'టీడీపీ సభ్యత్వం ఉంటే బీజేపీలో చేర్చుకోం'
హైదరాబాద్: టీడీపీ సభ్యత్వం ఉన్నవారికి బీజేపీ సభ్యత్వం ఇవ్వమని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, బీజేపీ నాయకుడు కామినేని శ్రీనివాస్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీని బలపరుచుకోవడం అంటే టీడీపీని దెబ్బతీయడం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. మంగళవారం హైదరాబాద్లో కామినేని శ్రీనివాస్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... రాష్ట్రంలో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బలమైన నాయకుడని... అందుకే ఆయన్ని తమ పార్టీలో చేర్చుకున్నామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని నామినేటెడ్ పోస్టుల భర్తీలో బీజేపీకి ప్రాధాన్యత లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
సీఎం చంద్రబాబు వేగాన్ని తాము అందుకోలే పోతున్న మాట వాస్తవమేనని చెప్పారు. తమ పని తీరు ఎలా ఉందనేది చంద్రబాబే నిర్ణయిస్తారని తెలిపారు. పారదర్శకమైన పాలనతో తన శాఖను నడిపిస్తున్నాని పేర్కొన్నారు. రాష్ట్రానికి 850 మెడికల్ సీట్లు తీసుకొచ్చామన్నారు. ఉద్యోగుల హెల్త్ పాలసీపై ప్రైవేట్ ఆస్పత్రులు ప్యాకేజీలు మార్చమని తమ శాఖను కోరాయని తెలిపారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పన్ను రాయితీలు తదితర అంశాలపై కేంద్రం ఇచ్చిన హామీలు ఎప్పుడు నుంచి అమలవుతాయన్న దానిపై ఇంకా తమకు స్పష్టత లేదన్నారు. విభజన నేపథ్యంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన సహాయం ఆలస్యంమవుతున్న మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. ఆ సహాయం కోసం తాము ప్రయత్నించడం లేదనడం వాస్తవం కాదన్నారు. రాష్ట్రానికి రావాల్సిన ప్యాకేజీల కోసం కేంద్ర మంత్రి ఎం. వెంకయ్యనాయుడు తన ప్రయత్నాలను ముమ్మరం చేశారని గుర్తు చేశారు. అయితే రాష్ట్రసాయం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీకి కొన్ని పరిమితులు ఉన్నాయని... కేంద్రానికి కూడా ఆర్థికపరమైన ఇబ్బందులున్నాయని కామినేని తెలిపారు.