
మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, వేదికపై పార్టీ నాయకులు
గుంటూరు వెస్ట్ : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ పట్టాభిషేకం ఆద్యంతం ఉత్సాహభరితంగా కొనసాగింది. శనివారం ఉదయం గన్నవరం విమానాశ్రయంలో దిగిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ను కన్నా తనయుడు నాగరాజు స్థానిక కన్నావారితోటకు తీసుకొచ్చారు. అనంతరం సిద్ధార్థ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి చేరుకున్నారు. విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు కన్నాకు నూతన రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. బీజేపీకి బాహుబలిగా కన్నాను వక్తలు వర్ణించారు..
చంద్రబాబుపై విరుచుకుపడిన నాయకులు
సభలో మాజీ మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ 1983లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్‌టీఆర్ తెలుగు దేశం పార్టీని స్థాపించారన్నారు. చేసేవన్నీ ధారుణాలైనప్పుడు ధర్మ పోరాట దీక్ష చేయడంలో అర్థమేంటని ప్రశ్నించారు. మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ 2019 టీడీపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. సినీ నటి కవిత మాట్లాడుతూ చంద్రబాబు మాటలు శివారెడ్డి మిమిక్రీలాగా ఉంటున్నాయన్నారు. చంద్రబాబు నీచత్వాన్ని చూసి ఎన్‌టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని చెప్పారు. శాసన సభ్యుడు విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ కర్ణాటకలో తన వల్లే బీజేపీ ఓడిపోయిందనడం పెద్ద జోక్‌గా ఉందన్నారు. ఆయన అవినీతి బాగోతం ఎక్కడ బయటికొస్తుందోనని ప్రజల ముందుకొచ్చి కపట నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. మాజీ కేంద్ర మంత్రి, సినీ నటుడు కృష్ణం రాజు మాట్లాడుతూ చంద్రబాబు అభద్రతాభావానికి లోనవుతున్నారన్నారు.
పార్టీలో చేరిన మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు
కన్నా సమక్షంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు శరత్ బీజేపీలో చేరారు. ఆయనతోపాటు 13 జిల్లాల అధ్యక్షులను కన్నా సాదరంగా ఆహ్వానించి కండువాలను కప్పారు.
Comments
Please login to add a commentAdd a comment