ఒంగోలు టౌన్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పెద్ద నోట్లను రద్దు చేసిన నవంబర్ 8వ తేదీని బ్లాక్‌డేగా పాటించాలని సీపీఎం, సీపీఐ ఉమ్మడి సమావేశం నిర్ణయించింది. జిల్లాలోని తాలూకా, మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు, సభలు జరపాలని నిర్ణయించింది. శనివారం స్థానిక సుందరయ్య భవన్‌లో జరిగిన సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు, సీపీఐ జిల్లా కార్యదర్శి కె.అరుణ మాట్లాడారు. గతేడాది నవంబర్ 8వ తేదీ చలామణిలో ఉన్న 17 లక్షల 97 వేల కోట్ల రూపాయల 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేశారన్నారు. నల్లధనాన్ని పట్టుకోవడం కోసం, అవినీతిని అంతం చేయడం కోసం, ఉగ్రవాదుల ఆర్థిక మూలాలను దెబ్బతీయడం, నకిలీ కరెన్సీని దెబ్బతీసే లక్ష్యాలతో పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారని గుర్తు చేశారు. పెద్ద నోట్లు రద్దు చేసి సంవత్సరం గడిచిపోయినా నరేంద్రమోదీ ప్రకటించిన లక్ష్యాలు ఒక్కటీ నెరవేరకపోగా అవినీతి, ఉగ్రవాదం పెరిగిపోయాయని ధ్వజమెత్తారు. నల్లధనం పట్టుకోలేదన్నారు. కొత్త నకిలీ కరెన్సీ చెలామణి అవుతోందని విమర్శించారు.
నోట్ల రద్దు దుష్ఫలితాలను మాత్రం ప్రజలు అనుభవిన్తూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం దెబ్బతినడంతో పాటు చిన్న పరిశ్రమలు మూతపడ్డాయన్నారు. ఉత్పత్తి రంగం కుదేలై ఉపాధి పడిపోయిందన్నారు. కార్పొరేట్ కంపెనీలకు అత్యధిక లాభాలు వచ్చిన సంవత్సరంగా ఈ సంవత్సరం నమోదైందన్నారు. ఆన్‌లైన్ వ్యాపారాన్ని పెంచి రిటైల్ రంగాన్ని దెబ్బతీసి పెద్ద మాల్స్‌కు ఉపయోగపడేలా నరేంద్రమోదీ వ్యవహరించారని విమర్శించారు. నోట్ల రద్దు దుష్ఫలితాలతో దేశవ్యాప్తంగా ప్రజల్లో నిరసన పెల్లుబికిందని చెప్పారు. సుప్రీంకోర్టు సైతం నోట్ల రద్దు నల్ల కుబేరులపై సర్జికల్ దాడుల్లా ఉండాలిగానీ, ప్రజలపై కార్పెట్ బాంబులా ఉండకూడదని వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తుచేశారు. వామపక్షాలు దేశవ్యాప్తంగా నిరసనలు తెలియజేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. సీపీఎం రాష్ట్ర నాయకుడు జాలా అంజయ్య, నగర కార్యదర్శి జీవీ కొండారెడ్డి, సీపీఐ నగర కార్యదర్శి ఉప్పుటూరి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment