
బీజేపీని బలోపేతం చేయాలి
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్
రైలుపేట (గుంటూరు): బీజేపీని గ్రామ స్థాయిలో బలోపేతం చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం గుంటూరు హౌసింగ్ బోర్డు మామిడి గార్డెన్స్‌లో బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన డాక్టర్ నలబోతు వెంకటరావుకు అభినందన సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి కామినేని మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ పదవీ బాధ్యతలు చేపట్టాక ప్రపంచంలో అత్యంత ఆకర్షణీయమైన నాయకుడిగా నెంబర్‌వన్ స్థానాన్ని దక్కించుకున్నట్లు వెల్లడించారు. అమిత్‌షా సారథ్యంలో పది కోట్ల మంది సభ్యులతో ప్రపంచంలో అత్యధిక సభ్యులు కలిగిన ఏకైక పార్టీగా బీజేపీ అవతరించిందన్నారు. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడ్డాక చిన్న అవినీతి మరక కూడా లేకుండా పరిపాలన సాగిస్తోందని పేర్కొన్నారు. పార్టీ బలోపేతం బాధ్యత అందరిపై ఉందని, బడుగు, బలహీన వర్గాల కోసం కేంద్రం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అందరికి వివరించి పార్టీ వైపు ఆకర్షితులయ్యేలా చేయాలన్నారు.
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యామ్‌కిషోర్ మాట్లాడుతూ సీనియర్ నాయకులను కలుపుకుని అందరూ కలిసి పార్టీ బలోపేతానికి కషి చేయాలని కోరారు. సభకు బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు పొట్రు పూర్ణచంద్రరావు అధ్యక్షత వహించారు. పార్టీ నేతలు ఆర్.లక్ష్మీపతి, యడ్లపాటి రఘునాధబాబ, యడ్లపాటి స్వరూపరాణి, కొత్తూరి వెంకటసుబ్బారావు, గౌస్‌మొహిద్దీన్, అమ్మిశెట్టి ఆంజనేయులు, తదితరులు అభినందన సభలో మాట్లాడారు. జిల్లాలో నూతనంగా ఎంపికైన 54 మంది మండల అధ్యక్షులు, పలువురు పార్టీ నేతలు కార్యక్రమానికి హాజరయ్యారు.