గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ ఈ నెల 11న హైదరాబాద్‌లో తలపెట్టిన ‘నవభారత యువభేరి’పై జనంలో రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది.
సాక్షి, హైదరాబాద్: గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ ఈ నెల 11న హైదరాబాద్‌లో తలపెట్టిన ‘నవభారత యువభేరి’పై జనంలో రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. రాష్ట్రం నుంచేగాక ఇతర రాష్ట్రాలవారు సైతం ఈ సదస్సుకు హాజరయ్యేందుకు ఆసక్తి చూపుతున్నారు. ‘‘85 ఏళ్లు దాటిన నా మాతృమూర్తి మేరీ బెల్ హైదరాబాద్‌లో జరిగే మోడీ సదస్సుకు రావాలనుకుంటున్నారు. దయచేసి ముందు వరుసలో మాకో రెండు సీట్లు కేటాయించగలరు’’ అని పంజాబ్‌కు చెందిన ఆర్‌ఎస్ బియాన్స్ కోరారు. ఈ మేరకు తన వినతిని సామాజిక మీడియా ట్విట్టర్‌లో పోస్టు చేశారు. దీనిని చూసిన జనతాపార్టీ అధ్యక్షుడు సుబ్రమణ్యస్వామి వెంటనే మోడీకి పంపారు.
మోడీ దానిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డికి పంపిస్తూ..‘‘పెద్దల ఆశీర్వాదాలు అవసరమని భావిస్తున్నా. వయోవృద్ధురాలైన ఈ మాతృమూర్తి హైదరాబాద్ సభకు రావాలనుకుంటున్నారు. అవసరమైన ఏర్పాట్లు చేయగలరు’’ అని కోరారు. దీనికి కిషన్‌రెడ్డి అంగీకరించారు. ఇదే విషయాన్ని ప్రస్తుతం జర్మనీలో ఉన్న మేరీ బెల్ కుమారుడు బియాన్స్‌కు తెలియజేశారు. కాగా.. మోడీ పేరిట ఇప్పటికే నమో సెల్‌ఫోన్లు విడుదల కాగా త్వరలో ‘నమో’ ఐప్యాడ్స్ రాబోతున్నాయి. స్మార్ట్ అప్లికేషన్లు అన్నీ ఇందులో ఉంటాయి. మోడీ విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకునేలా వీటిని ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నారు.