కమలంతో కయ్యం
సాక్షి ప్రతినిధి, ఏలూరు:అధికారంలోకి వచ్చి మూడునెలల ముచ్చట కూడా తీరకుండానే తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, మిత్రపక్ష పార్టీల నేతల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. ప్రధానంగా అధికారంలో భాగస్వామ్య పక్షమైన బీజేపీ నేతలతో కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులకు ఏ మాత్రం పొసగడం లేదు. వారిమధ్య వర్గ రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. ఇరుపార్టీల నేతల అనుచరులు నేరుగా పత్రికలకెక్కే విధంగా విభేదాలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. అనివార్య పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలోకి వచ్చి అనూహ్యంగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నేత పితాని సత్యనారాయణ ఇంకా టీడీపీ వ్యవహారాల్లో పూర్తిగా కుదురుకున్న పరిస్థితి కనిపించడం లేదు.
ఇటీవల ఆచంట మండల పరిషత్ సమావేశంలో స్వయంగా ఆయనే సొంత పార్టీ నేతలు కొం దరు తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఆచంటలో తెలుగుదేశం పార్టీ రెండువర్గాలుగా చీలిపోయింది. కొంతమంది పితాని వెంట నడుస్తుండగా, మరో వర్గం నేతలు ఆచంట నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి గొడవర్తి శ్రీరాములును అనుసరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు జిల్లా రాజకీయాలను సైతం శాసించిన పితాని ఇప్పుడు సొంత నియోజకవర్గంలోనే పట్టు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగాబీజేపీ నేతలతో వైరుధ్యం ఆయనకు మరో తలనొప్పిగా పరిణమించింది. జిల్లాకు చెందిన దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు ఇటీవల ఆచంట నియోజకవర్గంలో జరిపిన పర్యటనకు పితాని గైర్హాజరు కావడం వివాదాస్పదమైంది.
వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నేపథ్యంలో జిల్లాలోని పుష్కర ఘాట్‌లను సందర్శించి.. చేపట్టాల్సిన చర్యలపై ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులతో చర్చించేందుకు మంత్రి ఈ పర్యటన చేపట్టారు. నరసాపురం నుంచి కొవ్వూరు వరకు ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు మంత్రి వెంటవుండి రేవుల్లో చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. కానీ ఆచంట పరిధిలోకి వచ్చేసరికి పితాని గైర్హాజరు కావడంతోపాటు కనీసం ఎక్కడా ఆయన అనుచరులు కూడా పాల్గొనలేదు.
అక్కడితో వదలకుండా పితాని అనుచరులు మంత్రి మాణిక్యాలరావు తమ నేతకు కనీస సమాచారం ఇవ్వకుండా పర్యటించారంటూ పత్రికలకెక్కారు. ఇందుకు ప్రతిగా బీజేపీ నేతలు కూడా ఎదురుదాడికి దిగారు. మంత్రి పర్యటన వివరాలకు సంబంధించి నాలుగురోజులు ముందుగానే సమాచారం ఇచ్చామని, ఈ మేరకు అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలూ పాల్గొన్నారని చెప్పుకొస్తూ పితాని వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. ఆచంట నియోజకవర్గం పరిధిలో మూడు పుష్కర ఘాట్‌లు ఉన్నాయని, మరి వాటి అభివృద్ధి పితానికి పట్టదా అని బీజేపీ నాయకులు గట్టిగానే ప్రశ్నిస్తున్నారు.
ఎన్నికల నాటి నుంచే విభేదాలు
వాస్తవానికి బీజేపీ నేతలకు, పితానికి మధ్య ఎన్నికల నాటినుంచే విభేదాలు ఉన్నాయంటున్నారు. నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజుకు ఎన్నికల్లో అన్ని అసెంబ్లీ సెగ్మెం ట్లలో మెజారిటీ రాగా, ఒక్క పితాని ప్రాతినిధ్యం వహిం చిన ఆచంటలోనే 12వేలకు పైగా మెజార్టీ తగ్గింది. దీనిపై అప్పట్లోనే భిన్న వాదనలు వినిపించాయి. ఇది మనసులో పెట్టుకునే బీజేపీ నేతలు, నియోజకవర్గంలోని ఓ సామాజిక వర్గం నేతలు చక్రం తిప్పి తమ నేతకు మంత్రి పదవి రాకుండా అడ్డుకున్నారని పితాని అనుచరులు భావిస్తున్నారు. ఈ కారణంగా మంత్రి పర్యటనకు పితాని దూరంగా ఉన్నారంటున్నారు. మరోవైపు తమకు ప్రాధాన్యం ఇవ్వకుండా పర్యటిస్తే ఎవరి పర్యటనకైనా దూరంగా ఉంటామన్న సంకేతాలను అధికార పార్టీకి చెందిన మంత్రులకు ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే పితాని వర్గీయులు ఆ విధంగా వ్యవహరించారన్న వాదనలూ లేకపోలేదు.