగించే ప్రయత్నం చేయలేకపోతున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే బీజీపీ ప్రచార కమిటీ అధ్యక్షుడుగా నరేంద్ర మోడీ సమావేశానికి రాయలసీమనుంచి మోడీ సమావేశానికి 400 నుంచి 500 మంది కంటే హాజరుకాకపోవచ్చుననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
హైదరాబాద్ నుంచే బీజేపీ ఎన్నికల శంఖారావం!
సాక్షి, హైదరాబాద్: గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ హైదరాబాద్‌లో ఈనెల 11న జరిగే నవభారత యువభేరీలో ‘కొత్త ఆలోచనలు- కొంగొత్త ఆశల’తో సార్వత్రిక ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తారు. సమాజంలోని వివిధ వర్గాలను ఆకట్టుకునే క్రమంలో ప్రత్యేకించి యువత కోసం ఈ సదస్సును ఏర్పాటు చేశారు. 2014 ఎన్నికలలోగా దేశవ్యాప్తంగా నిర్వహించే 100 సదస్సుల్లో ఇది మొదటిది. బీజేపీ ప్రచార కమిటీ రథ సారధిగా ఎంపికైన తర్వాత నరేంద్ర మోడీ పాల్గొంటున్న మొదటి భారీ సదస్సు కూడా ఇదే. ఈ సభలో తెలంగాణ సహా వివిధ అంశాలను ప్రస్తావించాలని భావించినా కాంగ్రెస్ ప్రకటనతో ఇప్పుడావకాశం పోయింది. దీంతో అభివృద్ధి, అవినీతి, యూపీఏ కుంభకోణాలు, విద్య, ఉపాధిపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. కాగా.. ప్రత్యేక విమానంలో వచ్చే నరేంద్రమోడీ పార్క్ హయత్‌లో బస చేస్తారు. మధ్యాహ్నం 1.15 గంటలకు వస్తారు. నేరుగా హోటల్‌కు వెళతారు. భద్రతా కారణాల రీత్యా పార్టీ కార్యక్రమాలు తప్ప ప్రైవేటువన్నీ రద్దు అయ్యాయి. కాంగ్రెస్ వాళ్లు దద్దమ్మలు: కిషన్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రకటన అనంతరం సీమాంధ్రలో చెలరేగిన ఉద్యమానికి కాంగ్రెస్ పాలకుల అసమర్థతే కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. సీమాంధ్రులకు వాస్తవాలు చెప్పి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని, కేంద్రంలో, రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలకులు చేతగాని దద్దమ్మలని మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన ఆకుల సత్యనారాయణ, కొప్పిశెట్టి సత్యనారాయణ, కరీంనగర్ జిల్లా కోరుట్లకు చెందిన పారిశ్రామికవేత్త, టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు భూంరావ్ తదితరులు గురువారం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడారు. రంగారెడ్డి కోర్టులో ఫిర్యాదు: మోడీకి వీసా ఇవ్వొందంటూ అమెరికా అధ్యక్షునికి లేఖ రాసిన 64 మంది పార్లమెంటు సభ్యులపై చర్య తీసుకోవాలంటూ న్యాయవాది చకిలం రఘునాథరావు రంగారెడ్డి కోర్టులో ఫిర్యాదు చేశారు. బీసీ ఉద్యమానికి మద్దతు: చట్టసభల్లో బీసీలకు 50 శాతం సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ తాము చేపట్టిన ఉద్యమానికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతూ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య గురువారం బీజేపీ నాయకుల్ని కలిశారు. తమ డిమాండ్ల సాధనకు 19న పార్లమెంటు ముందు ధర్నా చేపట్టామని, దానికి మద్దతివ్వాలన్న కృష్ణయ్య విజ్ఞప్తికి కిషన్‌రెడ్డి అంగీకరించారు. -
ముందువరుసలో సీట్లివ్వండి : నరేంద్ర మోడీ
