హైదరాబాద్ : రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ.. హైదరాబాద్ వేదికగా తన ప్రచారయుద్ధాన్ని మొదలుపెట్టనున్నారు. ఆదివారం నాడు ఆయన ఇక్కడి ఎల్బీ స్టేడియంలో ప్రభంజనం సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. రేపు 'నవభారత యువభేరి' పేరుతో హైదరాబాద్ నడిబొడ్డున ఎల్బీ స్టేడియంలో మోడీ సభ జరగనుంది. రేపు నరేంద్రమోడీ బహిరంగ సభ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 7గంటల వరకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని అడిషనల్ కమిషనర్ ట్రాఫిక్ అమిత్‌గార్గ్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఏఆర్ పెట్రోల్ పంపు జంక్షన్ నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వాహనాలకు అనుమతిలేదని చెప్పారు. అంతేకాకుండా ఆబిడ్స్, గన్‌ఫౌండ్రి నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వచ్చే వాహనాలకు అనుమతిలేదని తెలిపారు. దీంతో ట్రాఫిక్ ను నియంత్రించేందకు గన్‌ఫౌండ్రి నుంచి చాపెల్‌రోడ్డు వైపు ప్రత్యామ్నయ మార్గమని అమిత్‌గార్గ్ చెప్పారు. బషీర్‌బాగ్ జంక్షన్ నుంచి ఆబిడ్స్ జీపీవో వరకు వాహనాలకు అనుమతిలేదని అన్నారు. అటువైపు నుంచి వచ్చే వాహనాదారులు బషీర్‌బాగ్ జంక్షన్ నుంచి హైదర్‌గూడ మార్గంలో వెళ్లాలిని అమిత్‌గార్గ్ సూచించారు.