సాక్షి, హైదరాబాద్: గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ ఈ నెల 11న హైదరాబాద్‌లో తలపెట్టిన ‘నవభారత యువభేరి’పై జనంలో రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. రాష్ట్రం నుంచేగాక ఇతర రాష్ట్రాలవారు సైతం ఈ సదస్సుకు హాజరయ్యేందుకు ఆసక్తి చూపుతున్నారు. ‘‘85 ఏళ్లు దాటిన నా మాతృమూర్తి మేరీ బెల్ హైదరాబాద్‌లో జరిగే మోడీ సదస్సుకు రావాలనుకుంటున్నారు. దయచేసి ముందు వరుసలో మాకో రెండు సీట్లు కేటాయించగలరు’’ అని పంజాబ్‌కు చెందిన ఆర్ఎస్ బియాన్స్ కోరారు. ఈ మేరకు తన వినతిని సామాజిక మీడియా ట్విట్టర్లో పోస్టు చేశారు. దీనిని చూసిన జనతాపార్టీ అధ్యక్షుడు సుబ్రమణ్యస్వామి వెంటనే మోడీకి పంపారు. మోడీ దానిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డికి పంపిస్తూ..‘‘పెద్దల ఆశీర్వాదాలు అవసరమని భావిస్తున్నా. వయోవృద్ధురాలైన ఈ మాతృమూర్తి హైదరాబాద్ సభకు రావాలనుకుంటున్నారు. అవసరమైన ఏర్పాట్లు చేయగలరు’’ అని కోరారు. దీనికి కిషన్‌రెడ్డి అంగీకరించారు. ఇదే విషయాన్ని ప్రస్తుతం జర్మనీలో ఉన్న మేరీ బెల్ కుమారుడు బియాన్స్‌కు తెలియజేశారు. కాగా.. మోడీ పేరిట ఇప్పటికే నమో సెల్ఫోన్లు విడుదల కాగా త్వరలో ‘నమో’ ఐప్యాడ్స్ రాబోతున్నాయి. స్మార్ట్ అప్లికేషన్లు అన్నీ ఇందులో ఉంటాయి. మోడీ విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకునేలా వీటిని ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నారు. -
‘యువభేరి’ని విజయవంతం చేయాలి
సూర్యాపేట, న్యూస్‌లైన్: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ రాక సందర్భంగా నిర్వహించే నవ భారత్ యువభేరి సమ్మేళనాన్ని విజయవంతం చేసేందుకు బీజేపీ నాయకులు కృషి చేయాలని కేం ద్ర హోంశాఖ మాజీ మంత్రి, పార్టీ జాతీ య కార్యవర్గ సభ్యుడు చెన్నంనేని విద్యాసాగర్‌రావు కోరారు. శనివారం పట్టణంలోని కిరాణ ఫ్యాన్సీ మర్చంట్ అసోసియేషన్ భవనంలో నిర్వహించిన బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ కేవలం ఎన్నికల కోసమే పని చేయదన్నారు. నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం, దేశం అభివృద్ధి కోసం పాటు పడుతుందన్నారు. దేశ ప్రజలంతా బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు కనీవినీ ఎరుగని రీతిలో అవినీతి కుంభకోణాలకు పాల్పడ్డారన్నారు. కేంద్ర టెలికాం మాజీ మంత్రి రాజా సుమారు లక్షా 76వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారన్నారు. ఈ అవినీతి డబ్బుతో దేశంలోని రైతులకు సంబంధించిన రుణాలను మూడు సార్లు మాఫీ చేయవచ్చని చెప్పారు. అవినీతి కాంగ్రెస్‌ను అంతమొందించేందుకు ప్రజలు సిద్ధం కావాలని కోరా రు. మోడీ కి తాము ప్రచార బాధ్యతలు అప్పగిస్తే ప్రజలు దేశ ప్రధాని బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారన్నా రు. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి, రాష్ర్ట ఉపాధ్యక్షుడు చింత సాంబమూర్తి, కిసాన్‌మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూదన్‌రెడ్డిలు మాట్లాడుతూ తెలంగాణ పునర్నిర్మాణం జరిగే వరకు ప్రజలంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం ఇటీవల జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలపర్చిన అభ్యర్థులుగా నిలబడి గెలుపొందిన వారిని సన్మానించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు వీరెల్లి చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ జిల్లా ఇన్చార్జి ప్రేమ్‌రాజ్ యాదవ్, నాయకులు బెజవాడ శేఖర్, రామినేని ప్రభాకర్, బాకి పాపయ్య, నూనె సులోచన, వీరారెడ్డి, దర్శనం వేణు, నళిని, రామకృష్ణ, బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి రవికుమార్, వెంకటనారాయణరెడ్డి, శ్యాం సుందర్, ఓరుగంటి రాములు, సాం బయ్య, వెంకటేశం, నాగరాజు, ఉప్పల సంపత్‌కుమార్, చల్లమళ్ల నర్సింహ్మ, బెరైడ్డి సంజీవరెడ్డి, కొండేటి ఏడుకొండలు, పాండురంగాచారి, మంచాల రంగయ్య, రమేష్, జానకి రాములు, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.